భారీగా తగ్గిన వరిసాగు విస్తీర్ణం
మొయినాబాద్: ఖరీఫ్ సీజన్లో వరిసాగు భారీగా తగ్గింది. సీజన్ మొదలైన జూన్ నుంచి వర్షాలు కురవకపోవడంతో వరిసాగుకు పరిస్థితులు అనుకూలించలేదు. దీంతో ఆగస్టు చివరి వరకు వరినాట్లు కొనసాగాయి. అయినప్పటికీ సాగు విస్తీర్ణం సాధారణం కంటే భారీగా తగ్గింది. సాధారణంలో సుమారు 40 శాతం మాత్రమే వరి సాగు అయ్యింది. జూన్, జూలై నెలల్లో వర్షాలు పూర్తిగా లేకపోవడంతో చాలామంది వరిసాగును చేపట్టలేదు. చివరకు ఆగస్టులో కొంతమేర పడ్డ వర్షాలకు వరి సాగు విస్తీర్ణం సాధారణంలో 40 శాతం వరకు పెరిగింది.
1550 ఎకరాలకు పరిమితం
మండలంలో సాధారణంగా వరి సాగు విస్తీర్ణం 3822 ఎకరాలు కాగా ప్రస్తుతం సాగు చేసింది 1550 ఎకరాలు మాత్రమే. ప్రతి సంవత్సరం మండలంలోని చిలుకూరు, నాగిరెడ్డిగూడ, బాకారం, అజీజ్నగర్, చిన్నమంగళారం, చందానగర్, మేడిపల్లి, పెద్దమంగళారం, ఎలుకగూడ, రెడ్డిపల్లి, సురంగల్, శ్రీరాంనగర్, కనకమామిడి, వెంకటాపూర్, నక్కలపల్లి, కేతిరెడ్డిపల్లి, తోలుకట్ట, అమ్డాపూర్ తదితర గ్రామాల్లో వరి అధికంగా సాగుచేసేవారు. ఈసారి వర్షాభావ పరిస్థితులతో ఆయా గ్రామాల్లో వరినాట్లు వేయడం చాలా వరకు తగ్గింది. సురంగల్, శ్రీరాంనగర్, కనకమామిడి, వెంకటాపూర్, పెద్దమంగళారం, తదితర గ్రామాల్లో రైతులు పది శాతం కూడా వరినాట్లు వేయలేదు. ఖరీఫ్ సీజన్ ఆరంభం నుంచే వర్షాలు పడకపోవడంతో వరిసాగు చేయలేకపోయామని రైతులు అంటున్నారు.