Helath services
-
అందరికీ ఆరోగ్యం
సాక్షి రాయచోటి: పల్లె ముంగిట ఆధునిక వైద్యం అడుగు పెడుతోంది. ఎక్కడికో వెళ్లాల్సిన పని లేకుండా...అక్కడికక్కడే ఎప్పటికప్పుడు వైద్య సేవలు పొందేలా విప్లవాత్మక మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వ్యాధి ఏదైనా వైద్యం పల్లె ముంగిట లభించేలా ప్రణాళిక రూపొందించింది. పట్టణ తరహాలో పల్లెల్లోనే పరీక్షలు మొదలు ప్రతి వ్యాధికి వైద్య సేవలు అందించడానికి ముందుకు కదులుతోంది. గ్రామీణులు వైద్య చికిత్సలకు ఊరు దాటి వెళ్లకుండా.. ఉన్న ఊరిలోనే చికిత్స అందిచేందుకు వేగవంతంగా చర్యలు చేపడుతోంది. గ్రామాల్లోని వైద్య రంగంలో పెనుమార్పులు చోటు చేసుకోనున్నాయి. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా వైద్య, ఆరోగ్య రంగానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. చిన్న చిన్న జబ్బులకు గ్రామాల్లోని ప్రజలు మండల కేంద్రాలకు వెళ్లాల్సిన పరిస్థితుల నుంచి అక్కడికక్కడే వైద్యం అందుకునేలా ఆరోగ్య భరోసా కల్పిస్తోంది. 8 శరవేగంగా పనులు అన్నమయ్య జిల్లాలో రూ.52.85 కోట్ల అంచనాతో 302 వైఎస్సార్ గ్రామీణ హెల్త్ క్లినిక్‌ల భవన నిర్మాణాలు వేగంగా కొనసాగుతున్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా భవన నిర్మాణాలను పూర్తి చేయడానికి జిల్లా కలెక్టర్ చర్యలు చేపడుతున్నారు. భవనాలు పూర్తయిన వెంటనే పూర్తిస్థాయిలో వైద్య చికిత్స పరికరాలు ఏర్పాటు చేస్తారు. అందుకు సంబంధించి భవన నిర్మాణంలో భాగంగా 46 పునాది కింద స్థాయి, 39పునాది స్థాయి, రూప్ లెవెల్ 28, రూప్లైడ్ 45, సెకండ్ శ్లాబ్లైడ్ 14, ఫినిషింగ్ దశలో 51, బిల్డింగ్లు పూర్తయినవి 41 ఉన్నాయి. ఇప్పటివరకు బిల్లులు, ఇతరత్రా ఖర్చుల కింద రూ. 20 కోట్లు వెచ్చించారు. మిగిలిన పనులు కూడా పూర్తి చేయడానికి అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. దీంతో గ్రామీణ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 8 టీకాలు ఇక్కడే గర్భిణీలు, చిన్నారుల సంరక్షణ, నవజాత శిశువులకు, ఏడాదిలోపు వయస్సున్న శిశువులకు ఆరోగ్య సంరక్షణ చర్యలు తీసుకుంటారు. అన్ని రకాల వ్యాక్సిన్లు ఉంటాయి. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు ఇక్కడే టీకాలు వేయించుకునే అవకాశం ఉంటుంది. సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకునేలా ప్రజలకు వివరిస్తారు. తరుచూ వచ్చే చిన్న, చిన్న సమస్యలు, ఈఎన్టీ సమస్యలపై అవగాహన కల్పిస్తారు. వయస్సు పైబడినప్పుడు వచ్చే సమస్యల నివారణతోపాటు అత్యవసర మెడికల్ సర్వీసెస్‌లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవగాహన కల్పిస్తారు. మానసిక వ్యాధులను ముందే గుర్తించి నియంత్రించే చర్యలను చేపడతారు. 8 14 రకాల ప్రాథమిక పరీక్షలు హిమోగ్లోబిన్, గర్భవతులకు యూరిన్ పరీక్ష, ఇతర యూరిన్ టెస్టులు, బీపీ, షుగర్, మలేరియా, హెచ్ఐవీ, డెంగీ, కంటి పరీక్షలు, అయోడిన్ సాల్ట్ పరీక్షలు, హెపటైటీస్ బి, పైలేరియా, ర్యాపిడ్ టెస్ట్, కఫం పరీక్షలు ఈ క్లినిక్‌లలో చేస్తారు. 8 అత్యుత్తమ వైద్యానికి భరోసా ప్రభుత్వం గ్రామీణ ప్రజలకు వారి సొంతూరులోనే ప్రాథమిక వైద్య చికిత్సలు, వైద్య పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొస్తోంది. ప్రతి 2500 జనాభాకు ఒక వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ అందుబాటులో ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. తద్వారా చిన్న, చిన్న జబ్బులకు కూడా 10 కి.మీ దూరంలో ఉండే పీహెచ్‌సీకి వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఈ క్లినిక్‌లో 12రకాల వైద్య సేవలు అందించడంతోపాటు 14రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అందుకు సంబంధించి 75 నుంచి 90 రకాల మందులతోపాటు 67రకాల బేసిక్ మెడికల్ ఎక్విప్మెంట్ను అందుబాటులో ఉంచుతారు. వైద్య రంగంలో పెనుమార్పులు ప్రజల వైద్యానికి ప్రభు త్వం భరోసా కల్పిస్తోంది. విలేజ్ హెల్త్ క్లినిక్ ద్వారా ప్రజలను అప్రమత్తం చేయ డం మొదలుకొని చిన్నపాటి వ్యాధులనుంచి ఇతర అనారోగ్య సమస్య వరకు పరీక్షలు అక్కడే నిర్వహించనున్నారు. అవసరమైన అన్ని రకాల మందులు కూడా క్లినిక్‌లో లభిస్తాయి. దీంతో గ్రామాల్లో వైద్య రంగంలో పెను మార్పులు చోటు చేసుకోనున్నాయి. అన్నమయ్య జిల్లాలో రూ.52.85 కోట్ల అంచనాతో 302 వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాల నిర్మాణాలు వేగంగా కొనసాగుతున్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా భవన నిర్మాణాలను పూర్తి చేయడానికి పర్యవేక్షణ చేస్తున్నాం. – గిరీషా పీఎస్, జిల్లా కలెక్టర్, అన్నమయ్య జిల్లా -
'మొబైల్ యాప్స్ ఆరోగ్యస్థితిని గుర్తించలేవు'
సాక్షి, భువనగిరి : ' మీ రక్తంలో ఆక్సిజన్ స్థాయిని తనిఖీ చేసే మొబైల్ అప్లికేషను డౌన్లోడ్ చేసుకోండి అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో మెసేజ్ ఫార్వార్డ్ చేస్తున్నారు. శరీరంలో ఆక్సిజన్ స్థాయి, బీపీ, హార్ట్ బీట్ మొదలైనవి చెక్ చేసుకోడానికి ఈ మొబైల్ యాప్ ఉపయోగకరంగా ఉంది అంటూ నమ్మిస్తున్నారు. అయితే మొబైల్ యాప్స్ ఎలాంటి ఆరోగ్య స్థితి, ఆనారోగ్యం, బీపీ , పల్స్, ఆక్సిజన్ శాతాన్ని గుర్తించలేవు' అంటూ జిల్లా ఎస్పీ బాస్కరన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. 'ఈ కరోనా సంక్షేమ సమయంలో ఇలాంటి యాప్స్ ద్వారా మీ వెలి ముద్రలు సేకరించి మీ విలువైన సమాచారాన్ని దొంగిలించి ఆర్ధిక నష్టాన్ని కలగజేయడానికి సైబర్ నేరగాళ్లు వేస్తున్న సరికొత్త సైబర్ ఎత్తుగడ అని ఇలాంటి వాటిని నమ్మి మోసపోవద్దు. మీ చూపుడు వేలు వివిధ వ్యక్తిగత డేటా ప్రామాణికత కోసం ఉపయోగించబడుతుందని గమనించగలగాలి. గూగుల్ పే వంటి యాప్స్ డౌన్లోడ్ చేయగానే ఆక్సిజన్ స్థాయిలను లెక్కించడానికి కెమెరాలో మన వేలిని ఉంచమని అడుగుతాయి.అయితే మన వేలిముద్రలను హ్యకర్లు దొంగలించే అవకాశం ఉంది. బ్యాంక్‌ఖాతా లావాదేవీ హెచ్చరికలను చదవడం ద్వారా అకౌంట్లో ఎంత డబ్బు ఉందనేది హ్యాకర్లు ఇట్టే పసిగడతారు.ఇలాంటి యాప్స్‌తో జాగ్రత్తగా ఉండాలని, వాటిని డౌన్లోడ్ చేయవద్దు.' అంటూ పేర్కొన్నారు. -
మన చేతిలోనే మన ఆరోగ్యం
మహబూబాబాద్ : మన ఆరోగ్యం మన చేతిలో ఉందని ప్రముఖ ఆరోగ్య సలహాదారుడు వీరమాచినేని రామకృష్ణారావు అన్నారు. స్థానిక గాంధీపార్క్‌లో ఆదివారం రాత్రి ‘మీ ఆరోగ్యం మీ చేతిలోనే..’ అనే అంశంపై ఉచిత అవగాహన సదస్సు జరిగింది. ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దన్నారు. ఆరోగ్య జాగ్రత్తల గురించి తెలిసినా నిర్లక్ష్యం చేయడం వల్ల సమస్యలు తలెత్తుతాయని అన్నారు. ఆహార పదార్థాల్లో ఉన్న పోషకాలు, విటమిన్లపై అవగాహన పెంచుకోవాలని చెప్పారు. విటమిన్ డీ కలిగిన బలవర్ధకమైన ఆహారం గుడ్డు తినాలన్నారు. ఎమ్మెల్యే భానోత్ శంకర్‌నాయక్ మాట్లాడుతూ కోట్లాది రూపాయల ఆస్తుల కన్నా ఆరోగ్యం మిన్నా అన్నారు. కార్యక్రమంలో ఘనపురపు అంజయ్య, పి.పర్కాల శ్రీనివాస్‌రెడ్డి, డాక్టర్ డోలి సత్యనారాయణ, రామసాయం వెంకట్‌రెడ్డి, పిల్లి సతీష్, పిల్లి సుధాకర్, వద్దుల సరేందర్రెడ్డి, ప్రభాకర్‌రావు, బోడ్డుపెల్లి ఉపేందర్, వడ్డెబోయిన శ్రీనివాస్, కేదాస్ వాసుదేవ్ పాల్గొన్నారు. -
సర్కారీ హత్యలే : బీవీ రాఘవులు ఆగ్రహం
హైదరాబాద్, న్యూస్‌లైన్: అత్యవసర సేవల విభాగమైన 108 సిబ్బంది సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం ప్రతిరోజూ హత్యలు చేస్తోందని, వైద్యసేవలు అందక ప్రజలు చనిపోతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారం కోసం 108 సర్వీసెస్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో 20 రోజు లుగా చేస్తున్న సమ్మెలో భాగంగా మంగళవారం చలో హైదరాబాద్ చేపట్టారు. బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య పార్కు నుంచి ఇందిరా పార్కు వరకూ 108 ఉద్యోగులు భారీ ప్రదర్శన జరిపారు. అనంతరం ధర్నాచౌక్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రాఘవులు ప్రసంగించారు. ప్రభుత్వ సొమ్ముతో 108ను నిర్వహిస్తుండగా సోకు మాత్రం జీవీకే యాజమాన్యానికి దక్కుతోందన్నారు. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్న జీవీకే యాజమాన్యంపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు కనీసం రూ.15 వేలు కూడా వేతనం లేకపోవటం అన్యాయమన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ, ఎంసీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి నాగభూషణం, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబా, ఉపాధ్యక్షులు నర్సింహారెడ్డి, కార్యదర్శులు పాలడుగు భాస్కర్, రాములు, భూపాల్, ఏవీ నాగేశ్వరరావు, 108 ఎంపాయీస్ నాయకులు అప్పిరెడ్డి, సూర్యనారాయణ, బలరాం, శ్రీనివాస్‌రెడ్డి, రమేష్, శంకర్ రెడ్డి, వీరస్వామి, కిరణ్, శివ పాల్గొన్నారు. 108 ఉద్యోగుల భారీ ర్యాలీ: ధర్నా సందర్భంగా 108 సిబ్బంది సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి వీఎస్టీ, ఆర్టీసీ క్రాస్ రోడ్ మీదుగా ఇందిరా పార్కు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ఉద్యోగులు ఇందులో పాల్గొన్నారు. ర్యాలీలో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సాయిబాబు మాట్లాడుతూ 108 యాజమాన్యం 256 మందిని అకారణంగా డిస్మిస్ చేయటంతో పాటు 108 మందిని జైలుకు పంపిందన్నారు.