HfS Research
-
2022 నాటికి 7 లక్షల ఐటీ ఉద్యోగాలు ఔట్!!
-
2022 నాటికి 7 లక్షల ఐటీ ఉద్యోగాలు ఔట్!!
♦ ఆటోమేషన్ ప్రభావం ఇది... ♦ అమెరికా సంస్థ హెచ్ఎఫ్ఎస్ రీసెర్చ్ బెంగళూరు: దేశీ ఐటీ రంగంలో ఆటోమేషన్ వల్ల 2022 నాటికి దాదాపు 7 లక్షల లో–స్కిల్డ్ ఉద్యోగాలు గల్లంతయ్యే ప్రమాదముంది. ఈ విషయాన్ని అమెరికాకు చెందిన రీసెర్చ్ సంస్థ ‘హెచ్ఎఫ్ఎస్ రీసెర్చ్’ ఒక నివేదికలో పేర్కొంది. మీడియం–స్కిల్డ్, హై–స్కిల్డ్ ఉద్యోగాలు మాత్రం వరుసగా లక్ష వరకు, 1.9 లక్షల వరకూ పెరగవచ్చని ఈ సంస్థ అంచనా వేసింది. అంతర్జాతీయంగా చూస్తే ఐటీ పరిశ్రమలో ఉద్యోగాలు నికరంగా 7.5 శాతం తగ్గొచ్చని పేర్కొంది. అమెరికా, యూకే, ఇండియా వంటి దేశాల్లో ఉద్యోగుల తొలగింపు ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఉద్యోగాల కోతకు రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వంటి అంశాలను ప్రధాన కారణంగా చూపింది. ఇక ఫిలిప్పీన్స్‌లో ఐటీ ఉద్యోగాలు స్వల్పంగా పెరిగే అవకాశముందని తెలిపింది. కాగా ప్రస్తుత నేపథ్యంలో మొత్తం సిబ్బందిలో 20 శాతం మందికి కొత్త నైపుణ్యాలు అవసరమని, అప్పుడే వారు ఉద్యోగాల్లో కొనసాగగలరని అభిప్రాయపడింది. -
ఈ ఐటీ జాబ్స్ త్వరలో కనుమరుగు
ఆటోమేషన్ దెబ్బ ఐటీ ఇండస్ట్రీకి భారీగానే తగలబోతుంది. ఆటోమేషన్ ముప్పు, కొత్త డిజిటల్ టెక్నాలజీలోకి మరలే క్రమంలో ఇప్పటికే చాలా ఐటీ సంస్థలు తమ ఉద్యోగుల సంఖ్యను భారీగా తగ్గించుకుంటూ పోతున్నాయి. అంతేకాక కొత్త నియామకాల జోరునూ తగ్గించి, ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. అమెరికాకు చెందిన బిజినెస్ అడ్వయిజరీ సంస్థ హెచ్ఎఫ్ఎస్ రీసెర్చ్ అంచనాల ప్రకారం ఆటోమేషన్ ప్రభావంతో దేశీయ ఐటీ వర్క్‌ఫోర్స్ 14 శాతం తగ్గిపోనుందని తెలిపింది. అంటే 2021 వరకు నలభై లక్షల మంది ఉద్యోగులు ప్రమాదంలో పడబోతున్నారట. అదేవిధంగా బీపీఓ రంగంలోని సంప్రదాయబద్ధమైన హ్యుమన్ రోల్స్, అన్ని ఐటీ ఉద్యోగాలకు సమానం ఉండవని, ఆటోమేషన్ ప్రభావంతో ఇతర రంగాలతో పోలిస్తే సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఎక్కువ ప్రభావితం కానుందని రీసెర్చ్ రిపోర్టులు పేర్కొంటున్నాయి. అంతేకాక కొన్ని ఐటీ ఉద్యోగాలు ఇక మనకు కనిపించకుండా కూడా పోతాయని తెలుస్తోంది. ఆన్లైన్ ప్రొఫిషనల్ ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫామ్ సింప్లిలెర్న్ రీసెర్చ్ రిపోర్టు ప్రకారం వచ్చే ఐదేళ్లలో కొన్ని ఉద్యోగాలు భారీగా పడిపోతున్నాయట. అవి ఏమిటో ఓసారి చూద్దాం.. మాన్యువల్ టెస్టింగ్: దీనిలో సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్, క్యూఏ ఇంజనీర్, మాన్యువల్ టెస్టర్ ప్రభావితం కానున్నాయి. ఇన్‌ఫ్రాక్ట్ర్చర్ మేనేజ్మెంట్ : సిస్టమ్ ఇంజనీర్, ఐటీ ఆపరేషన్స్ మేనేజర్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ బీపీఓ : డేటా ఎంట్రీ ఆపరేటర్, కస్టమర్ సర్వీసు ఎగ్జిక్యూటివ్, టెక్నికల్ సపోర్టు సిస్టమ్ మైంటెనెన్స్ : సర్వర్ మైంటెనెన్స్, మైంటెనెన్స్ ఇంజనీర్ -
ఐటీలో 6.4లక్షల ఉద్యోగాలు హాంఫట్...?
ముంబై : ఇప్పటికే ఐటీ పరిశ్రమలో ఉద్యోగాలు లేక సతమతమవుతున్న నిరుద్యోగులకు మరో బ్యాడ్ న్యూస్. వచ్చే ఐదేళ్లలో భారత్ లో ఆటోమేషన్ వల్ల 6.4 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందని రీసెర్చ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి.. తక్కువ నైపుణ్యమున్న ఉద్యోగులకు ఐటీ పరిశ్రమ ఉద్వాసన పలుకనుందని హెచ్ఎఫ్ఎస్ రీసెర్చ్ సంస్థ వెల్లడిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఐటీ ఇండస్ట్రీలో 2021 కల్లా నికర తగ్గుదల 9 శాతం లేదా 14 లక్షల ఉద్యోగాలు ఉండొచ్చని హెచ్ఎఫ్ఎస్ సంస్థ తెలుపుతోంది. ఫిలిప్పీన్స్, యూకే, అమెరికాలో ఈ ఉద్యోగాల కోత అధికంగా ఉంటుందని పేర్కొంది. అయితే ఐటీ ఇండస్ట్రి బాడీ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాప్ట్ వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్(నాస్కామ్) ఈ రిపోర్టును కొట్టిపారేస్తోంది. కొత్త టెక్నాలజీస్ సృష్టించే ఉద్యోగాలన్నింటిన్నీ ఈ సంస్థ పరిగణలోకి తీసుకోలేదని పేర్కొంటోంది. ఆటోమేషన్, రోబోటిక్స్ టెక్నాలజీ సంస్థలను లీడ్ చేస్తాయని భావించడం లేదని, కొంత మాత్రమే ఆటోమేషన్ ప్రభావం ఉంటుందని చెబుతోంది. టెక్నాలజీ అనుసరణ ఐటీ రంగంలో ఎక్కువ ఉద్యోగాలను సృష్టిస్తుందని తాము విశ్వసిస్తున్నట్టు నాస్కామ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సంగీత గుప్తా తెలిపారు. అయితే ఇన్ని ఉద్యోగాలు కోల్పోతాయి అనడం సరియైనది కాదని నాస్కామ్ వెల్లడించింది. మిగతా ప్రాంతాల్లో ఉద్యోగాలు కల్గిఉంటాయని పేర్కొంది. హెచ్ఎఫ్ఎస్ రిపోర్టు ప్రకారం.. తక్కువ నైపుణ్యమున్న ఉద్యోగాలు 30 శాతం తగ్గిపోతే.. మధ్యస్త నైపుణ్యమున్న ఉద్యోగాలు 8శాతం, ఎక్కువ నైపుణ్యమున్న ఉద్యోగాలు 56 శాతం పెరుగుతాయని తెలిపింది. 1477 ఇండస్ట్రి స్టాక్ హోల్డర్స్ తో హెచ్ఎఫ్ఎస్ ఈ సర్వే నిర్వహించింది. ఆటోమేషన్, ఉద్యోగాల పడిపోవడానికి ఎక్కువ దోహదం చేస్తుందని ఐటీ ఇండస్ట్రి ఎగ్జిక్యూటివ్ లు నమ్ముతున్నట్టు ఈ రీసెర్చ్ సంస్థ వెల్లడించింది. అయితే ఈ రిపోర్టుపై ఇండస్ట్రీలో భిన్న స్పందనలు వస్తున్నాయి. ఒకరు 6.4లక్షల జాబ్స్ కోల్పోవడం చాలా ఎక్కువని అంటుంటే.. మరొకరు వచ్చే రెండేళ్లలోనే బీపీఓ ఇండస్ట్రి రోబోటిక్స్ ప్రాసెస్ ఆటోమేషన్ సమస్యను ఫేస్ చేయబోతుందని పేర్కొంటున్నారు. అయితే టెక్ మహింద్రా గతేడాది ప్రారంభించిన ఆటోమేషన్ డ్రైవ్ వల్ల, గత త్రైమాసికంలో 2,000 ఉద్యోగాలను తగ్గించింది. అసెంచర్ సంస్థ తక్కువమంది ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంటుందని ఆ కంపెనీ సీఈవో, చైర్మన్ పియరీ నాన్ టెర్మి రెండు వారాల క్రితం జరిగిన ఫోస్ట్ ఎర్నింగ్ కాన్ఫరెన్స్ లో తెలిపారు.