head quarters
-
Hyderabad: పీసీఎస్ హెడ్– క్వార్టర్స్‌గా ఐసీసీసీ
సాక్షి, హైదరాబాద్: ఆధునిక టెక్నాలజీకి కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న బంజారాహిల్స్‌లోని తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేడెట్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (టీఎస్ఐసీసీసీ) పోలీసు కంప్యూటర్ సర్వీసెస్‌కు హెడ్–క్వార్టర్స్‌గా మారనుంది. ఈ మేరకు డీజీపీ కార్యాలయం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఈ భవనంలోని ఏ–టవర్ నగర పోలీసు కమిషనర్ కార్యాలయంగా వినియోగంలో ఉన్న విషయం విదితమే. రాష్ట్రానికే తలమానికంగా, దేశానికే ఆదర్శంగా నిర్మితమైన ఈ ఐసీసీసీ ఆగస్టు మొదటి వారంలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభమైంది. విపత్కర, అత్యవసర పరిస్థితుల్లో అన్ని విభాగాల అధిపతులూ ఒకేచోట సమావేశమై నిర్ణయాలు తీసుకునే దీన్ని డిజైన్ చేశారు. డయల్–100, అంబులెన్స్, ఫైర్, మహిళా భద్రత, షీ–టీమ్స్, హాక్ ఐ... ఈ వ్యవస్థలన్నీ ఒకే చోట ఉంచనున్నారు. దీంతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, కమిషనరేట్లలో ఉన్న సీసీ కెమెరాలను ఈ కమాండ్ సెంటర్‌ను అనుసంధానించనున్నారు. ఎఫ్ఐఆర్ మొదలు కేసు స్థితిగతుల నిశిత పరిశీలన, నేరగాళ్ల డేటాబేస్ నిర్వహణ, నేరాలు జరిగే ప్రాంతాల క్రైమ్ మ్యాపింగ్, అధ్యయనం, జైలు నుంచి విడుదలయ్యే నేరగాళ్లపై పర్యవేక్షణ, డిజిటల్ ఇన్వెస్టిగేషన్ ల్యాబ్ ఇతర టూల్స్ నేరాల నిరోధం తదితరాలకు ఐసీసీసీలోని బి–టవర్‌ను వాడనున్నారు. నేరాలను పసిగట్టే, నేరగాళ్ల కదలికల్ని గుర్తించే సాఫ్ట్వేర్ ఎనలటికల్ టూల్స్ అందుబాటులోకి రానున్నాయి. వీటితో పాటు డేటా ఎనాలసిస్, అడ్వాన్‌న్స్ సెర్చ్‌కూ సాంకేతిక పరిజ్ఞానం వాడనున్నారు. అదనంగా ప్రత్యేక వెబ్ డిజైనింగ్ టూల్స్‌తో మెరుగైన సేవలు అందించనున్నారు. ఈ నేపథ్యంలోనే 1,25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న బి–టవర్‌ను పోలీసు కంప్యూటర్ సర్వీసెస్‌కు (పీసీఎస్) అప్పగించాలని నిర్ణయించారు. ఈ విభాగం ప్రస్తుతం డీజీపీ కార్యాలయంలో కొనసాగుతోంది. పీసీఎస్ అదనపు డీజీ నేతృత్వంలోనే బి–టవర్ పని చేసేలా డిజైన్ చేస్తున్నారు. ఈ మార్పు నేపథ్యంలో పీసీఎస్కు అదనంగా సిబ్బందిని కేటాయించాలని నిర్ణయించారు. ప్రాథమిక అంచనా ప్రకారం అదనపు డీజీ నుంచి పరిపాలన సిబ్బంది వరకు కలిపి మొత్తం 350 మంది అవసరమని అంచనా వేస్తున్నారు. దీంతో ప్రస్తుతం పీసీఎస్లో ఉన్న వారికి అదనంగా మరో 200 మంది వరకు అవసరం. ఈ సిబ్బందిని ప్రస్తుతానికి ఇతర విభాగాల నుంచి సర్దుబాటు చేయడానికి డీజీపీ కార్యాలయం కసరత్తు చేస్తోంది. త్వరలో జరుగబోయే రిక్రూట్మెంట్ నుంచి శాశ్వత ప్రాతిపదికన వీరిని తీసుకోనున్నారు. సాంకేతిక విద్యనభ్యసించిన, ఈ రంగంపై ఆసక్తి ఉన్న వారికి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. (క్లిక్ చేయండి: 153 సెక్షన్లు మూత! అధికారులకు 58 ఇంజనీరింగ్ కాలేజీల వినతి) -
ఏఐసీసీ గేట్లు బద్ధలు కొట్టిన పోలీసులు!.. కాంగ్రెస్ ఆగ్రహం
ఢిల్లీ: ఢిల్లీ పోలీసుల తీరుపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ గాంధీ ఈడీ విచారణ నేపథ్యంలో.. కాంగ్రెస్ శ్రేణులు నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. అయితే.. కాంగ్రెస్ కార్యకర్తలను ఏఐసీసీ కార్యాలయంలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడం, ఆపై కార్యాలయంలోనే కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బుధవారం నిరసనలు కొనసాగుతున్న సమయంలో.. అక్బర్‌రోడ్డు వద్ద ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ముందు ఢిల్లీ పోలీసులతో కాంగ్రెస్ నేతలు వాగ్వాదానికి దిగారు. ఒకానొక టైంలో ఏఐసీసీ గేట్లు బద్ధలు కొట్టి పోలీసులు కార్యాయంలోకి వచ్చి, తమ నేతలను అరెస్ట్ చేసినట్లు కాంగ్రెస్ ఆరోపణలకు దిగింది. ఈ పరిణామంపై పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా తీవ్రంగా స్పందించారు. అసలు పార్టీ కార్యాలయంలోకి పోలీసులు ఎలా వస్తారని నిలదీశారు. పోలీసులు గుండాల్లా ప్రవర్తించారని మండిపడ్డారాయన. #WATCH Congress leader Sachin Pilot detained by police amid protests by party workers over the questioning of Rahul Gandhi by the Enforcement Directorate in the National Herald case#Delhi pic.twitter.com/smlKTJ62hS — ANI (@ANI) June 15, 2022 కాంగ్రెస్ ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు స్పందించారు. ఏఐసీసీ కార్యాలయం దగ్గర చాలా మంది వ్యక్తులు పోలీసులపై బారికేడ్లు విసిరారు. కాబట్టి గొడవ జరిగి ఉండవచ్చు. అంతేగానీ పోలీసులు ఏఐసీసీ కార్యాలయంలోకి వెళ్లి లాఠీఛార్జ్ చేయలేదు. పోలీసులు ఎలాంటి బలప్రయోగం చేయడం లేదు. మాతో సమన్వయం చేసుకోవాలని వారికి విజ్ఞప్తి చేస్తాం అని ఎస్పీ హుడా, స్పెషల్ సీపీ (ఎల్‌అండ్‌ఓ) తెలిపారు. మరోవైపు ఈడీ కార్యాలయం వద్ద టైర్లు కాల్చి నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు. #WATCH | Delhi: Many people threw barricades at police near AICC office, so there might've been a scrimmage. But police didn't go inside the AICC office & use lathi charge. Police are not using any force. We will appeal to them to coordinate with us...: SP Hooda, Special CP (L&O) pic.twitter.com/umkUd7pAzz — ANI (@ANI) June 15, 2022 ఇదిలా ఉంటే.. ఏఐసీసీ కార్యాలయం వద్ద జరిగిన పరిణామంపై కాంగ్రెస్ నిరసనలకు పిలుపు ఇచ్చింది. గురువారం రాజ్భవన్ల ముట్టడికి ఏఐసీసీ పిలుపు ఇచ్చింది. ఈ పిలుపులో భాగంగా.. తెలంగాణలో రాజ్‌భవన్ ఎదుట కాంగ్రెస్ శ్రేణులు ధర్నా చేపట్టనున్నాయి. రాహుల్‌పై కేంద్రం కక్ష సాధింపు చర్యకు పాల్పడుతోందని తెలంగాణ కాంగ్రెస్ ఒక ప్రకటన విడుదల చేసింది. -
బీఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయం మూసివేత
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) ప్రధాన కార్యాలయంలోని రెండు అంతస్తులను బీఎస్ఎఫ్ అధికారులు సోమవారం సీల్ చేశారు. బీఎస్ఎఫ్ సిబ్బందికి కరోనా వైరస్ పాజిటివ్‌గా రావటంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం ఎనిమిది అంతస్తులు ఉన్న ఈ భవనం లోధి రహదారిలోని సీజీఓ కాంప్లెక్స్‌లో ఉంది. ఇక బీఎస్ఎఫ్ కార్యాలయ భవనానికి శానిటైజేషన్ పనులు చేస్తున్నామని అధికారులు తెలిపారు. కరోనా పాజిటివ్ వచ్చిన సిబ్బందితో కాంటాక్టు అయిన వారిని ట్రేస్ చేస్తున్నామని బీఎస్ఎఫ్ అధికారులు పేర్కొన్నారు. (అస్సాంలో వెలుగుచూసిన స్పానిష్ ఫ్లూ) ఇక 126 బెటాలియన్‌కి చెందని 25 మంది బీఎస్ఎఫ్ భద్రతా సిబ్బందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇప్పటివరకు మొత్తం 56 మంది బీఎస్ఎఫ్ జవాన్లకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా అందరికీ నెగటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇందులో త్రిపుర రాష్ట్రానికి చెందన వారు 14 మంది, ఢిల్లీకి చెందిన వారు 43 మంది జవాన్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మే 3న ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లకు కరోనా పాజిటివ్ రావటంతో సీఆర్పీఎఫ్ ప్రధాన కార్యాలయాన్నిమూసివేసిన విషయం తెలిసిందే. ఇప్పటివకు సీఆర్పీఎఫ్లో 137 పాజిటివ్ కేసులు ఉండగా, ఒకరు మృతి చెందారు. మరో వైపు సీఐఎస్ఎఫ్లో కూడా తొమ్మిది కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఉన్నాయి. -
సమాధుల పునాదుల పైన..
న్యూఢిల్లీ: చిదంబరంను ఉంచిన సీబీఐ ప్రధాన కార్యాలయ భవనం గురించి ఆసక్తికర కథలను సీబీఐ అధికారులు చెప్పుకుంటున్నారు. ఆ భవనం కట్టిన ప్రాంతం ఒకప్పుడు శ్మశానమని, సమాధులపై నిర్మించిన భవనం కాబట్టి వాస్తు సరిగా లేదంటున్నారు. వాస్తు సరిగా లేకపోవడం వల్లనే ఆ భవనంలో విధులు నిర్వర్తించిన సీబీఐ డైరెక్టర్లందరూ వివాదాల్లో, కేసుల్లో ఇరుక్కుంటున్నారని చెబుతున్నారు. డైరెక్టర్లుగా పనిచేసిన ఏపీ సింగ్, రంజిత్ సిన్హాలపై సీబీఐ కేసు పెట్టింది. విజయ్‌మాల్యా పారిపోయేందుకు వీలు కల్పించాడని అనిల్ సిన్హాపై ఆరోపణలున్నాయి. అలోక్‌వర్మ తన సహచరుడితో వివాదంతో సీబీఐని భ్రష్టు పట్టించారని విమర్శలున్న విషయం తెలిసిందే. ప్రారంభోత్సవానికి చిదంబరం ఇదే భవన ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథుల్లో ఒకరుగా చిదంబరం వచ్చారు. 2011, ఏప్రిల్ 30న నాటి ప్రధాని మన్మోహన్æ ఈ భవనాన్ని ప్రారంభించారు. కేంద్రమంత్రి హోదాలో చిదంబరం ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాటి సీబీఐ డైరెక్టర్ ఆ భవనాన్ని మొత్తం వారికి తిప్పిచూపించారు. ఇప్పుడు చిదంబరం బందీగా ఉన్న గెస్ట్‌హౌజ్‌లోని సూట్ నెం 5ను అప్పుడు ఆయన చూసే ఉంటారు. నేడు సుప్రీంలో విచారణ తనకు ముందస్తు బెయిల్‌ను నిరాకరిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇటీవల జారీచేసిన ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని కోరుతూ చిదంబరం దాఖలు చేసుకున్న పిటిషన్ నేడు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. జస్టిస్ ఆర్ భానుమతి, జస్టిస్ ఏఎస్ బోపన్నల ధర్మాసనం విచారణ జరపుతుందని గురువారం సాయంత్రం సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ ప్రకటించారు. -
అంబానీ మరో కీలక నిర్ణయం : షేర్లు ఢమాల్
సాక్షి,ముంబై: అప్పుల ఊబిలో చిక్కుకున్న రిలయన్స్ గ్రూపు ఛైర్మన్ అనిల్ అంబానీ సంచలన నిర్ణయం తీసుకున్నట్టుతెలుస్తోంది. ముంబైలోని అతి విలాసవంతమైన భవన సముదాయాన్ని విక్రయించడమో లేదా అద్దెకివ్వడమో చేయాలని యోచిస్తున్నారట. తద్వారా కొన్ని అప్పులు తీర్చాలని భావిస్తున్నారు. ముంబైలోని వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవేలో 7లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న రిలయన్స్ గ్రూప్‌నకు చెందిన శాంటాక్రూజ్ ప్రధాన కార్యాలయాన్ని విక్రయించడానికి లేదా దీర్ఘకాలిక లీజ్‌కివ్వడానికి యోచిస్తున్నారు అనిల్ అంబానీ. ఈ మేరకు గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థల గ్రూపు సంస్థ బ్లాక్‌స్టోన్ , యుఎస్ ఆధారిత ఫండ్‌తో చర్చలు జరుపుతున్నట్టు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. తద్వారా 1,500-2,000 కోట్ల రూపాయల సమకూర్చకోనుందని ఎకనామిక్ టైమ్స్ ఒక కథనంలో పేర్కొంది. మరోవైపు ఈ భవనం కూడా చట్టపరమైన వివాదాల్లో చిక్కుకున్న నేపథ్యంలో ఈ లావాదేవీకోసం ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ జెఎల్ఎల్ను కూడా నియమించుకుంది. అంతేకాదు ప్రస్తుతం ఖాళీగా ఉన్న దక్షిణ ముంబైలోని తన బల్లార్డ్ ఎస్టేట్ కార్యాలయానికి తిరిగి వెళ్లాలని కూడా అంబానీ ఆలోచిస్తున్నారని సమాచారం. ఈ వార్తల నేపథ్యంలో అడాగ్ గ్రూపు షేర్లు భారీగా నష్టపోతున్నాయి. కాగా 2008లో 42 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలో 6వ ధనవంతుడైన అనిల్ అంబానీ కూడా గత నెలలో బిలియనీర్ క్లబ్ నుంచి కిందికి జారుకున్నారు. మార్చి 2018 నాటికి రిలయన్స్ గ్రూప్ కంపెనీల మొత్తం రుణం రూ.1.7 లక్షల కోట్లకు పైగా ఉంది. 11 సంవత్సరాలలో, అంబానీ మొత్తం వ్యాపార సామ్రాజ్యం ఈక్విటీ విలువ 3,651 కోట్ల రూపాయలకు (23 523 మిలియన్లు) కుప్పకూలింది. 2005 లో రిలయన్స్ సామ్రాజ్యాన్ని అన్నదమ్ములు (అన్న ముకేశ్ అంబానీ) తమలో తాము విభజించుకోవాలని నిర్ణయించుకున్న తరువాత అనిల్ అంబానీకి ఈ కార్యాలయం లభించింది. -
ఇస్రో సీనియర్ శాస్త్రవేత్తపై బదిలీ వేటు
న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) సీనియర్ శాస్త్రవేత్త తపన్ మిశ్రాపై వేటు పడింది. ప్రస్తుతం అహ్మదాబాద్‌లోని స్పేస్ అప్లికేషన్స్ సెంటర్(ఎస్ఏసీ) డైరెక్టర్‌గా ఉన్న మిశ్రాను బెంగళూరులోని సంస్థ ప్రధాన కార్యాలయానికి బదిలీ చేసిన చైర్మన్ కె.శివన్.. ఆయనకు ఇస్రో సలహాదారుగా కొత్త బాధ్యతలు అప్పగించారు. ఇటీవల ఇస్రో చేపడుతున్న అంతరిక్ష కార్యక్రమాల్లో ప్రైవేటు సంస్థలకు శివన్ గణనీయమైన ప్రాధాన్యమివ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో మిశ్రాపై వేటు పడిందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. మిశ్రా స్థానంలో ఎస్ఏసీ డైరెక్టర్‌గా మరో సీనియర్ శాస్త్రవేత్త డీకే దాస్‌ను నియమించినట్లు పేర్కొన్నారు. దేశీయంగా పలు కీలక ఉపగ్రహాల తయారీలో పాలుపంచుకున్న మిశ్రా భవిష్యత్‌తో ఇస్రో చైర్మన్ పదవిని చేపట్టేవారిలో ముందువరుసలో ఉన్నారన్నారు. -
అనకాపల్లి డీఎస్పీపై వేటు
అనకాపల్లి, న్యూస్‌లైన్ : అవినీతి, వివాదాస్పదునిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అనకాపల్లి డీఎస్పీ వీఎస్ఆర్ మూర్తిపై వేటు పడింది. ఆయన్ని ఏఆర్ (ఆర్మ్డ్ రిజర్వుడ్) హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ జిల్లా ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ ఉత్తర్వులు జారీ చేశారు. అనకాపల్లి డీఎస్పీ బాధ్యతల్ని అదనపు ఎస్పీ డి.నందకిశోర్‌కు అప్పగించారు. డీఎస్పీపై వచ్చిన పలు ఆరోపణలపై విచారణ అనంతరం ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఉద్యమకారులకు, పోలీసులకు మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్నయుద్ధానికి ముగింపు పలికినట్లయింది. డీఎస్పీ మూర్తి అధికార పార్టీ నాయకుల సిఫార్సులకు ప్రాధాన్యతిస్తూ, మంత్రి గంటా శ్రీనివాసరావు అడుగులకు మడుగులొత్తారన్న ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. సమైక్య ఉద్యమంలో భాగంగా అనకాపల్లిలో నిర్వహించిన లక్షగళ గర్జనలో ఆయన అతిగా వ్యవహరించారు. పరిరక్షణ సమితి సభ్యులను బెదిరించడంతో పాటు అధికార పార్టీ నేతను స్టేజీపైకి ఎక్కించాలని ఒత్తిడి చేశారు. ఉద్యమ దీక్షలకు అనుమతి ఇవ్వడంలో వివక్ష కనబరిచారన్న ఆరోపణలున్నాయి. వీటన్నిటిపై సమైక్యవాదులు డీఎస్పీ వైఖరికి నిరసనగా పట్టణ బంద్ కూడా నిర్వహించారు. ఎస్పీకి రాజకీయ నాయకులు, సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి నాయకులు సమగ్రంగా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుల్ని దృష్టిలో ఉంచుకుని ఆయన డీఎస్పీ మూర్తిపై విచారణ జరపాలని అడిషనల్ ఎస్పీ డి. నందకిషోర్‌ను ఆదేశించారు. ఆ మేరకు విచారణ జరిపి ఎస్పీకి నివేదిక సమర్పించారు. అనంతరం డీఎస్పీ చర్యకుపక్రమించారు. రూరల్ ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేశారు. ఇక్కడ అప్పటికే పనిచేస్తున్న డీఎస్పీ చంద్రబాబును విజయనగరంలో జరుగుతున్న గొడవల నేపథ్యంలో అక్కడికి పంపారు. మూర్తి స్థానంలో ఆ బాధ్యతలను అడిషనల్ ఎస్పీ నందకిషోర్‌కు అదనంగా అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గంటాకు ఎదురుదెబ్బ... డీఎస్పీపై వేటు నిర్ణయంతో మంత్రి గంటా, ఆయన వర్గీయులకు ఎదురుదెబ్బ తగిలినట్టయింది. నేతల అడుగులకు మడుగులొత్తుతూ ఏకపక్షంగా వ్యవహరించే అధికారులకు ఇలాంటి పరిణామం కనువిప్పు కలిగిస్తుందన్న భావన పట్టణ వాసుల్లో వ్యక్తమవుతోంది