సాక్షి రాయచోటి: పల్లె ముంగిట ఆధునిక వైద్యం అడుగు పెడుతోంది. ఎక్కడికో వెళ్లాల్సిన పని లేకుండా...అక్కడికక్కడే ఎప్పటికప్పుడు వైద్య సేవలు పొందేలా విప్లవాత్మక మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వ్యాధి ఏదైనా వైద్యం పల్లె ముంగిట లభించేలా ప్రణాళిక రూపొందించింది. పట్టణ తరహాలో పల్లెల్లోనే పరీక్షలు మొదలు ప్రతి వ్యాధికి వైద్య సేవలు అందించడానికి ముందుకు కదులుతోంది.
గ్రామీణులు వైద్య చికిత్సలకు ఊరు దాటి వెళ్లకుండా.. ఉన్న ఊరిలోనే చికిత్స అందిచేందుకు వేగవంతంగా చర్యలు చేపడుతోంది. గ్రామాల్లోని వైద్య రంగంలో పెనుమార్పులు చోటు చేసుకోనున్నాయి. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా వైద్య, ఆరోగ్య రంగానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. చిన్న చిన్న జబ్బులకు గ్రామాల్లోని ప్రజలు మండల కేంద్రాలకు వెళ్లాల్సిన పరిస్థితుల నుంచి అక్కడికక్కడే వైద్యం అందుకునేలా ఆరోగ్య భరోసా కల్పిస్తోంది.
8 శరవేగంగా పనులు
అన్నమయ్య జిల్లాలో రూ.52.85 కోట్ల అంచనాతో 302 వైఎస్సార్ గ్రామీణ హెల్త్ క్లినిక్‌ల భవన నిర్మాణాలు వేగంగా కొనసాగుతున్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా భవన నిర్మాణాలను పూర్తి చేయడానికి జిల్లా కలెక్టర్ చర్యలు చేపడుతున్నారు. భవనాలు పూర్తయిన వెంటనే పూర్తిస్థాయిలో వైద్య చికిత్స పరికరాలు ఏర్పాటు చేస్తారు.
అందుకు సంబంధించి భవన నిర్మాణంలో భాగంగా 46 పునాది కింద స్థాయి, 39పునాది స్థాయి, రూప్ లెవెల్ 28, రూప్‌లైడ్ 45, సెకండ్ శ్లాబ్‌లైడ్ 14, ఫినిషింగ్ దశలో 51, బిల్డింగ్‌లు పూర్తయినవి 41 ఉన్నాయి. ఇప్పటివరకు బిల్లులు, ఇతరత్రా ఖర్చుల కింద రూ. 20 కోట్లు వెచ్చించారు. మిగిలిన పనులు కూడా పూర్తి చేయడానికి అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. దీంతో గ్రామీణ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
8 టీకాలు ఇక్కడే
గర్భిణీలు, చిన్నారుల సంరక్షణ, నవజాత శిశువులకు, ఏడాదిలోపు వయస్సున్న శిశువులకు ఆరోగ్య సంరక్షణ చర్యలు తీసుకుంటారు. అన్ని రకాల వ్యాక్సిన్లు ఉంటాయి. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు ఇక్కడే టీకాలు వేయించుకునే అవకాశం ఉంటుంది. సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకునేలా ప్రజలకు వివరిస్తారు.
తరుచూ వచ్చే చిన్న, చిన్న సమస్యలు, ఈఎన్‌టీ సమస్యలపై అవగాహన కల్పిస్తారు. వయస్సు పైబడినప్పుడు వచ్చే సమస్యల నివారణతోపాటు అత్యవసర మెడికల్ సర్వీసెస్‌లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవగాహన కల్పిస్తారు. మానసిక వ్యాధులను ముందే గుర్తించి నియంత్రించే చర్యలను చేపడతారు.
8 14 రకాల ప్రాథమిక పరీక్షలు
హిమోగ్లోబిన్, గర్భవతులకు యూరిన్ పరీక్ష, ఇతర యూరిన్ టెస్టులు, బీపీ, షుగర్, మలేరియా, హెచ్‌ఐవీ, డెంగీ, కంటి పరీక్షలు, అయోడిన్ సాల్ట్ పరీక్షలు, హెపటైటీస్ బి, పైలేరియా, ర్యాపిడ్ టెస్ట్, కఫం పరీక్షలు ఈ క్లినిక్‌లలో చేస్తారు.
8 అత్యుత్తమ వైద్యానికి భరోసా
ప్రభుత్వం గ్రామీణ ప్రజలకు వారి సొంతూరులోనే ప్రాథమిక వైద్య చికిత్సలు, వైద్య పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొస్తోంది. ప్రతి 2500 జనాభాకు ఒక వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ అందుబాటులో ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. తద్వారా చిన్న, చిన్న జబ్బులకు కూడా 10 కి.మీ దూరంలో ఉండే పీహెచ్‌సీకి వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఈ క్లినిక్‌లో 12రకాల వైద్య సేవలు అందించడంతోపాటు 14రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అందుకు సంబంధించి 75 నుంచి 90 రకాల మందులతోపాటు 67రకాల బేసిక్ మెడికల్ ఎక్విప్‌మెంట్‌ను అందుబాటులో ఉంచుతారు.
వైద్య రంగంలో పెనుమార్పులు
ప్రజల వైద్యానికి ప్రభు త్వం భరోసా కల్పిస్తోంది. విలేజ్ హెల్త్ క్లినిక్ ద్వారా ప్రజలను అప్రమత్తం చేయ డం మొదలుకొని చిన్నపాటి వ్యాధులనుంచి ఇతర అనారోగ్య సమస్య వరకు పరీక్షలు అక్కడే నిర్వహించనున్నారు. అవసరమైన అన్ని రకాల మందులు కూడా క్లినిక్‌లో లభిస్తాయి. దీంతో గ్రామాల్లో వైద్య రంగంలో పెను మార్పులు చోటు చేసుకోనున్నాయి.
అన్నమయ్య జిల్లాలో రూ.52.85 కోట్ల అంచనాతో 302 వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాల నిర్మాణాలు వేగంగా కొనసాగుతున్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా భవన నిర్మాణాలను పూర్తి చేయడానికి పర్యవేక్షణ చేస్తున్నాం.
– గిరీషా పీఎస్, జిల్లా కలెక్టర్, అన్నమయ్య జిల్లా
Comments
Please login to add a commentAdd a comment