విత్తు కొనలేక
అందుబాటు లేని సబ్సిడీ వేరుశనగ విత్తన కాయల ధరలు
కాయలతో పాటు జిప్సం కొనాలంటున్న అధికారులు
ప్రారంభంలోనే తడిసి మోపెడవుతున్న పెట్టుబడులు
వేరుశనగ విత్తన కాయలను రైతులు కొనలేకపోతున్నారు. రాయితీపై అందిస్తున్న కాయలకు ప్రభుత్వం అధిక ధర నిర్ణయించింది. మరోవైపు తప్పని సరిగా జిప్సం కొనుగోలు చేయాలని అధికారులు మరింత భారం మోపుతున్నారు. విత్తన విక్రయ కేంద్రాల వైపు వెళ్లేందుకు రైతులు ఆసక్తి చూపడం లేదు. ఆ కేంద్రాలన్నీ వెలవెలపోతున్నాయి. ప్రారంభంలోనే పెట్టుబడి తడిసి మోపెడవుతుండడంతో ఆశించిన మేర సాగుచేయలేమని రైతులు ఆందోళన చెందుతున్నారు.
చిత్తూరు (అగ్రికల్చర్): ప్రతి ఏటా జిల్లా రైతులు ఖరీఫ్ సీజనులో వర్షాధార పంటగా వేరుశనగ సాగుచేస్తారు. ఈ ఏడాది ముందస్తుగా తొలకరి వర్షం కురిసింది. 1.36 లక్షల హెక్టార్ల సాధారణ విస్తీర్ణం కాగా ఇప్పటికే 50 శాతం మంది రైతులు దుక్కులు సిద్ధం చేసుకుని సాగుకు సమాయత్తమవుతున్నారు. ప్రభుత్వం రాయితీపై అందించే విత్తన కాయల ధరలు అధికంగా ఉండడంతో అన్నదాతల్లో ఆసక్తి సన్నగిల్లుతోంది.
ధర అధికం.. జిప్సం తప్పనిసరి
ప్రయివేటు మార్కెట్లో కిలో వేరుశనగ విత్తన కాయలు రూ.52ల ధరతో అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వం కిలో కాయలకు రూ.50 చొప్పున ధర నిర్ణయించింది. ఆ లెక్కన 30 కిలోల బస్తా రూ.1,500కు అందిస్తోంది. వేరుశనగ విత్తన కాయలతో పాటు ప్రతి రైతు తప్పనిసరిగా రెండు క్వింటాళ్ల మేరకు జిప్సం కొనుగోలు చేయాలని మరో మెలిక పెట్టింది.
మోయలేని భారం ఎకరాకు రూ. 3,361లు వెచ్చించాలి. ఈ లెక్కన దుక్కులు దున్నడం నుంచి పంట చేతికందే వరకు ఎకరాకు కనీసం రూ.20 వేల వరకు పెట్టుబడి పెట్టాల్సివస్తోంది. ఒకవేళ ఆమేరకు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైనా ప్రకృతివైపరీత్యాలతో ఆశించిన మేరకు దిగుబడి వస్తుందని నమ్మకం లేదు. దీంతో ఆలోచనలో పడ్డ రైతులు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ వేరుశనగ కాయలను కొనుగోలు చేసేందుకు రైతులు ఆసక్తి చూపడం లేదు. కొనుగోలు కేంద్రాలు వెలవెలబోతున్నాయి.
వేరుశనగ సాగుచేయాలంటే రైతులు ఆరంభంలోనే అధిక పెట్టుబడులు పెట్టాల్సి వస్తోంది. ఎకరా సాగు చేయాలంటే రెండు బస్తాల విత్తనకాయలకు రూ.3 వేలు అవుతుంది.రెండు క్వింటాళ్ల జిప్సంకు రూ.336లు, విత్తనశుద్ధి మందుకు రూ.25లు వంతున ప్రారంభంలోనే ఎకరాకు రూ. 3,361లు వెచ్చించాలి. ఈ లెక్కన దుక్కులు దున్నడం నుంచి పంట చేతికందే వరకు ఎకరాకు కనీసం రూ.20 వేల వరకు పెట్టుబడి పెట్టాల్సివస్తోంది. ఒకవేళ ఆమేరకు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైనా ప్రకృతివైపరీత్యాలతో ఆశించిన మేరకు దిగుబడి వస్తుందని నమ్మకం లేదు. దీంతో ఆలోచనలో పడ్డ రైతులు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ వేరుశనగ కాయలను కొనుగోలు చేసేందుకు రైతులు ఆసక్తి చూపడం లేదు. కొనుగోలు కేంద్రాలు వెలవెలబోతున్నాయి.
ఈ ధర గిట్టుబాటు కాదు
ప్రభుత్వం ఇస్తున్న వేరుశనగ కాయల ధర ఎక్కుగా ఉంది. ఇదే ధరకు బయట మార్కెట్లో కూడా కాయలు దొరుకుతున్నాయి. ప్రభుత్వం అందించే సబ్సిడీ పేరుకు మాత్రమే. -కె.సుబ్రమణ్యం, రైతు, బలిజపల్లి, పెనుమూరు మండలం
జిప్సం బలవంతంగా ఇస్తున్నారు
జిప్సం కొంటేనే విత్తన కాయలను ఇస్తామని అధికారులు తేల్చి చెబుతున్నారు. దీంతో చేసేదిలేక అధిక భారమైనా కాయలతో పాటు జిప్సం కొన్నాను.
-మార్టిన్, కౌలు రైతు, వసంతాపురం, గుడిపాల మండలం