హీరోయిన్ స్థలాన్ని కబ్జా చేసిన నయీం
హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీం భూ దందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. నయీం భూకబ్జా బాధితుల్లో ఓ ప్రముఖ హీరోయిన్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. నానక్ రాం గూడ ప్రాంతంలోని ఆమె ఆరు ఎకరాల స్థలాన్ని నయీం కబ్జా చేసి మరీ స్వాధీనపరచుకున్నట్లు సమాచారం. అలాగే రంగారెడ్డి జిల్లా చార్టెడ్ అకౌంటెంట్ హత్యకేసులోనూ నయీం పాత్ర ఉన్నట్టు అనుమానాలు వస్తున్నాయి. ఈ నయవంచక దందాలో నయీంకు కొంతమంది పోలీసులు సైతం సహకరించినట్లు వెలుగుచూడటం ప్రకంపనలు రేపుతోంది.
ఈ నేపథ్యంలో ఏపీలోని ఓ ఐపీఎస్ అధికారి పాత్రపై సిట్ దృష్టి పెట్టింది. కొత్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లోనూ తన దందాను విస్తరించేందుకు నయీం సిద్ధమైనట్లు సమాచారం. ఇందుకు సహకరించినందుకు పోలీసులకు రూ.5 కోట్లు అతడు చెల్లించినట్లు తెలుస్తోంది. తను చేసిన అక్రమాలన్నీ పూసగుచ్చినట్టు నయీం డైరీలో రాసుకున్న సంగతి తెలిసిందే. నయీం డైరీని విశ్లేషిస్తున్నకొద్దీ ఇలాంటి వాస్తవాలెన్నో వెలుగుచూస్తున్నాయని విశ్వసనీయవర్గాలు చెప్తున్నాయి.
వికారాబాద్‌లో నయీంకు చెందిన 15 ఎకరాలు ఫాంహౌస్‌ను తాజాగా సిట్ అధికారులు గుర్తించారు. అలాగే దుర్గామాత సొసైటీలో 60 ప్లాట్లు నయీం కబ్జా చేసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌కు చెందిన ఓ పోలీస్ అధికారికి శంషాబాద్‌లో భూమి ఉందని, ఆ పోలీస్ అధికారి ఈ లావాదేవీలను నయీం దగ్గరుండి నడిపించినట్లు సమాచారం. ఆ అధికారికి శంషాబాద్‌లో షాపింగ్ కాంప్లెక్స్‌తోపాటు 10 ఎకరాల్లో ఫంక్షన్ హాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
మెదక్ జిల్లాలో ఓ న్యాయవాది హత్య వెనుక నయీం హస్తమున్నట్లు సమాచారం. రెండెకరాల స్థల వివాదంలో అతడు ఈ దురాగతానికి పాల్పడ్డాడని, ఇందుకు అతనికి పోలీసులు సైతం మద్దతు తెలిపారని అంటున్నారు. తనకు సహకరించినందుకుగాను కొందరు పోలీసులకు నయీం మంచి పోస్టింగ్‌లు ఇప్పించినట్టు వినిపిస్తోంది. వీటన్నింటిపైనా సిట్ దృష్టిపెట్టింది. ఆరోపణలు ఉన్న పోలీసులు, రాజకీయ నాయకులపై దర్యాప్తును ఎలా ముందుకు తీసుకెళ్లాలి? మరిన్ని ఆధారాల సేకరణపై సిట్ శనివారం సమావేశమైంది.