ఈక్విటీగా డీసీ రుణం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అప్పుల ఊబిలో కూరుకుపోయిన డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ (డీసీహెచ్ఎల్) వాటిని తీర్చడానికి ఈక్విటీ మార్గాన్ని ఎంచుకుంది. శ్రేయి ఇన్ఫ్రా నుంచి తీసుకున్న రుణాన్ని ఈక్విటీగా మార్చే ప్రక్రియను చర్చించడానికి ముగ్గురు డెరైక్టర్లతో కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్లు డీసీహెచ్ఎల్ బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్కి తెలియచేసింది. శుక్రవారం సమావేశమైన బోర్డ్ ఆఫ్ డెరైక్టర్ల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ప్రిఫరెన్షియల్ ఇష్యూ కింద శ్రేయి ఇన్‌ఫ్రాకి షేర్లను కేటాయిస్తామని, కానీ దీనికి సంబంధించిన ఒప్పందాలు, తుది అనుమతులు లభించాల్సి ఉందని పేర్కొంది. కానీ తీసుకున్న రుణం విలువను మాత్రం డీసీహెచ్ఎల్ తెలియచేయలేదు. శ్రేయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ రూ.220 కోట్లు స్వల్ప కాలిక రుణం ఇచ్చినట్లు గతంలో తెలిపారు.
రుణాన్ని ఈక్విటీగా మార్చమని శ్రేయి ఇన్ఫ్రా నుంచి వచ్చిన ప్రతిపాదనను బోర్డు పరిగణనలోకి తీసుకొని ముగ్గురు డెరైక్టర్లతో కమిటీని ఏర్పాటు చేసినట్లు డీసీహెచ్ఎల్ తెలిపింది. డిసెంబర్, 2013 నాటికి డీసీహెచ్ఎల్లో ప్రమోటర్ల వాటా 32.66 శాతంగా ఉండగా, డీఐఐల వాటా స్వల్పంగా తగ్గి 8.17 శాతంగా ఉంది. ఇదే సమయంలో ఇతర షేర్‌హోల్డర్ల వాటా స్వల్పంగా పెరిగి 59.10 శాతానికి చేరింది. ఆడిట్ కమిటీ సిఫార్సుల మేరకు జాయింట్ ఆడిటర్‌ను నిమమించాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. ఆడిటర్ ఎంపిక బాధ్యతను ముగ్గురు డెరైక్టర్ల కమిటీకి అప్పజెప్పింది. ఇందుకోసం దేశంలోని ఆరు ప్రధాన ఆడిటింగ్ సంస్థలను పరిశీలిస్తున్నామని, త్వరలోనే ఒక సంస్థను ఎంపిక చేయనున్నట్లు డీసీహెచ్ఎల్ తెలిపింది. ఈ వార్తల నేపథ్యంలో బీఎస్ఈలో డెక్కన్ క్రానికల్ హోల్డింగ్ షేరు భారీ ట్రేడింగ్ పరిమాణంతో 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకి రూ.3.74 వద్ద ముగిసింది.