పోస్టుకార్డు.. ఈ-మెయిల్
కార్డు ముక్క: అప్పుడు అవసరం.. ఇప్పుడు జ్ఞాపకం
మన దేశానికి స్వాతంత్య్రం రాక మునుపు.. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో దూర ప్రాంతాల్లో ఉన్న బంధువులు, స్నేహితులకు ఏదైనా సమాచారం పంపాలంటే.. పోస్టుకార్డులే దిక్కు. తొలినాళ్లలో వీటిని ఏనుగులు.. గుర్రాలు.. ఒంటెలపై ఒక ప్రాంతం నుంచి మరో చోటికి బట్వాడా చేసేవారు. కాలక్రమంలో మార్పులకు అనుగుణంగా రైళ్లు.. బస్సులు.. విమానాల్లో కూడా వీటిని చేరవేస్తున్నారు. 1861 నాటికి దేశవ్యాప్తంగా 889 పోస్టాఫీసులు ఉండేవి. వీటి ద్వారా 4.3 కోట్ల ఉత్తరాలు.. 45 లక్షల వార్తా పత్రికలు బట్వాడా అయ్యేవి. స్వాతంత్య్రం వచ్చే నాటికి వీటి సంఖ్య 23,344కు చేరింది. అదే 2011 మార్చి 31 నాటికి దేశవ్యాప్తంగా 1,54,866 పోస్టాఫీసులు ఉంటే.. వాటిలో సుమారు 5,66,000 మంది విధులు నిర్వహిస్తున్నారు.
పోస్ట్.. అంటూ సైకిల్‌పై వచ్చి మన ఇంటి దగ్గర ఉత్తరాలు ఇచ్చివెళ్లే పోస్ట్‌మ్యాన్ మనకు ఇప్పటికీ కనిపిస్తూనే ఉంటారు. ఒకప్పుడు మంచి.. చెడు.. పెళ్లి.. పేరంటం.. చావు.. పుట్టుక.. ఇలా రకరకాల విషయాలు చేరేది ఈ ‘కార్డుముక్క’ ద్వారానే. సాధారణ సమాచారం పంపాలంటే పోస్టు కార్డులు.. కీలక సమాచారం కొంచెం భద్రంగా పంపాలంటే ఇన్‌ల్యాండ్ లెటర్లు ఉపయోగించే వారు. లేఖలను పంపాలంటే ఇన్‌ల్యాండ్ కవర్లు అందుబాటులో ఉండేవి. 1990 తర్వాత రిజిస్టర్ పోస్ట్.. ఎయిర్‌మెయిల్.. స్పీడ్ పోస్టు.. కొరియర్.. వంటివి అందుబాటులోకి వచ్చాయి. వీటి హవా కొన్నాళ్లు.. నడిచింది. ఇప్పుడంతా స్పీడ్ యుగం. కొత్త పుంతలు తొక్కుతున్న టెక్నాలజీ దూరాన్ని చెరిపేసింది. దీంతో ఉత్తరాలు క్రమంగా కనుమరుగైపోతున్నాయి. ఈమెయిల్స్ ద్వారా సమాచారాన్ని పంపడం తేలికైపోయింది. మనం ఏ క్షణం ఏంచేస్తున్నామో.. తక్షణం సుదూర ప్రాంతంలో ఉన్న స్నేహితులు, బంధువులకు ఈమెయిల్ ద్వారా క్షణాల్లో చేరవేయవచ్చు. అవసరమైతే వారితో నేరుగా చాట్ చేయవచ్చు. దీంతో పోస్టు కార్డు.. ఇన్‌ల్యాండ్ లెటర్లు.. పాత జ్ఞాపకంగా మిగిలిపోతున్నాయి.