Higher officers
-
ఖా‘కీచకులు’! విచక్షణ మరిచి సహోద్యోగులనే వేధిస్తున్న అధికారులు
సాక్షి, సిటీబ్యూరో: అవినీతి ఆరోపణలు, సివిల్ వివాదాలు, అక్రమ సంబంధాలు, ఆదాయానికి మించిన ఆస్తులు, ప్రేమ పేరుతో మోసాలు, చివరకు బూటకపు ఎన్కౌంటర్లు... ఇలాంటి అనేక ఆరోపణలు పోలీసులపై వస్తుండేవి, వస్తున్నాయి. ఇలా ‘బయటి’ వారితో పాటు తమ సహోద్యోగులు, కింద పని చేస్తున్న వారినీ వివిధ రకాలుగా వేధిస్తున్న పోలీసు అధికారుల సంఖ్య పెరుగుతోంది. మొన్న లాలాగూడ ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాస్ రెడ్డి... నిన్న యాదగిరిగుట్ట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జి.నర్సయ్య... తాజాగా సంతోష్‌నగర్ టి.వంశీకృష్ణ రావు ఇలా ‘చేను మేస్తున్న కంచెల’ ఉదంతాలు వరుసగా వెలుగులోకి వచ్చి కలకలం సృష్టిస్తున్నాయి. మహిళా సిబ్బంది లేమితో ఇబ్బందులు... పోలీసు విభాగంలో పని చేస్తున్న వారన్నా, అందులో చేరాలన్నా సమాజంలో చాలా వరకు ఓ రకమైన వ్యతిరేక భావం ఉండేది. ఈ కారణంగానే ఏళ్లుగా డిపార్ట్మెంట్లో అడుగుపెట్టడానికి మహిళలు, యువతులు వెనుకడుగు వేస్తూ వచ్చారు. కారుణ్య నియామకాలతో పాటు ప్రత్యేక సందర్భాల్లోనే అతివల ఎంట్రీ ఉండేది. ఫలితంగా పోలీసు విభాగంలో మహిళా అధికారులు, సిబ్బంది ఆరేడు శాతానికే పరిమితమై ఉండేది. దీనివల్ల అటు పోలీసులతో పాటు ఇటు సాధారణ ప్రజలు, బాధితులు సైతం అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఠాణాలకు వచ్చే బాధితురాళ్లు, మహిళా నిరసనకారులను పర్యవేక్షించడానికి ఇబ్బందులు పడటమే కాకుండా అనేక వివాదాల్లోనూ పోలీసులు చిక్కుకున్నారు. ప్రభుత్వ చర్యలతో పరిస్థితుల్లో మార్పు... సుదీర్ఘ కాలంగా ఉన్న ఈ ఇబ్బందులపై రాష్ట్ర ఏర్పడిన తర్వాత ఉన్నతాధికారులు దృష్టిపెట్టారు. పోలీసు విభాగంలో మహిళల సంఖ్య పెంచడానికి అనేక ప్రతిపాదనల్ని రూపొందించి ప్రభుత్వానికి నివేదించారు. ఉన్న ఇబ్బందులు, సమకాలీన అవసరాలు, ప్రాధాన్యతలను గుర్తించిన సర్కారు వీటికి ఆమోదముద్ర వేసింది. పోలీసు విభాగంలో మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్ల సహా అనేక కీలక పరిణాలకు ఇవే నాంధిగా మారాయి. డిపార్ట్మెంట్లో 33 శాతం మహిళలు ఉండాలనే లక్ష్యంతో అటు ప్రభుత్వం, ఇటు అధికారులు ముందుకు వెళ్తూ అనేక చర్యలు తీసుకున్నారు. దీంతో గడిచిన కొన్నేళ్లుగా హోంగార్డు, కానిస్టేబుల్, ఎస్సై, డీఎస్పీ... ఇలా ప్రతి స్థాయిలో మహిళలు, యువతుల సంఖ్య పెరుగుతోంది. వరుస ఉదంతాలతో కుటుంబాల్లో గుబులు... ఈ సమున్నత ఆశయానికి విచక్షణ మరిచి కొందరు పోలీసులు చేస్తున్న చర్యలతో తూట్లు పడుతున్నాయి. తమతో కలిసి పని చేస్తున్న, తమ ఠాణాల్లో విధులు నిర్వర్తిస్తున్న, సహోద్యోగులైన మహిళా అధికారులు, సిబ్బందినీ వేధిస్తున్న కీచకులు అనేక మంది ఉంటున్నారు. ఇలా వరుసగా వెలుగులోకి వస్తున్న ఈ ఉదంతాలు భవిష్యత్తులో పోలీసు విభాగంలో అడుగుపెట్టాలని భావించే, ఆ లక్ష్యంతో కృషి చేస్తున్న యువతులు వెనుకడుగు వేసేలా చేస్తున్నాయి. కేవలం వీళ్లే కాదు... యువతుల కుటుంబాలూ అభద్రతా భావంలోకి వెళ్లి పోలీసు విభాగంలో అడుగుపెట్టకుండా తమ వారిని నిలువరించేలా చేసే ప్రమాదం లేకపోలేదు. అదే జరిగితే మళ్లీ పాత పరిస్థితులు పునరావృతమయ్యే అవకాశం ఉంది. కఠిన చర్యలతోనే సరైన ఫలితాలు... ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటేనే ఈ పరిస్థితుల్లో మార్పు వస్తుందన్నది. మాజీ పోలీసు ఉన్నతాధికారుల మాట. తొలుత బదిలీ, ఆపై సస్పెన్షన్, కొన్నాళ్లకు లూప్లైన్లో పోస్టింగ్... ఇలా చేస్తుండటంతో ఆశించిన స్థాయి మార్పు రావట్లేదని వాళ్లు స్పష్టం చేస్తున్నారు. మరోపక్క పోలీసులపై వచ్చే ఇలాంటి ఆరోపణలకు సంబంధించిన కేసులను దర్యాప్తు చేసేది, అంతర్గత విచారణ, ఓరల్ ఎంక్వైరీలు చేపట్టేది కూడా పోలీసులే కావడంతో పూర్తి న్యాయం జరగదని అభిప్రాయపడుతున్నారు. ఖా‘కీచకుల’పై విచారణకు ప్రత్యేకంగా స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న కమిటీలు ఏర్పాటు చేయాలని, ఆరోపణలు రుజువైతే ఉద్యోగం నుంచి తొలగింపు వంటి కఠిన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అయితే చర్యలు తీసుకోవడానికి ముందే ఆరోపణల్లో నిజానిజాలను పదేపదే సరిచూసుకోవాలని చెప్తున్నారు. ఇలా ముందుకు వెళ్తేనే సమాజంలోనే కాదు పోలీసు విభాగంలోనూ మహిళ భద్రంగా ఉంటుందని పేర్కొంటున్నారు. చదవండి: ఫ్యాన్.. ఏసీ ఆన్.. హీటెక్కుతున్న 'గ్రేటర్'.. భారీగా విద్యుత్ వినియోగం -
రెవెన్యూలో క్రమశిక్షణ కొరడా
సాక్షి, అమరావతి: రెవెన్యూ శాఖలో అక్రమార్కులపై గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉన్నతాధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. విచారణలో తప్పు చేసినట్లు తేలితే భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) కఠినమైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా 11 మంది తహసీల్దార్లపై ఈ తరహా చర్యలు తీసుకోవడం సంచలనం సృష్టించింది. ఇద్దరు తహసీల్దార్లను ఏకంగా సర్వీసు నుంచి తొలగించారు. ఐదుగురు తహసీల్దార్లకు డిప్యూటీ తహసీల్దార్లుగా రివర్షన్ ఇచ్చారు. మరొకరికి కంపల్సరీ రిటైర్మెంట్ ఇవ్వగా ఇంకో ముగ్గురికి ఇక్రిమెంట్లలో కోత విధించారు. భూముల వ్యవహారాల్లో అక్రమాలు చేస్తే.. తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండల తహసీల్దార్ సీహెచ్ శ్రీదేవికి నాలుగు రోజుల క్రితం డిప్యూటీ తహసీల్దార్‌గా రివర్షన్ ఇచ్చారు. 2017లో ఆమె పెద్దపంజాణి మండల తహసీల్దార్‌గా ఉన్నప్పుడు ముత్తుకూరు గ్రామంలో 350 ఎకరాల అటవీ శాఖ భూమిలో ప్రైవేటు వ్యక్తులకు పట్టాలిచ్చారు. అక్కడి నుంచి బదిలీ అయ్యి రిలీవైన తర్వాత రోజు వెబ్ ల్యాండ్‌లో ఈ మార్పులు చేయించినట్లు తేలింది. ఆమెకు సహకరించిన పెద్దపంజాణి వీఆర్వో డి.శ్రీనివాసులను సైతం పూర్తిగా విధుల నుంచి తొలగించారు. వైఎస్సార్ జిల్లా వీరపునాయునిపల్లె తహసీల్దార్ ఈశ్వరయ్య అక్రమాలకు పాల్పడినట్లు తేలడంతో సర్వీసు నుంచి తొలగించారు. 2017లో ఆయన అట్లూరు మండల తహసీల్దార్‌గా ఉన్నప్పుడు వందల ఎకరాల భూముల రికార్డులను తారుమారు చేసినట్లు రుజువైంది. ఒక వీఆర్వో భార్య పేరు మీద కోట్ల రూపాయల విలువైన భూముల్ని మార్చినట్లు విచారణలో తేలడంతో విదుల నుంచి శాశ్వతంగా తొలగించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ తహసీల్దార్ డి.చంద్రశేఖర్‌ను శాశ్వతంగా డిప్యూటీ తహసీల్దార్ పోస్టుకి రివర్షన్ చేశారు. అనంతపురం జిల్లా పుట్లూరు తహసీల్దార్ పి.విజయకుమారి, అదే జిల్లాకు చెందిన మరో తహసీల్దార్ పీవీ రమణకు రివర్షన్ ఇచ్చారు. ప్రకాశం జిల్లాకు చెందిన తహసీల్దార్ డీవీబీ వరకుమార్‌కు సీనియర్ అసిస్టెంట్‌గా రివర్షన్ ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన తహసీల్దార్లు టి.రామకృష్ణ, కె.శ్రీని వాసరావు, ఏలూరు జిల్లాకు చెందిన తహసీల్దార్ పి రాకడమణికి ఇంక్రిమెంట్లలో కోత పెట్టారు. చితూ ్తరు జిల్లాకు చెందిన మరో తహసీల్దార్ నరసింహులకు కంపల్సరీ రిటైర్మెంట్ ఇచ్చారు. ఇలాంటి వ్యవహారాల్లో ఒక డిప్యూటీ సర్వేయర్, మరో టైపిస్ట్పైనా చర్యలు తీసుకున్నారు. గతంలోలాగా కాకుండా.. గతంలో అక్రమాలు బయట పడితే సస్పెండ్ చేసి వదిలేసేవారు. దీంతో మళ్లీ పోస్టింగ్ తెచ్చుకుని ఏమీ జరగనట్లు పనిచేసేవారు. ఆ అక్రమాలపై తదుపరి విచారణ ఏళ్ల తరబడి కొనసాగేది. చివరికి వాటి నుంచి ఎలాగోలా బయటపడి క్లీన్చిట్ తెచ్చుకునేవాళ్లు. కానీ ఇప్పుడు అక్రమాలు నిజమని తేలితే ఊహించని విధంగా చర్య తీసుకుంటుండటంతో రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు వణికిపోతున్నారు. రివర్షన్ అనే పదం ఇప్పుడు రెవెన్యూ వర్గాల్లో గుబులు రేపుతోంది. పెండింగ్‌లో ఉన్న వి చారణలు త్వరితగతిన పూర్తి చేసేలా తమ శాఖ వి జిలెన్స్ విభాగాన్ని సీసీఎల్ఏ సాయిప్రసాద్ పరుగులు పెట్టిస్తున్నారు. తాము ఏం చేసినా చెల్లుతుందనే రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు తాజా ఘటనలతో అక్రమాలు అంటేనే ఉలిక్కిపడుతున్నారు. -
చిన్న పరిశ్రమలకు కొత్త పాలసీ
ఉన్నతాధికారులతో సమీక్షలో సీఎం చంద్రబాబు సాక్షి, హైదరాబాద్: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎస్ఎంఇ) పరిశ్రమలకు ప్రోత్సాహానికి ప్రాధాన్యమివ్వాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచించారు. నూతన పారిశ్రామిక విధాన రూపకల్పనలో భాగంగా మంగళవారం ఆయన సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. వచ్చే పదేళ్లలో ఎంఎస్ఎంఇ ద్వారా 2.7 లక్షల మంది ఉపాధి కల్పించేలా కొత్త విధానాన్ని రూపొందిస్తున్నట్టు పరిశ్రమల శాఖ అధికారులు సీఎంకు తెలిపారు. మహిళలు, ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు మరిన్ని ప్రోత్సాహకాలందేలా కొత్త విధానం ఉంటుందని వివరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, అవి ఎదుర్కొంటున్న సమస్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఉదార విధానమే ఉత్తమం: ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక విధానం ఉదారంగా, సరళీకృతంగా, పారిశ్రామికహితంగా ఉండాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. గతంలో పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేసిన పెద్ద కంపెనీలకు భూములిస్తే మరిన్ని కంపెనీలు రాష్ట్రానికి వచ్చే వీలుందన్నారు. నేడు విశాఖ, ఢిల్లీలలో చంద్రబాబు పర్యటన సాక్షి, హైదరాబాద్/ విశాఖపట్నం: సీఎం చంద్రబాబు బుధవారం విశాఖతోపాటు దేశ రాజధాని ఢిల్లీలో పర్యటించనున్నారు. ఉదయం విశాఖ చేరుకున్న అనంతరం రాష్ర్ట పారిశ్రామిక విధానాన్ని విడుదల చేస్తారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన పలువురు పారిశ్రామిక వేత్తలతో కలసి ఎంఓయూపై సంతకాలు చేస్తారు. తొలుత ఉత్తరాంధ్రలో హుద్‌హుద్ వల్ల దెబ్బతిన్న ఇళ్ల పునర్నిర్మాణ ప్రాజెక్టు నిర్మాణ కోసం ఉడా పార్కు వద్ద ఏర్పాటుచేసిన శంకుస్థాపన పైలాన్‌ను ఉదయం 9.40 గంటలకు ఆవిష్కరిస్తారు. అనంతరం ఢిల్లీ చేరుకుని అక్కడ ఇండో-జపాన్ ఎనర్జీ ఫోరం సమావేశంలో ప్రసంగిస్తారు. 30వ తేదీ ఉదయం నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో స్వచ్ఛ్భారత్పై జరిగే సమావేశంలో పాల్గొంటారు.