పట్టపగలే బరి తెగించిన దొంగలు
బెంగళూరు, న్యూస్‌లైన్: దోపిడీ దొంగలు వివిధ ప్రాంతాల్లో స్వైర విహారం చేశారు. రెండిళ్లలో పట్టపగలే చొరబడి రూ. 10 లక్షల విలువైన బంగారు నగలు చోరీ చేయగా మరో ప్రాంతంలో కారు అద్దాలను ధ్వంసం చేసి రూ.10లక్షల నగదు దోచుకెళ్లారు. పోలీసుల కథనంమేరకు... బెంగళూరు నగరంలోని మైకోలేఔట్లో ప్రదీప్‌కుమార్ నివాసం ఉంటున్నాడు. ఈయన మారతహళ్ళి రింగ్ రోడ్డులోని సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తున్నాడు.
ఈయన భార్య ఎస్బీఐ బ్యాంకులో పనిచేస్తోంది. శుక్రవారం ఉదయం 9.45 గంటల సమయంలో దంపతులిద్దరూ ఇంటికి తాళం వేసి తాళం చెవిని షూ ర్యాక్‌లో పెట్టి విధులకు వెళ్లారు. పసిగట్టిన దొంగలు లోపలకు చొరబడి బీరువాలోని రూ. 6లక్షల విలువైన బంగారు నగలు చోరీ చేసి ఉడాయించారు. రాత్రి 8 గంటలకు ఇద్దరూ ఇంటికి వచ్చి చూడగా చోరీ ఘటన వెలుగు చూసింది. ఈమేరకు మైకో లేఅవుట్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు.
మరో ఇంటిలో నగలు చోరీ: అదేవిధంగా ఆనేకల్ తాలూకా, నెరలూరు గ్రామా సమీపంలోని రాఘవనగర్‌లోని వాసుదేవ్, పుష్ప దంపతుల ఇంటిలోకి దుండగులు పట్టపగలు చొరబడి రూ. 4లక్షల విలువైన బంగారు నగలు చోరీ చేశారు. శనివారం దంపతులిద్దరూ ఇంటికి తాళం వేసి విధులకు వెళ్లిన సమయంలో దొంగలు చొరబడి బీరువాలోని రూ.4లక్షల విలువైన బంగారు నగలు దోచుకొని ఉడాయించారు. సాయంత్రం ఇంటికి వచ్చిన దంపతులు జరిగిన చోరీని గుర్తించి అత్తిబెలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని వేలిముద్రలు సేకరించి దొంగల కోసం గాలింపు చేపట్టారు.
కారు అద్దాలు ధ్వంసం చేసి లూటీ: బెంగళూరుకు చెందిన బిల్డర్ నాగలక్ష్మణ రామమూర్తి నగర సమీపంలోని ఓంఎజీఆర్ రోడ్డులో అపార్ట్మెంట్ నిర్మిస్తున్నాడు. శనివారం జీవన్బీమానగరలోని కార్పొరేషన్ బ్యాంకులో రూ. 6 లక్షలు, ఇందిరానగరలోని ఆంధ్రా బ్యాంకులో రూ.4 లక్షలు డ్రా చేశాడు. ఆ మొత్తాన్ని సూట్‌కేసులో ఉంచి తాను నిర్మాణం చేపట్టిన అపార్ట్మెంట్ వద్దకు కారులో వెళ్లాడు. వాహనాన్ని నిలిపి లోపలకు వెళ్లిన సమయంలో బైక్‌లో వచ్చిన ఇద్దరు వ్యక్తులు కారు అద్దాలను ధ్వంసం చేసి నగదుతో ఉడాయించారు. శబ్ధం విని బయటకు వచ్చిన నాగలక్ష్మణ నిందితులను పట్టుకునేందుకు పరుగులు తీసి విఫలమయ్యారు. దుండగులు నలుపు రంగు పల్సర్ బైక్‌లో వచ్చి దోపిడీకి పాల్పడినట్లు బాధితుడు రామమూర్తి నగర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది.