హెచ్‌సీఎల్ టెక్ లాభం 64% అప్
న్యూఢిల్లీ: దేశంలో నాలుగో అతిపెద్ద ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఆకర్షణీయమైన ఫలితాలతో ఆకట్టుకుంది. ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన క్వార్టర్(క్యూ1)లో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం 63.8 శాతం ఎగబాకి రూ.1,416 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే క్వార్టర్లో లాభం రూ.864 కోట్లు మాత్రమే. డాలరుతో రూపాయి మారకం విలువ భారీగా క్షీణించడం, అంతర్జాతీయంగా మెరుగుపడుతున్న స్థూల ఆర్థిక పరిస్థితులతో ఐటీకి డిమాండ్ పుంజుకోవడం వంటివి ఇతర ఐటీ కంపెనీల మాదిరిగానే హెచ్‌సీఎల్ టెక్కు కూడా కలిసొచ్చాయి. ఇక సెప్టెంబర్ క్వార్టర్లో కన్సాలిడేటెడ్ ఆదాయం రూ.6,069 కోట్ల నుంచి రూ.7,961 కోట్లకు వృద్ధి చెందింది.
31.2 శాతం వృద్ధిని సాధించింది. కంపెనీ ఆర్థిక ఫలితాలకు జూలై-జూన్ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణనలోకి తీసుకుంటుంది.త్రైమాసిక ప్రాతిపదికన(ఏప్రిల్-జూన్ క్వార్టర్‌తో పోలిస్తే) హెచ్‌సీఎల్ టెక్ ఆదాయం(డాలర్ల రూపంలో) 3.5 శాతమే వృద్ధి చెందింది. టీసీఎస్ 5.4 శాతం, ఇన్ఫోసిస్ 3.8 శాతం వృద్ధిని నమోదు చేశాయి. పోటీ కంపెనీలతో చూస్తే సీక్వెన్షియల్ ఆదాయ పెరుగుదల విషయంలో హెచ్‌సీఎల్ టెక్ నిరాశపరిచిందని మార్కెట్ విశ్లేషకులు వ్యాఖ్యానించారు. డాలరు రూపంలో కంపెనీ సెప్టెంబర్ క్వార్టర్ నికర లాభం 42.8 శాతం వృద్ధితో 22.56 కోట్ల డాలర్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే క్వార్టర్లో లాభం 15.8 కోట్ల డాలర్లు. కాగా, ఆదాయం 111 కోట్ల డాలర్ల నుంచి 14.1 శాతం వృద్ధితో 127 కోట్ల డాలర్లకు పెరిగింది.
ఇతర ముఖ్యాంశాలివీ...
కంపెనీ వాటాదారులకు రూ. 2 ముఖవిలువగల ఒక్కో షేరుపై రూ.2 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. డివిడెండ్‌కు రికార్డు తేదీ ఈ నెల 31. క్యూ1లో 11 కొత్త క్లయింట్లు జతయ్యారు. ఇందులో 6 కాంట్రాక్టులు 2 కోట్ల డాలర్ల విలువైనవి కాగా.. 4 కోట్ల డాలర్లు, 10 కోట్ల డాలర్ల కాంట్రాక్టులు చెరొకటి ఉన్నాయి. సెప్టెంబర్ చివరినాటికి కంపెనీ వద్ద 9.68 కోట్ల డాలర్ల విలువైన నగదు తత్సబంధ నిల్వలు ఉన్నాయి. జూన్ క్వార్టర్ అంతానికి ఈ నిధుల విలువ 12.33 కోట్ల డాలర్లు.
విస్తరణలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా 16-17 సెంటర్లను(31 వేల కొత్త సీట్ల సామర్థ్యం) ఏర్పాటు చేస్తున్నట్లు కంపెనీ సీఎఫ్ఓ అనిల్ చనానా చెప్పారు. వీటిలో మూడు ప్రధాన క్యాంపస్‌లు భారత్‌లో(నోయిడా, బెంగళూరు, చెన్నై) నెలకొల్పుతున్నట్లు వెల్లడించారు. క్యూ1లో నికరంగా 1,691 మంది సిబ్బందిని కంపెనీ నియమించుకుంది. దీంతో మొత్తం హెచ్‌సీఎల్ టెక్ ఉద్యోగుల సంఖ్య సెప్టెంబర్ చివరికి 87,196కు చేరింది. కంపెనీ షేరు ధర బీఎస్ఈలో గురువారం 6.6 శాతం(రూ. 77.25) క్షీణించింది. చివరకు రూ. 1,083 వద్ద స్థిరపడింది.