ఫ్రిజ్ లాంటి మనసున్నోడు!
డబ్బు సంపాదన మాత్రమే వ్యాపారవేత్తల లక్ష్యం కాకూడదు. సమాజానికి తమవంతు సాయం చేయాల్సిన బాధ్యతా వారిదే. ఈ సూత్రాన్ని అమలు చేసే అతికొద్దిమందిలో ‘అమర్ మొల్కీ’ ఒకరు. ఓ ఫేమస్ లెబనీస్ రెస్టారెంట్‌కు హెడ్ చెఫ్ ఆయన. తను రోజూ వండిపెట్టే రుచికరమైన ఆహార పదార్థాలు అతిథులు ఆరగిస్తుంటే ఆనందపడే అమర్.. మిగిలిపోరుున ఆహారాన్ని అన్నార్థులు ఆబగా తింటూంటే మహదానందపడిపోతాడు. మిగులు ఆహారం చెత్తడబ్బాల్లోకి వెళ్లకుండా నిరుపేదల కడుపులోకి వెళ్లేందుకు తమ రెస్టారెంట్లో ఏకంగా ఓ పథకాన్నే ప్రారంభించాడు..!
బెంగళూరులోని ఇంద్రానగర్ ఏరియా చాలా రిచ్‌గా ఉంటుంది. అక్కడి బిబ్లోస్ రెస్టారెంట్ మరింత గ్రాండ్‌గా ఉంటుంది. ఎగువ మధ్యతరగతి ప్రజలు కూడా అందులోకి పోవడానికి తటపటారుుస్తుంటారు. బిల్లు తట్టుకోగలమా అని సందేహిస్తారు. మిగతా స్టార్ హోటళ్లలా ఇది పక్కా కమర్షియల్ కావొచ్చేమో గానీ, అంతకు మించిన మానవత్వం ఉన్న రెస్టారెంట్ ఇది. ఫ్రిజ్ ఆఫ్ కైండ్‌నెస్.. అనే తమ ట్యాగ్‌లైన్‌కు తగ్గట్టుగా డీప్ ఫ్రిజ్ అంతటి చల్లని మనసు ఈ రెస్టారెంట్‌ది.
ఈ హోటల్ రాత్రి క్లోజ్ చేసే సమయానికి ఏ ఆహారం మిగిలినా చెత్తడబ్బాలో పడేయరు. చక్కగా ప్యాక్ చేసి ఫ్రిజ్‌లో పెడతారు. ఉదయం రెస్టారెంట్ బయట ఉన్న ఫ్రిజ్‌లోకి ప్యాకెట్లన్నీ షిఫ్ట్ చేస్తారు. ఒక వైపు నాన్ వెజ్.. మరోవైపు వెజ్, పళ్లు, వాటర్ బాటిల్స్ అమరుస్తారు. దారిన పోయేవాళ్లు ఎవరైనా సరే వాటిని నిరభ్యంతరంగా తీసుకెళ్లొచ్చు. డబ్బులు ఇవ్వాల్సిన పనిలేదు. అలాగని వాటిని ఎవరుపడితే వారు తీసుకోరు. డబ్బుల్లేక ఆకలితో పస్తులున్న వారికే వదిలేస్తారు.
రెస్టారెంట్ హెడ్ చెఫ్ అమర్ మొల్కీ బుర్రలోంచి పుట్టిందే ఈ పథకం. అతను ఇక్కడివాడు కాదు. సిరియా వాసి. కళ్లముందు జరిగిన సివిల్ వార్ అతడిని కలచివేసింది. కూడు, గూడు, గుడ్డ లేని జనం బాధలు తెలిసినవాడు. ఆకలి బాధేంటో ఎరిగినవాడు. అందుకే తనకు ఉన్నంతలో, మిగిలినంతలో పేదవారి కడుపు నింపుతున్నాడు. ఇతని మంచితనం చూసిన బెంగళూరు రోటరీ టీమ్ వాళ్లు ఒక పెద్ద ఫ్రిజ్ వితరణగా ఇచ్చారు. రెస్టారెంట్ బయట పెట్టిన ఫ్రిజ్ వాళ్లిచ్చిందే. దాంట్లోనే రాత్రి మిగిలిన పదార్థాలు నీట్‌గా ప్యాక్ చేసి అందులో పెడతారు.
ప్రతీ విషయంలో సర్కారును నిందించకూడదనీ, మనం చేయగలిగేది చేయాలని అంటాడాయన. మంచి చేస్తానంటే ఎవరు కాదంటారు చెప్పండి అని ప్రశ్నిస్తాడు. దాదాపు నెల రోజులైంది ఈ పథకం అమలు చేసి. ప్రస్తుతానికై తే రాత్రి మిగిలిన ఆహారం ఒక పాతిక మందికి సరిపోతోంది. ప్యాకెట్ల సంఖ్యను పెంచాలని చూస్తున్నాడు. ఇక్కడ ఇంకో మంచి విషయం ఏంటంటే.. లెబనీస్ రెస్టారెంట్ ఐడియాను బెంగళూరులో ఇతర సంస్థలూ అనుసరిస్తున్నారుు. జనం కూడా తాము తినగా మిగిలిన పదార్థాలను ప్యాక్ చేరుుంచి తమ వంతు సాయంగా ఫ్రిజ్‌లో పెట్టి వెళ్తున్నారు. మంచి ఆలోచన కదూ..!