భారీగా తగ్గిన హార్లే డేవిడ్సన్ ధరలు
సాక్షి, న్యూఢిల్లీ : అమెరికన్ బైకు తయారీదారు హార్లే డేవిడ్సన్ తన బైకు ధరలను భారీగా తగ్గించింది. 2017 ఎడిషన్‌కు చెందిన ఫ్యాట్ బాయ్, హెరిటేజ్ సాఫ్టైల్ క్లాసిక్ మోడల్ ధరలను రూ.2.5 లక్షల వరకు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. స్టాక్‌ను క్లియర్ చేసుకోవడం కోసం హార్లే డేవిడ్సన్ వీటిపై భారీగా ధరలను తగ్గించింది. ఫ్యాట్ బాయ్ ధర రూ.2,01,010మేర చౌకగా మారి, 14,99,990 రూపాయలకు దిగొచ్చింది. ఈ బైకు అసలు ధర 17,01,000 రూపాయలు.
అదేవిధంగా హెరిటేజ్ సాఫ్టైల్ క్లాసిక్ మోడల్ కూడా 18,50,000 రూపాయల నుంచి 15,99,990 రూపాయలకు తగ్గినట్టు తెలిసింది. అంటే ఎక్స్‌షోరూం ఢిల్లీలో దీని ధర రూ.2,50,010 తగ్గింది. ఈ సమీక్షించిన ధరలు 2017 మోడల్ కలిగి ఉన్న వాటికి వర్తిస్తాయని, 2017 సెప్టెంబర్ 1 నుంచి ఇవి అమల్లోకి వస్తున్నాయని హార్లే డేవిడ్సన్ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది. నెలవారీ పేమెంట్లను తగ్గిస్తూ కూడా కంపెనీ ఫైనాన్స్ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది.