Neena Rao: బిడ్డ మేధాశక్తిని గ్రహించండి! బిడ్డకు ఏమివ్వాలో తెలుసుకోండి..
ప్రతి బిడ్డా ప్రత్యేకమే. మీ బిడ్డ పదిలో ఒకరు కాకపోవచ్చు. పదిమంది చేసినట్లు చేయకపోవచ్చు. మీకు పుట్టింది ఐన్‌స్టీన్ కావచ్చు. బిల్ గేట్స్ కూడా కావచ్చు. బిడ్డ మేధాశక్తిని గ్రహించండి. బిడ్డకు ఏమివ్వాలో తెలుసుకోండి. మీ బిడ్డ విజేతగా నిలుస్తాడు.
హర్షవర్ధన్ రావు... యూఎస్‌లో స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసుకున్న ఆదిలాబాద్ కుర్రాడు. తల్లిదండ్రులు విదేశాల్లో స్థిరపడినప్పుడు పిల్లలు అక్కడే చదువుకుంటారు... అందులో కొత్త, వింత ఏమీ ఉండకపోవచ్చు. అయితే హర్ష ఒక విజేత. అతడి తల్లి నీనారావు అతడి మార్గదర్శి. కొడుకును తీర్చిదిద్దడం కోసం ఆమె తన కెరీర్‌ను వదులుకున్నారు.
ఇప్పుడు హర్ష చదువు, ఆటపాటలు, హార్స్‌రైడింగ్ వంటి నైపుణ్యాల్లో ఆరితేరాడు. నేషనల్ లెవెల్ హార్స్ రైడింగ్ చాంపియన్‌షిప్ గెలుచుకున్నాడు. సానుభూతి చూపులతో సాంత్వన పొంది, అంతటితో తృప్తి పడి ఉంటే ఈ రోజు తన కొడుకును విజేతగా చూపించగలిగేవారు కాదు నీనారావు. ఈ ప్రయత్నంలో ఆమె టాప్ 100 హెల్త్ కేర్ లీడర్స్ కేటగిరీలో చేరారు. ఈ సందర్భంగా సాక్షితో ఆమె పంచుకున్న వివరాలు.
నా దిశ మారింది!
‘‘మాది మహారాష్ట్ర, మా వారిది మంచిర్యాల. అలా తెలుగింటి కోడలి నయ్యాను. నా జీవితాన్ని రెండు వేర్వేరు పార్శ్వాలుగా చూడాలి. తొలి పార్శ్వం పూర్తిగా అకడమిక్ గా సాగింది. పీహెచ్డీ పూర్తి చేసి ఎకనమిక్స్, హిస్టరీ, నేచురల్ రీసోర్సెస్ మేనేజ్మెంట్ విధానాలు, పర్యావరణ నిర్వహణ వంటి అంశాల మీద అనేక పరిశోధన పత్రాలను జాతీయ, అంతర్జాతీయ వేదికల మీద సమర్పించాను.
యూఎస్‌లో నివసిస్తున్న నేటివ్ అమెరికన్లు, ఆఫ్రికన్ అమెరికన్లు, లాటిన్ అమెరికన్ జాతులు, మనదేశంలో నాగాలాండ్, అండమాన్, ఇతర ఆదివాసీ జాతుల మీద పరిశోధనలు నిర్వహించాను. మా అబ్బాయి హర్షవర్ధన్ స్పెషల్ నీడ్స్ కిడ్ అని తెలిసిన తరవాత నా పంథా పూర్తిగా మారిపోయింది. మేము గుర్తించడం కూడా ఆలస్యంగానే జరిగింది.
ఆ తర్వాత ఇక ఏ మాత్రం ఆలస్యం చేయలేదు. తనకు పన్నెండేళ్లు నిండినప్పుడు మేము యూఎస్‌కి తీసుకెళ్లిపోయాం. ఆస్పెర్గర్స్ సిండ్రోమ్ ఉందని చెప్పారు అక్కడి డాక్టర్లు. అంటే తన మనసులో అనుకున్న విషయాన్ని సంభాషణ ద్వారా వ్యక్తీకరించడంలో తగినంత చురుగ్గా లేకపోవడం అనవచ్చు. హర్ష చాలా తెలివైన పిల్లాడు, తన సమస్యను అధిగమించడానికి తల్లిదండ్రులుగా మా వంతు సపోర్టునివ్వాలి. అందుకోసం ఆటిజమ్‌తో సంబంధం ఉన్న అనేక సంస్థలు, నిపుణులను సంప్రదించాను. తనను ది బెస్ట్ కిడ్‌గా తయారు చేసుకోగలిగాను.
యూఎస్‌లో హైస్కూల్లో ఆనర్స్ చేసి అండర్ గ్రాడ్యుయేషన్‌లో చేరాడు. హార్స్ రైడింగ్‌లో చురుగ్గా ఉన్నాడు. ఇంకో విషయం... మా అబ్బాయి యూఎస్‌లో చదివినప్పటికీ ఇంగ్లిష్‌తోపాటు తెలుగు చదవడం రాయడం కూడా బాగా నేర్చుకున్నాడు.
నేను ఇంతగా శ్రమించడానికి ఆర్థిక వెసులుబాటు ఉంది. అలాగే భర్త, ఇతర కుటుంబ సభ్యుల సహకారం చాలా ఉంది. ఐదువందల మందిలో ఒక బిడ్డ ఇలా ఉండే అవకాశం ఉంది. అంటే ప్రపంచంలో నాలాంటి తల్లులు ఇంకా ఉన్నారు. అయితే వాళ్లందరికీ నాకు ఉన్న వెసులుబాటు ఉండకపోవచ్చు.
అందుకే హర్ష కోసం యూఎస్, యూకే, ఇండియాలోని నిపుణుల ద్వారా నేను తెలుసుకున్న విషయాలన్నింటినీ క్రోడీకరిస్తూ స్పెషల్ నీడ్స్ ఉన్న పిల్లల కోసం ఒక నియమావళిని రూపొందించాను. కోవిడ్ సమయంలో ఆన్లైన్ క్లాసులకు హాజరు కాలేని పేదవాళ్లకు మార్గిక సేవాసంస్థ నుంచి సాధారణ మొబైల్ ఫోన్ల ద్వారా ప్రత్యేక సేవలందించాం.
పేరెంట్స్తోపాటు స్పెషల్ ఎడ్యుకేటర్స్కి శిక్షణనిచ్చాం. వాళ్లు పిల్లలకు ఫోన్ ద్వారా రోజుకో టాస్క్ ఇస్తూ రోజంతా ఒక వ్యాపకంలో మునిగేలా చేశారు. అలాగే సైకాలజిస్ట్‌లు, కౌన్సిలర్లకు కూడా థియరిటికల్‌గా ట్రైనింగ్ ఇస్తున్నాం.
సానుభూతి వద్దు!
ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల తల్లులకు నేను చెప్పేది ఒక్కటే. పిల్లలు పుట్టిన తర్వాత నెలలు గడిచే కొద్దీ మెడ నిలపాల్సిన సమయానికి మెడ నిలపకపోవడం, కూర్చోవాల్సిన సమయానికి కూర్చోకపోవడం, మాట్లాడాల్సిన వయసుకి మాట్లాడకపోవడం వంటి తేడాని గుర్తించిన వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.
ఎవరూ ఇలాంటి స్థితిని కోరు కోరు. కానీ ఎదురైన తర్వాత ఎదుర్కోవడం ఒక్కటే మన ముందున్న ఆప్షన్. మానసికంగా కుంగిపోవద్దు. దేనినీ దాచవద్దు. పిల్లలను సమాజానికి చూపించకుండా ఇంట్లో ఉంచే ప్రయత్నం చేయవద్దు.
ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పెంచాలి. పిల్లల మూడ్‌ని బట్టి ఆ సమయంలో వారిని ఎలా డీల్ చేయాలనే విషయంలో శిక్షణ తీసుకోవాలి. ఆ అవగాహనతో మెలగాలి. వారిలో తప్పనిసరిగా ప్రత్యేకమైన కళ ఏదో ఉండి తీరుతుంది. దానిని గ్రహించండి. దానిని సాధన చేయించండి.
నేను ఓ చాంపియన్‌కి తల్లినయ్యాను. మీ బిడ్డ ఐన్‌స్టీన్ కావచ్చు... మీరు ఐన్‌స్టీన్ తల్లి కావచ్చు’’ అన్నారు నీనారావు. సింపతీ కోరుకోవద్దని తల్లులకు చెబుతూనే, ‘ప్రత్యేకమైన పిల్లల పట్ల, ఆ తల్లిదండ్రుల పట్ల సానుభూతి చూపించడం మానేయండి. దానికి బదులు ప్రోత్స హించండి’ అని సమాజానికి హితవు చేశారామె.
ప్రత్యేక చిత్రకారులు
స్పెషల్ నీడ్స్ ఉన్న పిల్లల్లో కొందరు చక్కగా పాటలు పాడేవాళ్లున్నారు. మరొకరు చక్కగా బొమ్మలు వేస్తారు. మరొకరు మంచి కవితలు రాస్తారు. వాళ్లలోని సృజనాత్మకతను బయటకు తీయడం మన బాధ్యత. పిల్లలు వేసిన బొమ్మలు, కవితలతో ఓ పుస్తకం ప్రచురించాం. మేఘన తల్లి ఇద్దరమ్మాయిలున్న సింగిల్ పేరెంట్.
ఆ అమ్మాయి వేసిన బొమ్మ చూడండి. చెట్టుకొమ్మకు కట్టిన ఊయల, ఆ ఊయలలో తల్లి రూపం ఉంది. ఊయల లోపల పాపాయి ఉంది. పన్నెండేళ్ల అమ్మాయి మాతృత్వాన్ని ఎంత అద్భుతంగా చిత్రించిందో చూడండి. మరో అమ్మాయి సమాజంలో స్త్రీ ఎదుర్కొంటున్న సవాళ్లను అర్థం చేసుకుని చక్కటి నినాదాలతో బొమ్మలు వేసింది. తమ మేధను వ్యక్తం చేయడానికి ఒక్కొక్కరు ఒక్కో మాధ్యమాన్ని ఎంచుకున్నట్లే వీరు కూడా.
– డాక్టర్ నీనారావు, ఫౌండర్, మార్గిక స్వచ్ఛంద సంస్థ
– వాకా మంజులారెడ్డి,
ఫొటోలు : మోహనాచారి