hero showroom
-
మాజీ స్పీకర్ కోడెలపై కేసు నమోదు
సాక్షి, గుంటూరు: అసెంబ్లీ ఫర్నిచర్‌ను తన కార్యాలయాలు, ఇల్లు, కుమారుడి షోరూమ్‌లో ఉంచి వినియోగించుకుంటున్న మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై తుళ్లూరు పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. అసెంబ్లీ సెక్షన్ ఆఫీసర్ ఈశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోడెలపై ఐపీసీ 409 సెక్షన్ కింద, తనది కాని ప్రభుత్వ ఆస్తిని షోరూంలో ఉంచుకుని వినియోగిస్తున్న కోడెల శివరామ్‌పై ఐపీసీ 414 సెక్షన్ కింద కేసు నమోదైంది. అసెంబ్లీ ఫర్నిచర్‌ను కోడెల తన ఇంటికి మళ్లించిన వ్యవహారం బట్టబయలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో భద్రత లేక తన క్యాంపు కార్యాలయాల్లో ఆ ఫర్నిచర్‌ను భద్రపరిచానని కోడెల చెప్పడం, అది ఆయన కుమారుడు శివరామ్‌కు చెందిన షోరూంలో కూడా వినియోగిస్తున్న తరుణంలో శుక్రవారం అసెంబ్లీ అధికారులు తనిఖీలు చేపట్టారు. గుంటూరులోని గౌతమ్ హీరో షోరూమ్‌లో రూ.కోట్ల అసెంబ్లీ ఫర్నిచర్ ఉందని తనిఖీల్లో గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా అసెంబ్లీ ఫర్నిచర్‌ను ఉంచి, వినియోగిస్తున్న కోడెల, శివరామ్‌లపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. -
హీరో షోరూంలో భారీ చోరీ
ఆళ్లగడ్డ: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో భారీ చోరీ జరిగింది. హీరో షోరూంలో రాత్రివేళ దొంగలు చొరబడి షోరూంలోని లాకర్లో ఉన్న రూ.6.5 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. పైకప్పు రేకులను తొలగించి దొంగలు లోపలికి వెళ్లినట్టు గుర్తించారు. ఉదయం 11 గంటలకు షోరూంను తెరిచేందుకు వచ్చిన యాజమాన్యం చోరీని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
డబ్బులు కట్టించుకొని వాహనాలు ఇవ్వలేదు
చిత్తూరు: మెగా ఆఫర్ కింద ద్విచక్రవాహనాలు ఇవ్వడానికి డబ్బులు కట్టించుకొని ఒక్కరికీ వాహనం ఇవ్వలేదని పులవురు కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు నగరంలోని పలమనేరు రోడ్డులో గల హీరో షోరూమ్ వద్ద వందలాది కొనుగోలుదారులు షోరూమ్ సబ్బందితో శనివారం వాగ్వాదానికి దిగారు. భారత్ స్టేజ్-3 వాహనాలపై మార్చి 31న నగదు డిస్కౌంట్ ప్రకటించడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు నగదు చెల్లించి వాహనాలను బుక్ చేసుకున్నారు. అయితే నిర్వాహకులు మాత్రం వాహనాలు ఇవ్వడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.