health checkups
-
చెక్ చేస్తున్నారా? ‘నాకేంటి ఉక్కులా ఉంటే’.. కనీసం ఏడాదికోసారైనా!
ఆరోగ్యాన్ని చెక్ చేస్తున్నారా? అనారోగ్యం వచ్చినప్పుడు హాస్పిటల్‌కు వెళ్లడం కాదు. అనారోగ్యం బారిన పడకుండా ఉండడానికి ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటున్నారా? ఇంట్లో అరవై దాటిన పెద్దవాళ్లుంటే మాత్రం ఆరోగ్య పరీక్షలను ఏ మాత్రం నిర్లక్ష్యం చేయవద్దు. అరవై ఏళ్లు నిండినప్పటి నుంచి ఆరోగ్యం గురించిన జాగ్రత్తలు తీసుకోవడమే ప్రధానమైన పని అవుతుంది. ఎక్కువమంది ఉద్యోగం నుంచి రిటైర్ అయిపోయి ఉంటారు. సొంత వృత్తివ్యాపారాల్లో ఉన్న వాళ్లు అరవై దాటినప్పటికీ చలాకీగా పని చేసుకుంటూ ఉంటారు కూడా. ‘వయసు ఒక అంకె మాత్రమే, ఉత్సాహాన్ని నియంత్రించే శక్తి కాదు’ అని చెప్పుకోవడం ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమే. కానీ ఈ వయసులో ఆరోగ్య ప్రస్తావన కూడా అంతే అవసరం. ‘నాకేంటి ఉక్కులా ఉంటే’ అని హాస్పిటల్‌కు వెళ్లడానికి మొరాయించే వాళ్లు కూడా ఉంటారు. అలాంటి వాళ్ల కోసం ఇంట్లో వాళ్లు ఒక నియమం పెట్టుకుని మరీ మాస్టర్ హెల్త్ చెకప్‌లు చేయించాలి. హైబీపీ, డయాబెటిస్, గుండె సమస్యల వంటివి ఏవీ లేకుండా హాయిగా జీవిస్తున్న వాళ్లకైతే ఏడాదికోసారి మాస్టర్ హెల్త్ చెకప్ చేయిస్తే సరిపోతుంది. ఆ హెల్త్ చెకప్‌లో ఈ కిందివన్నీ ఉంటాయి. హీమోగ్రామ్ పరీక్ష: ఇందులో హిమోగ్లోబిన్, ప్యాక్డ్ సెల్ వాల్యూమ్, ఆర్బీసీ కౌంట్, టోటల్ వైట్ బ్లడ్ సెల్స్ కౌంట్, డిఫరెన్షియల్ కౌంట్, ప్లేట్లెట్ కౌంట్, ఎంవీసీ, ఎమ్సీహెచ్, ఎమ్సీహెచ్సీ, ఈఎస్ఆర్, పెరిఫెరల్ స్మియర్ పరీక్షలు ఉంటాయి. బ్లడ్ షుగర్: ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ టెస్ట్ రీనల్ ఫ్రొఫైల్ : ఇందులో యూరియా, క్రియాటినైన్, యూరిక్ యాసిడ్ పరీక్షలు చేస్తారు. లిపిడ్ ప్రొఫైల్: టోటల్ కొలెస్ట్రాల్, హెడీఎల్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్, హెచ్‌డీఎల్ రేషియో పరీక్షలుంటాయి. జనరల్ టెస్ట్స్: యూరిన్ రొటీన్ ఎనాలసిస్, సీరమ్ క్రియాటినైన్, ఈసీజీ (విశ్రాంతి దశలో), ఎక్స్ –రే (పీఏ వ్యూ) పరీక్షలు చేస్తారు. మాస్టర్ హెల్త్ చెకప్‌కు వెళ్లే ముందు రోజు రాత్రి కడుపు ఖాళీగా ఉంటే మంచిది. అలా ఉండలేని వాళ్లు త్వరగా భోజనం ముగించడం మధ్యేమార్గం. కొంతమందికి వారి జీవనశైలి, దేహతత్వం, కుటుంబ ఆరోగ్య చరిత్రను అనుసరించి మాస్టర్ హెల్త్ చెకప్‌ల మధ్య నిడివి తగ్గించవలసింది గా డాక్టర్లు సూచిస్తారు. అలాంటి వారు డాక్టర్ సూచనను పాటించి తీరాలి. ∙ హెల్త్ క్యాలెండర్ మాస్టర్ చెకప్‌ల కోసం ఇంట్లో ఒక క్యాలెండర్ తయారు చేసుకోవడం సులువైన మార్గం. పుట్టిన రోజు నెలలో సదరు వ్యక్తి హెల్త్ చెకప్ కూడా పూర్తి చేసుకోవాలి. ఇంట్లో అరవై దాటిన ఇద్దరి పుట్టిన రోజులు వరుస నెలల్లో ఉన్నప్పుడు ఏదో ఒక నెలను ఖాయం చేసుకుంటే సౌకర్యంగా ఉంటుంది. చదవండి: Health Tips: షుగర్, రేచీకటి ఉన్నవాళ్లు.. దగ్గు, ఆయాసంతో ఇబ్బంది పడేవాళ్లు గోంగూరను తింటే... -
బ్రిటన్ ప్రయాణికులకు కరోనా టెస్ట్
న్యూఢిల్లీ: యూకే నుంచి వచ్చే ప్రయాణికులకు కోవిడ్ పరీక్షలు తప్పని సరిచేస్తూ కేంద్రం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. జనవరి 8 నుంచి జనవరి 30 వ తేదీ వరకు బ్రిటన్ నుంచి వచ్చే ప్రయాణికులందరూ సొంత ఖర్చుతో తప్పనిసరిగా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలంటూ కేంద్రం తాజా మార్గదర్శకాల్లో వెల్లడించింది. ప్రయాణానికి 72 గంటల ముందు కోవిడ్ పరీక్షల్లో నెగెటివ్ వచ్చినట్లు సర్టిఫికెట్ తెచ్చుకోవాలని మార్గదర్శకాల్లో వెల్లడించారు. కొత్త కరోనా యూకేలో బయటపడి, అత్యంత వేగంగా విస్తరిస్తోండడంతో డిసెంబర్ 23 నుంచి డిసెంబర్ 31 వరకు బ్రిటన్ నుంచి వచ్చే విమానాల రాకపోకలపై భారత్ నిషే«ధం విధించింది. ఆ తరువాత నిషేధాన్ని జనవరి 7 వరకు పొడిగించింది. బ్రిటన్ నుంచి భారత్‌కి వారానికి కేవలం 30 విమానాలను నడుపుతున్నారు. జనవరి 23 వరకు ఇలాగే కొనసాగుతాయని పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. ప్రయాణికుల వద్ద తప్పనిసరిగా కోవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్ ఉండేలా వైమానిక సిబ్బంది చూసుకోవాలి. ఆర్టీ–పీసీఆర్ పరీక్షల ఫలితం వచ్చే వరకు ప్రయాణీకులు వేచి ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలి. సంబంధిత రాష్ట్రాల అధికారులను సంప్రదించి కోవిడ్ పాజిటివ్ వచ్చిన ప్రయాణికులను ప్రత్యేక యూనిట్లలో సంస్థాగత ఐసోలేషన్‌లో ఉంచాలి. పాజిటివ్ పేషెంట్లకు తిరిగి 14వ రోజు మళ్ళీ కోవిడ్ పరీక్షలు నిర్వహించి ఫలితాలు నెగెటివ్ వచ్చే వరకు వారిని ఐసోలేషన్‌లో ఉంచాలి. పాజిటివ్ వచ్చిన ప్రయాణీకుల పక్క సీట్లలో కూర్చున్న వారినీ, ముందు మూడు వరుసలు వెనక మూడు వరసల్లో ప్రయాణించిన వారిని క్వారంటైన్సెంటర్లలో ఉంచాలని వివరించారు. విమానాశ్రయంలో నెగెటివ్ వచ్చినప్పటికీ 14 రోజుల వరకు హోం క్వారంటైన్‌లోనే ప్రయాణికులు ఉండాలి. రాష్ట్ర లేదా జిల్లా అధికార యంత్రాంగం వీరిని పర్యవేక్షిస్తూ ఉండాలి. ఈ మార్గదర్శకాలు సక్రమంగా అమలు జరిగేందుకు విమానాశ్రయాల్లో హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేయాలి. 6 నుంచి యూకేకు విమానాలు ఇండియా–యూకే మధ్య విమాన సేవలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ నెల 6వ తేదీన భారత్ నుంచి యూకేకు, 8వ తేదీన యూకే నుంచి ఇండియాకు ఫ్లయిట్లు ప్రారంభమవుతాయని కేంద్ర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. ప్రతి వారం 30 విమానాలను నడుపుతాయని చెప్పారు. ఇందులో ఇండియా, యూకేవి తలా పదిహేను విమానాలుంటాయన్నారు. ఈ షెడ్యూల్ జనవరి 23 వరకు కొనసాగుతుందని చెప్పారు. భారత ప్రభుత్వం డిసెంబర్ 23న ఇండియా–యూకేల మధ్య విమాన సర్వీస్‌లను రద్దు చేయడం తెల్సిందే. -
ట్రంప్‌కి రోజూ కోవిడ్ పరీక్షలు
వాషింగ్టన్/ఐక్యరాజ్యసమితి/బ్యాంకాక్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగత సహాయకుల్లో ఒకరికి కరోనా వైరస్ సోకడంతో వైట్‌హౌస్ ఉలిక్కి పడింది. వెంటనే అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌కి కరోనా పరీక్షలు నిర్వహించారు. అందులో నెగెటివ్ అని తేలడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో ట్రంప్ ఇకపై రోజూ పరీక్షలు జరపాలని నిర్ణయించుకున్నారు. కరోనా సోకిన సహాయకుడు ట్రంప్‌కి అత్యంత సన్నిహితంగా వ్యవహరించేవారని, అధ్యక్షుడి భోజన ఏర్పాట్లు, ఆయనకు దుస్తులు అందివ్వడం వంటి పనులు చేసేవారని సీబీఎస్ న్యూస్ వెల్లడించింది. అయితే ట్రంప్ దీనిని తోసిపుచ్చారు. అతనిని తాను చాలా తక్కువసార్లు కలుసుకున్నానని చెప్పారు. ముందు జాగ్రత్త చర్యగా తాను, ఉపాధ్యక్షుడు కరోనా పరీక్షలు చేయించుకుంటే నెగెటివ్ వచ్చిందని గురువారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఇప్పటివరకు వారానికి ఒకసారి కోవిడ్ పరీక్ష చేయించుకునే వాడినని, ఇకపై రోజూ చేయించుకుంటానని ట్రంప్ చెప్పారు. భారత సంతతికి చెందిన వైద్యులైన తండ్రీకూతురు మృతి అమెరికాలోని న్యూజెర్సీలో భారత సంతతికి చెందిన వైద్యులైన తండ్రీ కూతుళ్లు కోవిడ్–19 బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. సత్యేందర్ దేవ్ ఖన్నా(78) కొన్ని దశాబ్దాలుగా న్యూజెర్సీలో వివిధ ఆసుపత్రుల్లో సర్జన్‌గా సేవలు అందిస్తున్నారు. ఆయన కుమార్తె ప్రియా ఖన్నా (43) కిడ్నీ సంబంధిత వ్యాధుల్ని నయం చేసే నిపుణురాలు. ఆమె యూనియన్ ఆస్పత్రిలో చీఫ్ ఆఫ్ రెసిడెంట్‌గా ఉన్నారు. వీరిద్దరికీ ఇటీవల కరోనా వైరస్ సోకింది. డాక్టర్ సత్యేంద్ర ఖన్నా నాలుగు దశాబ్దాలుగా సేవలు అందిస్తున్న క్లారా మాస్ మెడికల్ సెంటర్లో కోవిడ్‌కు చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. అదే ఆస్పత్రిలోనే సేవలందిస్తున్న ప్రియాఖన్నా కూడా కోవిడ్‌తో ప్రాణాలు కోల్పోయారు. వీరిద్దరి మృతి అత్యంత బాధాకరమని న్యూజెర్సీ గవర్నర్ ఫిల్ ముర్ఫీ చెప్పారు. రాష్ట్రం అద్భుతమైన ఇద్దరు వైద్యుల్ని కోల్పోయిందని అన్నారు. విదేశీయులపై విద్వేషం వద్దు : యూఎన్ కోవిడ్–19 ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో విదేశీయులపై విద్వేషం సునామీలా పెరిగిపోతోందని, దానికి అడ్డుకట్ట వేయడానికి అందరూ కృషి చేయాలని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుట్టెరస్ అన్నారు. అయితే ఆయన ప్రత్యేకంగా ఏ దేశం పేరుని కూడా ప్రస్తావించలేదు. ఆగ్నేయాసియా, తూర్పు ఆఫ్రికా, లాటిన్ అమెరికా సరిహద్దుల్లో పెద్ద సంఖ్యలో వలసదారులు ఎటూ వెళ్లడానికి లేకుండా ఉన్నారని, వారికి వైరస్ సోకే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జిన్‌పింగ్‌కు కిమ్ ప్రశంస కరోనా వైరస్‌ను నియంత్రించడంలో విజయం సాధించినందుకుగాను చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ప్రశంసించారు. ఈ మేరకు జిన్‌పింగ్‌కు వ్యక్తిగత సందేశాన్ని పంపించారు. కరోనా కారణంగా ఉత్తర కొరియా ఆర్థికంగా సంక్షోభ పరిస్థితులు నెదుర్కొంటోందని దక్షిణ కొరియా మీడియాలో కథనాలు ప్రచురిస్తున్న నేపథ్యంలో కిమ్ తన సందేశాన్ని పంపారు. 14.7 శాతానికి చేరుకున్న నిరుద్యోగం కోవిడ్–19 అగ్రరాజ్యం అమెరికాను ఆర్థికంగా తీవ్రంగా కుంగదీసింది. 2007–2009 మధ్య కాలంలో అమెరికాను కుదిపేసిన ఆర్థిక మాంద్యం తర్వాత ఆ స్థాయిలో నిరుద్యోగం పెరిగిపోతోంది. గత నెలలో రికార్డు స్థాయిలో అత్యధికంగా 14.7శాతానికి చేరుకుంది. ఒక్క ఏప్రిల్ నెలలోనే 2.05 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఫిబ్రవరి వరకు అమెరికాలో ఉపాధి అవకాశాలు బాగా ఉన్నాయి. నిరుద్యోగం రేటు 50 ఏళ్ల కనిష్టం 3.5 శాతానికి తగ్గింది. వరసగా 113 నెలల పాటు కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తూనే ఉండడం కూడా ఒక రికార్డే. ఇక మార్చిలో నిరుద్యోగం 4.4 శాతంగా ఉంది. అదే ఏప్రిల్ వచ్చేసరికి 14.7 శాతానికి ఒక్కసారిగా పెరిగిపోయింది. -
మాస్టర్ @2800
లక్డీకాపూల్:నిమ్స్‌లో కార్పొరేట్ తరహాలోవైద్యపరీక్షల ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొచ్చారు. పేదలకు మెరుగైన వైద్య సేవల్ని అందుబాటులోకితీసుకురావాలన్న ఉద్దేశంతో సరళతరమైన రీతిలో 12 రకాల హెల్త్ చెకప్ ప్యాకేజీలను రూపొందించారు. వీటి వివరాలను నిమ్స్ సంచాలకులు డాక్టర్ కె.మనోహర్బుధవారం నిమ్స్‌లో ఏర్పాటుచేసినవిలేకరుల సమావేశంలో వెల్లడించారు.హెల్త్ చెకప్ బ్రోచర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు సైతం అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో కూడిన వైద్యసేవలనుఅందించేందుకు ప్రత్యేక దృష్టినికేంద్రీకరించినట్టు తెలిపారు. అందులో భాగంగానేరూ.2800కే మాస్టర్ హెల్త్ చెకప్ చేయనున్నామన్నారు. తెలియని వ్యాధుల నిర్ధారణకు.. తెలియని కొన్ని రకాల వ్యాధులను నిర్ధారించుకునేందుకు వైద్య పరీక్షలు ఎంతో అవసరం. ఈ క్రమంలో అతి తక్కువ ధరలో వైద్య పరీక్షలు నిర్వహించేందుకు 12 రకాల హెల్త్ చెకప్ ప్యాకేజీలను రూపొందించారు. ముఖ్యంగా మహిళల హెల్త్ ప్రొఫైల్, సీజనల్ జ్వరాలు వంటి అంశాలలో గతంలో రూపొందించిన మాస్టర్ హెల్త్ చెకప్ ప్యాకేజీకి రోగుల నుంచి పెద్దగా స్పందన కానరాలేదు. ఆయా ప్యాకేజీలలో కొన్ని అవసరం లేని పరీక్షలు ఉన్నందున ఆయా ప్యాకేజీలకు ఆదరణ కరువైందని డైరెక్టర్ చెప్పారు. గత అనుభవాలను పరిగణనలోకి తీసుకుని ప్రత్యేక ప్యాకేజీలను రూపొందించామని వివరించారు. ఆయా ప్యాకేజీలలో హెల్త్ చెకప్‌ను నేరుగా గతంలోని క్యాత్ ల్యాబ్‌లోకి వెళ్లి పరీక్షలు చేయించుకోవచ్చన్నారు. కొత్తగా అందుబాటులోకి తీసుకువచ్చిన ప్యాకేజీల వివరాలు ఇలా ఉన్నాయి. మాస్టర్ హెల్త్ చెకప్: రూ.2,800 నిమ్స్ మాస్టర్ హెల్త్ చెకప్ ప్యాకేజీలో హీమోగ్రామ్ వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో హెచ్‌బీ, పీసీవీ, ఎంసీవీఎంహెచ్సీ, ఎంసీహెచ్‌సీ, టీఎస్సీ, డీసీ, పీఎల్టీ, రీటిక్, ఎస్ఆర్, పీఎస్ టెస్టులు చేస్తారు. అంతే కాకుండా సియూఈ, సిరమ్ యూరియా, సిరమ్ క్రియాటినైన్, ఎఫ్బీఎస్, పీఎల్బీఎస్, హెచ్‌బీఏ1సి పరీక్షలు కూడా ఉంటాయి. డయాబెటిక్ హెల్త్ చెకప్: రూ.2100 డయాబెటిక్ హెల్త్ చెకప్ ప్యాకేజీలో హీమోగ్రామ్, లిపిడ్ ప్రొఫైల్, లివర్ ఫంక్షన్ టెస్ట్ ఉంటాయి. ఉమెన్ వెల్నెస్ చెకప్:రూ.4700 ఉమెన్ వెల్నెస్ చెకప్ ప్యాకేజీలో హీమోగ్రామ్, లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్‌లు, టీఎస్‌హెచ్, ఈసీజీ, సీఎక్స్ఆర్–పీఏ రివ్యూ, యుఎస్‌జీ – అబ్డామన్, మామోగ్రఫీ వంటి పరీక్షలతో పాటు కన్సల్టేషన్ ఉంటాయి. ఫీవర్ ప్రొఫైల్: రూ.4500 ఫీవర్ ప్రొఫైల్ ప్యాకేజీలో హీమోగ్రామ్, లివర్ ఫంక్షన్ టెస్ట్, మలేరియా స్ట్రీప్, విడాల్ లిట్రేస్, డెంగ్యూ సెరాలాజీ, వెల్ప్లెక్స్/స్క్రబ్ టైప్స్ రాపిడ్ ఐసిటీ, లెప్టొస్పిరా యాంటీబాడీస్ పరీక్షలు ఉంటాయి. ఎనీమియా టెస్ట్:రూ.2000 ఎనీమియా టెస్ట్ ప్యాకేజీలో హీమోగ్రామ్, ఐరన్ స్టడీస్, విటమిన్ బి12, ఎస్‌డిహెచ్, బైల్యురోబిన్ (టోటల్+కన్సల్టేషన్) పరీక్షలు ఉంటాయి. రెస్పిరేటరీ హెల్త్ చెకప్:రూ.1500 రెస్పిరేటరీ హెల్త్ చెకప్ ప్యాకేజీలో హీమోగ్రామ్ పరీక్షతో పాటుగా అబ్సల్యూట్ కౌంట్, పల్మనరీ ఫంక్షన్ టెస్ట్, ఇమ్యునాల్జాబులిన్ పరీక్షలు ఉంటాయి. బోన్ అండ్ జాయింట్ హెల్త్ చెకప్: రూ.2400 బొన్ అండ్ జాయింట్ హెల్త్ చెకప్ ప్యాకేజీలో కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం, విటమిన్–డి, యూరిక్ యాసిడ్, టీఎస్‌హెచ్, ఈఎస్ఆర్ పరీక్షలతో పాటు కన్సల్టేషన్ సేవలు పొందవచ్చు. కార్డియాక్ హెల్త్ చెకప్: రూ.3800 కార్డియాక్ హెల్త్ చెకప్ ప్యాకేజీలో హీమోగ్రామ్, లిపిడ్ ప్రొఫైల్, ఈసీజీ, 2డి ఈకో, సీఎక్స్ఆర్–పీఏ రివ్యూ, టీఎంటీ పరీక్షలతో పాటు కన్సల్టేషన్ సేవలు పొందవచ్చు. కిడ్నీ హెల్త్ చెకప్: రూ.1900 కిడ్నీ హెల్త్ చెకప్ ప్యాకేజీలో సెరమ్ యూరియా, సియూఈ, సెరమ్ క్రియేటినైన్, సెరమ్ కాల్షియం, సెరమ్ యూరిక్ యాసిడ్, యూరిన్ మైక్రో అల్బుమిన్, సెరమ్ ఆల్బుమిన్(టోటల్) పరీక్షలతో పాటుగా కన్సల్టేషన్ సేవలు పొందవచ్చు. కేన్సర్ స్క్రీనింగ్: రూ.2000 (పురుషులు) కేన్సర్ స్క్రీనింగ్ పురుషుల ప్యాకేజీలో పీఎస్ఏ, యుఎస్‌జీ– అబ్డామిన్, సీఎక్స్ఆర్–పీఏ రివ్యూ, సెరమ్ క్రియేటినైన్, సీబీపీ, హీమోగ్రామ్, లివర్ ఫంక్షన్ టెస్ట్‌లు ఉంటాయి. కేన్సర్ స్క్రీనింగ్: రూ.3500 (మహిళలు) కేన్సర్ స్క్రీనింగ్ మహిళలు ప్యాకేజీల మామోగ్రఫీ, పీఎస్ఏ, హిమోగ్రఫీ, లివర్ ఫంక్షన్ టెస్ట్ ఉంటాయి. టోటల్ థైరాయిడ్ ప్రొఫైల్: రూ.2500 టోటల్ థైరాయిడ్ ప్రొఫైల్ ప్యాకేజీలో టి3, టి4, టిఎస్హెచ్, యాంటీ థైరాయిడ్, యాంటీ బ్యాడీ, హెచ్ఆర్యుఎస్ నెక్ పరీక్షలు చేస్తారు. లివర్ ప్రొఫైల్: రూ.2200 లివర్ ప్రొఫైల్ ప్యాకేజీలో లివర్ ఫంక్షన్ టెస్ట్‌తో పాటుగా సెరమ్ జీజీటీపీ, హెచ్ఐవీ ఈఎల్ఎఫ్ఏ, హెచ్‌బీఎస్‌ఏజీ ఈఎల్ఎఫ్ఏ, హెచ్‌సీవీ ఈఎల్ఐఎస్ఏ, యుఎస్‌జి అబ్డామిన్ పరీక్షలు ఉంటాయి. ఎగ్జిక్యూటివ్ హెల్త్ చెకప్: రూ.7000 (పురుషులు) ఈ ప్యాకేజీలో హీమోగ్రామ్, లిపిడ్ ప్రొఫైల్, లివర్ ఫంక్షన్ టెస్ట్ నిర్వహిస్తారు. అదే ఎగ్జిక్యూటివ్ హెల్త్ చెకప్ మహిళలు ప్యాకేజీలో రూ.8000 చెల్లించాలి. వివరాలకు 040–23489023 ఫోన్ నెంబర్లో సంప్రదించాలి. -
అభినందన్ వెన్నెముకకు గాయం
న్యూఢిల్లీ: పాకిస్తాన్ చెర నుంచి విడుదలైన భారత వాయుసేన(ఐఏఎఫ్) వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌కు వెన్నెముక కింది భాగంలో గాయమైనట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అలాగే పాకిస్తాన్లో అల్లరిమూకలు చేసిన దాడిలో అభినందన్ పక్కటెముక ఒకటి దెబ్బతిందని వెల్లడించాయి. ఎంఆర్ఐ స్కాన్‌లో ఆయన శరీరంలో ఎలాంటి బగ్స్(సూక్ష్మ నిఘా పరికరాలు) లేనట్లు తేలిందని పేర్కొన్నాయి. ఢిల్లీ కంటోన్మెంట్‌లోని రీసెర్చ్ అండ్ రెఫరల్ ఆసుపత్రిలో అభినందన్‌కు చికిత్స కొనసాగుతోంది. భారత భూభాగంలోకి ప్రవేశించిన పాక్ ఎఫ్–16 యుద్ధ విమానాన్ని తన మిగ్–21 ద్వారా అభినందన్ కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తన విమానం కూడా దెబ్బతినడంతో పారాచూట్‌తో అభినందన్ ఎజెక్ట్ అయ్యారు. విమానం నుంచి బయటకొచ్చే క్రమంలోనే ఆయన వెన్నెముకకు గాయమై ఉంటుందని భావిస్తున్నారు. అభినందన్ ఆరోగ్యస్థితిని అంచనా వేసే ‘కూలింగ్ డౌన్’ ప్రక్రియలో భాగంగా మరిన్ని పరీక్షలు చేయనున్నారు. కొనసాగుతున్న విచారణ.. పైలట్ అభినందన్‌ను ఆదివారం భద్రతాసంస్థల ఉన్నతాధికారులు విచారించారు. పాక్ ఆర్మీకి చిక్కాక ఐఏఎఫ్ రహస్యాలను ఏమైనా బయటపెట్టారా? అనే కోణంలో ఈ విచారణ సాగుతోంది. ఈ విచారణ మరికొన్ని రోజులు కొనసాగవచ్చని అధికారులు వెల్లడించారు. వీలైనంత త్వరగా తిరిగి కాక్‌పిట్‌లో కూర్చునేందుకు అభినందన్ ఆత్రుతగా, ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారన్నారు. ఎఫ్–16 యుద్ధ విమానాన్ని కుప్పకూల్చిన తొలి భారత పైలట్‌గా అభినందన్ చరిత్ర సృష్టించారన్నారు. ‘మహవీర్ అహింసా పురస్కారం’.. అభినందన్‌కు ‘భగవాన్ మహవీర్ అహింసా పురస్కారం’ను అందజేస్తామని అఖిల భారతీయ దిగంబర్ జైన్ మహాసమితి ప్రకటించింది. ఈ పురస్కారాన్ని అందుకోబోతున్న తొలి వ్యక్తి అభినందనేనని సమితి చైర్మన్ మందిరా జైన్ తెలిపారు. త్వరలో బెంగళూరుకు.. సాక్షి, బెంగళూరు: భారత పైలట్ అభినందన్ వర్ధమాన్ త్వరలో బెంగళూరుకు రానున్నట్లు ఐఏఎఫ్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. యుద్ధవిమానాలు నడిపేందుకు అభినందన్ ఫిట్‌గా ఉన్నారా? లేదా? తెలుసుకునేందుకు బెంగళూరులోని హెచ్ఏఎల్లో ఉండే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్లో సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ పరీక్షల్లో ఫిట్నెస్ చాటుకుంటే మళ్లీ యుద్ధవిమానాలు నడిపేందుకు అభినందన్‌ను అనుమతిస్తామని పేర్కొన్నారు. -
మానసికంగా వేధించారు
న్యూఢిల్లీ: పాకిస్తాన్ చెరలో ఉన్న సమయంలో తనను శారీరకంగా హింసించకున్నా మానసికంగా చాలా వేధింపులకు గురిచేశారని భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ శనివారం వైమానిక దళ ఉన్నతాధికారులకు చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. శనివారం ఆరోగ్య పరీక్షల సమయంలో తనను కలవడానికి వచ్చిన రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, అధికారులతో ఆయన ఈ విషయాలు పంచుకున్నట్లు తెలిసింది. పాకిస్తాన్లో వేధింపులకు గురైనా అభినందన్ మానసికంగా ఎంతో దృఢంగా ఉన్నారని అధికారులు తెలిపారు. తమ భూభాగంలో దొరికిపోయిన తరువాత అభినందన్‌పై కొందరు స్థానికులు భౌతిక దాడికి పాల్పడ్డారని, కానీ తాము ఆయనని రక్షించి జెనీవా ఒప్పంద మార్గదర్శకాల ప్రకారం చికిత్స అందించామని పాకిస్తాన్ పేర్కొన్న సంగతి తెలిసిందే. గాయాలతో రక్తం కారుతుండగా అభినందన్‌ను పాకిస్తాన్ సైనికులు తీసుకెళ్తున్న వీడియో బహిర్గతం కావడంపై భారత్ ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత అక్కడి సైనికులతో మాట్లాడుతూ అభినందన్ టీ తాగుతున్న మరో వీడియో విడుదలైంది. భారత్‌కు అప్పగించే ముందు అభినందన్‌తో పాకిస్తాన్ సైన్యాన్ని పొగుడుతూ ఓ వీడియోను రూపొందించినట్లు శుక్రవారం మీడియాలో కథనాలు వచ్చాయి. అల్లరి మూక నుంచి పాకిస్తాన్ ఆర్మీయే తనను కాపాడిందని చెప్పిన ఆ వీడియో షూటింగ్ వల్లే అభినందన్ అప్పగింత ఆలస్యమైందని కూడా భావిస్తున్నారు. పాకిస్తాన్ నుంచి తిరిగొచ్చిన తరువాత అభినందన్ కుడి కన్ను ఉబ్బినట్లు కనిపించింది. నిర్మలకు వివరించిన అభినందన్.. ఢిల్లీలోని ఎయిర్‌ఫోర్స్ సెంట్రల్ మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్ కేంద్రంలో రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ అభినందన్‌ను కలుసుకున్నారు. ఆయన ధైర్యసాహసాల పట్ల దేశం గర్విస్తోందని ఆమె కొనియాడినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ చెరలో ఉన్న 60 గంటల పాటు తానెదుర్కొన్న అనుభవాలు, పరిస్థితుల్ని అభినందన్ నిర్మలా సీతారామన్‌కు వివరించినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో అభినందన్ భార్య స్క్వాడ్రన్ లీడర్ తాన్వి మార్వా(రిటైర్డ్), ఏడేళ్ల కొడుకు, సోదరి అదితి కూడా అక్కడే ఉన్నారు. ‘కూలింగ్ డౌన్’ పరీక్షలు పాక్ నిర్బంధం నుంచి విడుదలైన పైలట్ అభినందన్‌కు శనివారం వైద్య పరీక్షలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం వాఘా సరిహద్దులో ఆయన్ని పాక్ అధికారులు అప్పగించాక నేరుగా ఢిల్లీకి తరలించిన సంగతి తెలిసిందే. ‘కూలింగ్ డౌన్’ విధానంలో భాగంగా అభినందన్ మానసిక, శారీరక ఆరోగ్య స్థితిగతుల్ని మదింపు చేయడానికి జరుగుతున్న పరీక్షలు ఆదివారం వరకు కొనసాగే అవకాశాలున్నాయి. ఆర్మీ, నిఘా అధికారుల సమక్షంలో ఎయిర్‌ఫోర్స్ సెంట్రల్ మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్(ఏఎఫ్‌సీఎంఈ) కేంద్రంలో అభినందన్ హెల్త్ చెకప్ కొనసాగుతోంది. ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత, పాకిస్తాన్ నిర్బంధంలో ఉన్నప్పుడు ఎదుర్కొన్న పరిస్థితుల గురించి పూర్తి సమాచారం రాబట్టేందుకు ఆయన్ని విచారిస్తామని అధికారులు తెలిపారు. అంతకుముందు, అభినందన్‌ను ఆయన తల్లిదండ్రులు, వైమానిక దళ ఉన్నతాధికారులు కలుసుకున్నారు. అభినందన్ రాకతో శనివారం ఢిల్లీలో బీజేపీ కార్యకర్తల సంబరాలు -
కాంట్రాక్ట్ కార్మికులకు వైద్య పరీక్షలు
భెల్: కార్మికులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా పనిచేయగలుగుతారని ఏజీఎం హెచ్ఆర్ ఆదిశేష్, భెల్ అధికార కార్మిక యూనియన్ అధ్యక్షుడు జి.ఎల్లయ్య పేర్కొన్నారు. బీహెచ్ఈఎల్, ఈఎస్ఐ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం జ్యోతి విద్యాలయంలో ఒప్పంద కార్మికులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈఎస్ఐ జాయింట్ డైరక్టర్ సమక్షంలో వైద్య బందం కార్మికులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భెల్ పరిశ్రమ యాజమాన్యం కాంట్రాక్ట్ కార్మికుల ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకొని ఉచిత వైద్య శిబిరం నిర్వహించిదన్నారు. కార్మికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శిబిరం మరో రెండు రోజుల పాటు కొనసాగింస్తామనిఅధికారులు పేర్కొన్నారు. కార్మికులకు పరీక్షల్లో ఇతరత్ర వ్యాధులు నిర్ధారణ అయితే మెరుగైన వైద్యం కోసం కార్పొరేటర్ ఆస్పత్రులకు తరలిస్తామన్నారు. కార్యక్రమంలో నిర్వాహకులు సత్యబాబు, వైద్యులు, కార్మిక యూనియన్ నాయకులు, హెచ్ఆర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
‘స్వైన్’విహారం
నాగర్‌కర్నూల్, న్యూస్‌లైన్: జిల్లాలో స్వెన్‌ఫ్లూ చాపకింద నీరు లా విస్తరిస్తోంది. ఆ పేరు వింటేనే సామాన్యులు గజగజ వణుకుతున్నారు. ముఖ్యం గా నియోజకవర్గం తూడుకుర్తి గ్రామంలో ఈ అంటువ్యాధి పంజా విసురుతోంది. ఈ గ్రామానికి చెందిన వెంకట్రాజు(58), పుష్పావతమ్మ(40) అనే మరో ఇద్దరు స్వైన్‌ఫ్లూ వ్యాధి బారినపడినట్లు జిల్లా వైద్యాధికారులు గుర్తించారు. కాగా, ఇదే గ్రామానికి చెందిన ఆనంద్ అనే యువకుడు వ్యాధి బారినపడి ప్రస్తుతం హైదరాబాద్‌లో వైద్యచికిత్సలు పొందుతున్న విష యం తెలిసిందే.. ఆయన తండ్రి రాంచంద్రయ్యకు కూడా ప్రస్తుతం అక్కడే వైద్యం తీసుకుంటున్నాడు. తాజాగా, అదే గ్రా మంలో మరో ఇద్దరిలో స్వెన్‌ఫ్లూ లక్షణాలు కనిపించడంతో గ్రామస్తులు కలవరపడుతున్నారు. దీంతో అప్రమత్తమైన వైద్యశాఖ అధికారులు రెవెన్యూ, పంచాయతీ అధికారులు గ్రామంలో వైద్యశిబిరం నిర్వహిస్తున్నారు. కాగా, మొదట వ్యాధిప్రబలిన వారితో పాటు వారి కుటుంబసభ్యులు, వారికి అత్యంత చనువుగా ఉండే నలుగురి రక్తనమూనాలు సేకరించి పరీక్షలకు పంపించారు. వారిలో సమీప ఇళ్లకు చెందిన వెంకట్రాజు, పుష్పావతమ్మను వ్యాధి పీడితులుగా గుర్తించినట్లు జిల్లా వైద్యాధికారిణి(డీఎంహెచ్ఓ) రుక్మిణమ్మ తెలిపారు. ప్రస్తుతం వీరికి జిల్లా ఆస్పత్రిలోని ప్రత్యేకవార్డులో వైద్యచికిత్సలు అం దజేస్తున్నామని వెల్లడించారు. తాజాగా వ్యాధి గుర్తించిన వారికి ఇక్కడే చికిత్సచేస్తామని, పరిస్థితిని బట్టి అవసరమైతే హైదారాబాద్‌కు రెఫర్ చేస్తామన్నారు. తూడుకర్తి గ్రామంలో బుధవారం ఇంటిం టి సర్వే నిర్వహించామని, తీవ్రంగా దగ్గు, జ్వరం వంటి లక్షణాలు ఉన్న వారెవరూ లేరని తేలిందని ఆమె పేర్కొన్నారు. అయి నా అనుమానం ఉన్న వారికి మందులు ఇస్తున్నామని, అలాంటి వారిని నిత్యం పరిశీలించి పరిస్థితిని అంచనా వేస్తామని డీఎంహెచ్ఓ చెప్పారు. ఆందోళన చెందొద్దు: కలెక్టర్ కలెక్టరేట్: జిల్లాలో స్వైన్‌ఫ్లూ పట్ల ప్రజలు ఆందోళన చెందొద్దని, ఇందుకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ సమీప ఆరోగ్యం కేంద్రంలో సంప్రదించి రక్షణపొందాలని కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ విజ్ఞప్తిచేశారు. గురువారం తన క్యాంపు కార్యాలయంలో జిల్లా వైద్యరోగ్యశాఖతోపాటు, కొలంబియా గ్లోబల్ సెంటర్ ప్రతినిధులతో మాతా శిశు మరణాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇటీవల తూడుకుర్తి గ్రామానికి చెందిన ఆనంద్ అనే వ్యక్తికి స్వైన్‌ఫ్లూ ప్రబలడంతో హైదరాబాద్‌లోని యశో ఆస్పత్రిలో చికిత్సపొం దుతూ కోలుకుంటున్నాడని తెలిపారు. అతని తండ్రి రాంచంద్రయ్యను గాంధీ ఆస్పత్రిలో వైద్యసేవలు పొందుతూ ఇద్దరుక్షేమంగా ఉన్నారని పేర్కొన్నారు. తూడుకుర్తి గ్రామంలో వైద్యబృందాలు అప్రమత్తంగా ఉన్నాయని, ప్రతి ఇంటికెళ్లి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మాతాశిశు మరణాలను తగ్గించడంతోపాటు, గర్భిణులు ప్రభుత్వాసుపత్రుల్లోనే ప్రసవం అయ్యేవిధంగా జిల్లాలో నాలుగు మండలాలను పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపికచేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ రుక్మిణమ్మ, కొలంబియా గ్లోబల్ సెంటర్ తరుపున శుబ్రా కుమార్, శ్రీనివాస్‌రావు, ఎస్వీఎస్ ఆస్పత్రి వైద్యులు డాక్టర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.