పారదర్శకత కోసమే 'సీఎఫ్ఎంఎస్'
రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ శాఖల్లో పారదర్శకతను పెంపొందించే లక్ష్యంతో త్వరలో సమగ్ర ఆర్థిక నిర్వహణ విధానాన్ని (సీఎఫ్ఎంఎస్) అన్ని స్థాయిల్లో అమలు చేస్తున్నట్టు రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి హేమ మునివెంకటప్ప తెలిపారు. ఆరు జిల్లాలకు చెందిన ట్రెజరీ అధికారులు, సిబ్బందికి నూతన ఆర్థిక నిర్వహణ విధానంపై శిక్షణ, అవగాహన కార్యక్రమాన్ని సోమవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అన్ని శాఖలకు కేటాయించే నిధులను పూర్తి పారదర్శకతతో ఖర్చు చేయడానికి 'సీఎఫ్ఎంఎస్'ను అమలు చేయనున్నట్టు తెలిపారు. దీనికి ఆధార్ నంబర్‌ను అనుసంధానం చేసే యోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు.
దీనివల్ల వివిధ శాఖలకు జరిపే చెల్లింపులు, పనితీరు ఆధారంగా నిధులు విడుదల చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. ఈ విధానంలో జరిపే చెల్లింపులు నూరుశాతం సంబంధిత వ్యక్తి ఖాతాకే జమ కావడం ద్వారా అవినీతికి తావుండదని ఆమె తెలిపారు. జిల్లాల్లో డ్రాయింగ్ అధికారులు, వారి సిబ్బంది తమ పూర్తి వివరాలను వెబ్సైట్లో నమోదు చేయాలని చెప్పారు. కృష్ణా జిల్లా కలెక్టర్ ఎ.బాబు మాట్లాడుతూ ఈ విధానం వల్ల ప్రభుత్వానికి ఆదాయ వనరులు మిగలడంతో పాటుగా పనిలో వేగం పెరిగి తక్షణ చెల్లింపులు జరుగుతాయన్నారు.