పాపారాయుడు..పెద్దరాయుడు..ఆండ్రాయుడు..
రాంగోపాల్‌పేట్ (హైదరాబాద్) : 'హృదయ కాలేయం' సినిమా హీరో సంపూర్ణేష్ బాబు తన తదుపరి చిత్రం 'కొబ్బరిమట్ట' విశేషాలను విలేకరులతో పంచుకున్నారు. కొబ్బరిమట్టలో త్రిపాత్రాభినయం చేస్తున్నానని.. ఇందులో తాను పాపారాయుడు, పెద్ద రాయుడు, ఆండ్రాయుడు పాత్రలతో అలరించనున్నట్లు చెప్పారు. దసరా పండక్కి రాబోతున్న 'కొబ్బరిమట్ట' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరవుతానని సంపూర్ణేష్ బాబు అన్నారు. సికింద్రాబాద్ సోమసుందరం వీధిలోని కొత్త ఎల్లయ్య మెమోరియల్ హైస్కూల్లో శనివారం జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమానికి హాజరైన ఆయన కొద్దిసేపు విలేకరులతో మాట్లాడారు.
ఈ సినిమాలో ఏడుగురు హీరోయిన్లు ఉండటం ప్రత్యేకత అన్నారు. ఉమ్మడి కుటుంబంలో ఉండే బంధాలు, అనుబంధాలతో పాటు కామెడీ కూడా ప్రధానంగా కనిపిస్తుందని చెప్పారు. హృదయ కాలేయం, సింగం 123 చిత్రాలతో చాలా మంది అభిమానుల్ని సంపాదించుకున్నానని.. ఇప్పుడు ఈ చిత్రాన్ని ప్రేక్షకులు మరింత ఆదరిస్తారనే విశ్వాసాన్ని సంపూర్ణేష్ వ్యక్తం చేశారు. దసరా పండుగకు ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలిపారు. ఒకేసారి మూడు పాత్రల్లో కనిపించడం తనకు ఎంతో థ్రిల్లింగ్‌గా ఉందని ఈ సందర్భంగా సంపు అన్నారు.