అమ్మాయి ఆరోగ్యానికి ఏడు పరీక్షలు
ఆడపిల్లలు ఆరోగ్యంగా పెరగాలి. అన్ని రంగాల్లో ప్రతిభ చూపాలి.వారికి వద్దు ఆటంకాలు. వారిపై వద్దు చిన్నచూపు.ఇదే ‘నేషనల్ గర్ల్ చైల్డ్ డే’ సందేశం.అయితే యుక్త వయసుకు వచ్చిన బాలికలకు చాలామంది తల్లిదండ్రులు ఆరోగ్య పరీక్షలు చేయించరు.వైద్యనిపుణులు మాత్రం ఎదిగే వయసులోని ఆడపిల్లలకు తప్పనిసరిగా ఆరోగ్య పరీక్షలు చేయించాలంటున్నారు.‘జాతీయ బాలికా దినోత్సవం’ సందర్భంగా తల్లిదండ్రులు ఆడపిల్లలకు ఇవ్వాల్సిన కానుక ఈ ఆరోగ్య పరీక్షలే.
ఆడుతూ పాడుతూ ఉన్నంత మాత్రాన మన ఇంటి ఆడపిల్లలకు శారీరకంగా ఏవో కొన్ని పోషక విలువల లోటుపాట్లు ఉండకపోవు. అయితే చాలామంది తల్లిదండ్రులు వాటిని నిర్థారణ చేసుకోరు. నిజానికి బాలికలు అనేక శారీరక సవాళ్లను ఎదుర్కొంటారు. యుక్తవయస్సు వచ్చిన తర్వాత శారీరక మార్పులకు లోనవుతారు.
పోషకాహార లోపంతో బాధపడే బాలికల్లో కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. అందుకే వారి ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసేందుకు, లోపాలను సరి చేసుకునేందుకు కొన్ని పరీక్షలు తరచూ చేయించాలంటున్నారు వైద్య నిపుణులు. బాలికల సమగ్ర వికాసాన్ని సందేశంగా ఇచ్చే ‘నేషనల్ గర్ల్ చైల్డ్ డే’ సందర్భంగా తప్పక ఈ పరీక్షలను చేయించడమే ఆడపిల్లలకు ఇచ్చే అసలైన కానుక అవుతుంది.
కంప్లీట్ బ్లడ్ పిక్చర్ (సీబీపీ): బాలికల్లో రక్తహీనత సర్వసాధారణం. పూర్తి రక్త గణన (íసీబీపీ) పరీక్ష చేయించడం వల్ల రక్తహీనత ఉందో లేదో తెలుస్తుంది. సీబీసీ పరీక్ష ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్స్ కౌంట్ గురించి చెబుతుంది. ఇన్ఫెక్షన్లు ఏమైనా ఉన్నా సీబీపీ పరీక్ష తెలియచేస్తుంది. బాలికల్లో అలసట, బరువు తగ్గడం, జ్వరం, బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటే అసలు కారణం తెలియడానికి సీబీపీ చేయించడం మంచిది.
ఐరన్ప్రొఫైల్: ఐరన్ లోపం వల్ల రక్తహీనత వంటి వ్యాధులు వస్తాయి. శరీరం తగినన్ని ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయనప్పుడు సాధారణంగా రక్తహీనత వస్తుంది. సరైన ఆహారం, ఐరన్ సప్లిమెంట్లు, ఐరన్ స్థాయులను క్రమం తప్పకుండా పర్యవేక్షించడం ద్వారా ఈ పరిస్థితిని (ఐరన్ లోపాన్ని) సమర్థంగా అధిగమించవచ్చు.
విటమిన్ప్రొఫైల్ టెస్ట్స్: ఉత్సాహకరమైన శారీరక ఆరోగ్యానికి విటమిన్లు చాలా అవసరం. విటమిన్ప్రొఫైల్ టెస్ట్స్ వల్ల విటమిన్ల లోపం ఏదైనా ఉంటే తెలుస్తుంది. విటమిన్ బి12 జీవ క్రియలకు అత్యంత ముఖ్యమైనది. ఆ విటమిన్ లోపం ఉంటే వైద్యుని సలహాతో దానిని పూరించే సప్లిమెంట్స్ ఇప్పించాలి.
విటమిన్ డి లోపంతో ఎముకలపై ప్రభావం పడుతుంది. శరీరంలో డి విటమిన్ తగ్గకుండా ఉదయపు ఎండ తగిలేలా చూడటం, వైద్యుల సూచనతో సప్లిమెంట్స్ తీసుకోవడం చేయాలి. ఆడపిల్లలు కండరాల బలహీనత, అలసట, ఎముకల్లో నొప్పిని ఎదుర్కొంటుంటే విటమిన్ల టెస్ట్ తప్పక చేయించాలి.
మూత్ర పరీక్ష: మైక్రోస్కోప్ ద్వారా చేసే మూత్రపరీక్ష ఏవైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే తెలియచేస్తుంది. బాలికల్లో పొత్తి కడుపు నొప్పి, మూత్రవిసర్జనలో ఇబ్బందులు, మూత్రంలో రక్తం, మంట వంటి లక్షణాలు కనిపిస్తే మూత్ర పరీక్ష చేయించాలి. ఒక్కోసారి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉన్నా సింప్టమ్స్ కనిపించకపోవచ్చు. అందువల్ల ఒకసారి ఈ పరీక్ష చేయించడం మంచిది.
మల పరీక్ష: ఎదిగే వయసు పిల్లలు మల విసర్జన రోజువారీ చేయకపోయినా, మల విసర్జనలో ఇబ్బంది పడుతున్నా, తరచూ విరేచనాలవుతున్నా లేదా కడుపు నొప్పితో ఇబ్బంది పడుతున్నా అదేం పెద్ద విషయం కాదన్నట్టు నిర్లక్ష్యం చేయకూడదు. మల పరీక్ష చేయించాలి. దానివల్ల జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఏవైనా ఇన్ఫెక్షన్లు ఉంటే తెలుస్తుంది.
కంటి పరీక్ష: టీనేజ్ పిల్లలకు తప్పనిసరిగా చేయించాల్సిన పరీక్ష ఇది. ఈ వయసులో హ్రస్వదృష్టి వచ్చినా, దీర్ఘదృష్టి వచ్చినా పిల్లలు దానిని గుర్తించకనే కంటికి శ్రమ ఇచ్చి రోజువారి పనులను, చదువును కొనసాగిస్తారు. కాని కంటి పరీక్ష వల్లే దృష్టిలోపం తెలుస్తుంది. ఈ వయసులో గుర్తించకుండా దృష్టిలోపం కొనసాగితే తర్వాత కాలంలో కంటి నరాలకు సంబంధించిన సమస్యలు వస్తాయి. అందుకని కంటి పరీక్ష తప్పదు.హార్మోనల్ వర్కప్ టెస్ట్: ఆడపిల్లల్లో ఈడేరడం ఆలస్యం అవుతుంటే ఈ టెస్ట్ చేయించడం తప్పనిసరి. దీనివల్ల పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్, థైరాయిడ్ పని తీరు, అడ్రినల్ గ్రంథి పనితీరు తదితరాలు తెలుస్తాయి. దీనివల్ల యుక్తవయసుకు జాప్యం ఎందుకో తెలుస్తుంది. సరి చేయ వీలవుతుంది.