సాక్షి, హైదరాబాద్: ఆధునిక టెక్నాలజీకి కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న బంజారాహిల్స్‌లోని తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేడెట్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (టీఎస్‌ఐసీసీసీ) పోలీసు కంప్యూటర్ సర్వీసెస్‌కు హెడ్–క్వార్టర్స్‌గా మారనుంది. ఈ మేరకు డీజీపీ కార్యాలయం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఈ భవనంలోని ఏ–టవర్ నగర పోలీసు కమిషనర్ కార్యాలయంగా వినియోగంలో ఉన్న విషయం విదితమే. రాష్ట్రానికే తలమానికంగా, దేశానికే ఆదర్శంగా నిర్మితమైన ఈ ఐసీసీసీ ఆగస్టు మొదటి వారంలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభమైంది.
విపత్కర, అత్యవసర పరిస్థితుల్లో అన్ని విభాగాల అధిపతులూ ఒకేచోట సమావేశమై నిర్ణయాలు తీసుకునే దీన్ని డిజైన్ చేశారు. డయల్–100, అంబులెన్స్, ఫైర్, మహిళా భద్రత, షీ–టీమ్స్, హాక్ ఐ... ఈ వ్యవస్థలన్నీ ఒకే చోట ఉంచనున్నారు. దీంతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, కమిషనరేట్లలో ఉన్న సీసీ కెమెరాలను ఈ కమాండ్ సెంటర్‌ను అనుసంధానించనున్నారు. ఎఫ్‌ఐఆర్ మొదలు కేసు స్థితిగతుల నిశిత పరిశీలన, నేరగాళ్ల డేటాబేస్ నిర్వహణ, నేరాలు జరిగే ప్రాంతాల క్రైమ్ మ్యాపింగ్, అధ్యయనం, జైలు నుంచి విడుదలయ్యే నేరగాళ్లపై పర్యవేక్షణ, డిజిటల్ ఇన్వెస్టిగేషన్ ల్యాబ్ ఇతర టూల్స్ నేరాల నిరోధం తదితరాలకు ఐసీసీసీలోని బి–టవర్‌ను వాడనున్నారు.
నేరాలను పసిగట్టే, నేరగాళ్ల కదలికల్ని గుర్తించే సాఫ్ట్‌వేర్ ఎనలటికల్ టూల్స్ అందుబాటులోకి రానున్నాయి. వీటితో పాటు డేటా ఎనాలసిస్, అడ్వాన్‌న్స్ సెర్చ్‌కూ సాంకేతిక పరిజ్ఞానం వాడనున్నారు. అదనంగా ప్రత్యేక వెబ్ డిజైనింగ్ టూల్స్‌తో మెరుగైన సేవలు అందించనున్నారు. ఈ నేపథ్యంలోనే 1,25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న బి–టవర్‌ను పోలీసు కంప్యూటర్ సర్వీసెస్‌కు (పీసీఎస్) అప్పగించాలని నిర్ణయించారు. ఈ విభాగం ప్రస్తుతం డీజీపీ కార్యాలయంలో కొనసాగుతోంది. పీసీఎస్ అదనపు డీజీ నేతృత్వంలోనే బి–టవర్ పని చేసేలా డిజైన్ చేస్తున్నారు. ఈ మార్పు నేపథ్యంలో పీసీఎస్‌కు అదనంగా సిబ్బందిని కేటాయించాలని నిర్ణయించారు.
ప్రాథమిక అంచనా ప్రకారం అదనపు డీజీ నుంచి పరిపాలన సిబ్బంది వరకు కలిపి మొత్తం 350 మంది అవసరమని అంచనా వేస్తున్నారు. దీంతో ప్రస్తుతం పీసీఎస్‌లో ఉన్న వారికి అదనంగా మరో 200 మంది వరకు అవసరం. ఈ సిబ్బందిని ప్రస్తుతానికి ఇతర విభాగాల నుంచి సర్దుబాటు చేయడానికి డీజీపీ కార్యాలయం కసరత్తు చేస్తోంది. త్వరలో జరుగబోయే రిక్రూట్‌మెంట్ నుంచి శాశ్వత ప్రాతిపదికన వీరిని తీసుకోనున్నారు. సాంకేతిక విద్యనభ్యసించిన, ఈ రంగంపై ఆసక్తి ఉన్న వారికి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. (క్లిక్ చేయండి: 153 సెక్షన్లు మూత! అధికారులకు 58 ఇంజనీరింగ్ కాలేజీల వినతి)
Comments
Please login to add a commentAdd a comment