హైదరాబాద్, న్యూస్‌లైన్: అత్యవసర సేవల విభాగమైన 108 సిబ్బంది సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం ప్రతిరోజూ హత్యలు చేస్తోందని, వైద్యసేవలు అందక ప్రజలు చనిపోతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారం కోసం 108 సర్వీసెస్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో 20 రోజు లుగా చేస్తున్న సమ్మెలో భాగంగా మంగళవారం చలో హైదరాబాద్ చేపట్టారు. బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య పార్కు నుంచి ఇందిరా పార్కు వరకూ 108 ఉద్యోగులు భారీ ప్రదర్శన జరిపారు. అనంతరం ధర్నాచౌక్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రాఘవులు ప్రసంగించారు.
ప్రభుత్వ సొమ్ముతో 108ను నిర్వహిస్తుండగా సోకు మాత్రం జీవీకే యాజమాన్యానికి దక్కుతోందన్నారు. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్న జీవీకే యాజమాన్యంపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు కనీసం రూ.15 వేలు కూడా వేతనం లేకపోవటం అన్యాయమన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ, ఎంసీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి నాగభూషణం, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబా, ఉపాధ్యక్షులు నర్సింహారెడ్డి, కార్యదర్శులు పాలడుగు భాస్కర్, రాములు, భూపాల్, ఏవీ నాగేశ్వరరావు, 108 ఎంపాయీస్ నాయకులు అప్పిరెడ్డి, సూర్యనారాయణ, బలరాం, శ్రీనివాస్‌రెడ్డి, రమేష్, శంకర్ రెడ్డి, వీరస్వామి, కిరణ్, శివ పాల్గొన్నారు.
108 ఉద్యోగుల భారీ ర్యాలీ: ధర్నా సందర్భంగా 108 సిబ్బంది సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి వీఎస్టీ, ఆర్టీసీ క్రాస్ రోడ్ మీదుగా ఇందిరా పార్కు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ఉద్యోగులు ఇందులో పాల్గొన్నారు. ర్యాలీలో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సాయిబాబు మాట్లాడుతూ 108 యాజమాన్యం 256 మందిని అకారణంగా డిస్మిస్ చేయటంతో పాటు 108 మందిని జైలుకు పంపిందన్నారు.
సర్కారీ హత్యలే : బీవీ రాఘవులు ఆగ్రహం
Published Wed, Aug 7 2013 5:49 AM | Last Updated on Fri, Sep 1 2017 9:42 PM
Advertisement