ఐటీలో 6.4లక్షల ఉద్యోగాలు హాంఫట్...?
ముంబై : ఇప్పటికే ఐటీ పరిశ్రమలో ఉద్యోగాలు లేక సతమతమవుతున్న నిరుద్యోగులకు మరో బ్యాడ్ న్యూస్. వచ్చే ఐదేళ్లలో భారత్ లో ఆటోమేషన్ వల్ల 6.4 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందని రీసెర్చ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి.. తక్కువ నైపుణ్యమున్న ఉద్యోగులకు ఐటీ పరిశ్రమ ఉద్వాసన పలుకనుందని హెచ్ఎఫ్ఎస్ రీసెర్చ్ సంస్థ వెల్లడిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఐటీ ఇండస్ట్రీలో 2021 కల్లా నికర తగ్గుదల 9 శాతం లేదా 14 లక్షల ఉద్యోగాలు ఉండొచ్చని హెచ్ఎఫ్ఎస్ సంస్థ తెలుపుతోంది. ఫిలిప్పీన్స్, యూకే, అమెరికాలో ఈ ఉద్యోగాల కోత అధికంగా ఉంటుందని పేర్కొంది.
అయితే ఐటీ ఇండస్ట్రి బాడీ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాప్ట్ వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్(నాస్కామ్) ఈ రిపోర్టును కొట్టిపారేస్తోంది. కొత్త టెక్నాలజీస్ సృష్టించే ఉద్యోగాలన్నింటిన్నీ ఈ సంస్థ పరిగణలోకి తీసుకోలేదని పేర్కొంటోంది.
ఆటోమేషన్, రోబోటిక్స్ టెక్నాలజీ సంస్థలను లీడ్ చేస్తాయని భావించడం లేదని, కొంత మాత్రమే ఆటోమేషన్ ప్రభావం ఉంటుందని చెబుతోంది. టెక్నాలజీ అనుసరణ ఐటీ రంగంలో ఎక్కువ ఉద్యోగాలను సృష్టిస్తుందని తాము విశ్వసిస్తున్నట్టు నాస్కామ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సంగీత గుప్తా తెలిపారు. అయితే ఇన్ని ఉద్యోగాలు కోల్పోతాయి అనడం సరియైనది కాదని నాస్కామ్ వెల్లడించింది. మిగతా ప్రాంతాల్లో ఉద్యోగాలు కల్గిఉంటాయని పేర్కొంది. హెచ్ఎఫ్ఎస్ రిపోర్టు ప్రకారం.. తక్కువ నైపుణ్యమున్న ఉద్యోగాలు 30 శాతం తగ్గిపోతే.. మధ్యస్త నైపుణ్యమున్న ఉద్యోగాలు 8శాతం, ఎక్కువ నైపుణ్యమున్న ఉద్యోగాలు 56 శాతం పెరుగుతాయని తెలిపింది.
1477 ఇండస్ట్రి స్టాక్ హోల్డర్స్ తో హెచ్ఎఫ్ఎస్ ఈ సర్వే నిర్వహించింది. ఆటోమేషన్, ఉద్యోగాల పడిపోవడానికి ఎక్కువ దోహదం చేస్తుందని ఐటీ ఇండస్ట్రి ఎగ్జిక్యూటివ్ లు నమ్ముతున్నట్టు ఈ రీసెర్చ్ సంస్థ వెల్లడించింది. అయితే ఈ రిపోర్టుపై ఇండస్ట్రీలో భిన్న స్పందనలు వస్తున్నాయి. ఒకరు 6.4లక్షల జాబ్స్ కోల్పోవడం చాలా ఎక్కువని అంటుంటే.. మరొకరు వచ్చే రెండేళ్లలోనే బీపీఓ ఇండస్ట్రి రోబోటిక్స్ ప్రాసెస్ ఆటోమేషన్ సమస్యను ఫేస్ చేయబోతుందని పేర్కొంటున్నారు. అయితే టెక్ మహింద్రా గతేడాది ప్రారంభించిన ఆటోమేషన్ డ్రైవ్ వల్ల, గత త్రైమాసికంలో 2,000 ఉద్యోగాలను తగ్గించింది. అసెంచర్ సంస్థ తక్కువమంది ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంటుందని ఆ కంపెనీ సీఈవో, చైర్మన్ పియరీ నాన్ టెర్మి రెండు వారాల క్రితం జరిగిన ఫోస్ట్ ఎర్నింగ్ కాన్ఫరెన్స్ లో తెలిపారు.