మహిళా వాణిజ్యవేత్తలకు ప్రత్యేక రాయితీలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అభివృద్ధిపరంగా వచ్చే ఐదేళ్లలో మొదటి మూడు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ చోటు సంపాదిస్తుందన్న నమ్మకాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యక్తం చేశారు. 2018-19 నాటికి టాప్ 3లో చోటు సంపాదించడమే కాకుండా 2029 నాటికి మొదటి స్థానానికి చేరుకొనే విధంగా ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్లు తెలిపారు.
ముఖ్యమంత్రిగా పదవి చేపట్టి మంగళవారానికి 100 రోజులు పూర్తవుతోందని, ఈ సమయంలో సమస్యల్లో ఉన్న రాష్ట్రాన్ని ఏవిధంగా ముందుకు తీసుకువెళ్ళాలి అన్నదానిపై ఒక విజన్‌ను సిద్ధం చేసుకున్నామని, దీన్ని రేపటి నుంచి అమల్లోకి తీసుకువస్తున్నామన్నారు. సోమవారం ఫిక్కీ మహిళా పారిశ్రామికవేత్తల సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కొత్త రాజధాని నిర్మాణంతో పాటు, మౌలిక వసతులు, మానవవనరులు, ఖనిజ నిక్షేపాల పరంగా రాష్ట్రంలో పెట్టుబడులకు అనేక అవకాశాలున్నాయని వీటిని వినియోగించుకోవాలని మహిళలకు పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చే మహిళలకు ప్రత్యేక రాయితీలను ఇవ్వడంతోపాటు అవసరమైతే వారి ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయడానికి కన్సల్టెన్సీ సేవలను కూడా అందిస్తామన్నారు. సమస్యలున్న చోటే అవకాశాలు అనేకం ఉంటాయని, రాజధాని కూడా లేని ఆంధ్రప్రదేశ్‌లో కూడా పరిస్థితులు అలాగే ఉన్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి ఇంటికీ సీఎన్జీ, పరిశ్రమలకు ఎల్‌ఎన్‌జీనీ పైప్‌లైన్ ద్వారా అందించడంతో పాటు, ప్రతి ఇంటికీ హై బ్యాండ్‌విడ్త్ ఇంటర్నెట్ కనెక్టివిటీ కల్పించేలా ముందుకుపోతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫిక్కీ యంగ్ లేడీస్ ఆర్గనైజేషన్ హైదరాబాద్ చాప్టర్ చైర్ పర్సన్ శంకుతల దేవితోపాటు పలువురు మహిళా పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.