సాక్షి, సిటీబ్యూరో: అవినీతి ఆరోపణలు, సివిల్ వివాదాలు, అక్రమ సంబంధాలు, ఆదాయానికి మించిన ఆస్తులు, ప్రేమ పేరుతో మోసాలు, చివరకు బూటకపు ఎన్‌కౌంటర్లు... ఇలాంటి అనేక ఆరోపణలు పోలీసులపై వస్తుండేవి, వస్తున్నాయి. ఇలా ‘బయటి’ వారితో పాటు తమ సహోద్యోగులు, కింద పని చేస్తున్న వారినీ వివిధ రకాలుగా వేధిస్తున్న పోలీసు అధికారుల సంఖ్య పెరుగుతోంది. మొన్న లాలాగూడ ఇన్‌స్పెక్టర్ కె.శ్రీనివాస్ రెడ్డి... నిన్న యాదగిరిగుట్ట రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ జి.నర్సయ్య... తాజాగా సంతోష్‌నగర్ టి.వంశీకృష్ణ రావు ఇలా ‘చేను మేస్తున్న కంచెల’ ఉదంతాలు వరుసగా వెలుగులోకి వచ్చి కలకలం సృష్టిస్తున్నాయి.
మహిళా సిబ్బంది లేమితో ఇబ్బందులు...
పోలీసు విభాగంలో పని చేస్తున్న వారన్నా, అందులో చేరాలన్నా సమాజంలో చాలా వరకు ఓ రకమైన వ్యతిరేక భావం ఉండేది. ఈ కారణంగానే ఏళ్లుగా డిపార్ట్‌మెంట్‌లో అడుగుపెట్టడానికి మహిళలు, యువతులు వెనుకడుగు వేస్తూ వచ్చారు. కారుణ్య నియామకాలతో పాటు ప్రత్యేక సందర్భాల్లోనే అతివల ఎంట్రీ ఉండేది. ఫలితంగా పోలీసు విభాగంలో మహిళా అధికారులు, సిబ్బంది ఆరేడు శాతానికే పరిమితమై ఉండేది. దీనివల్ల అటు పోలీసులతో పాటు ఇటు సాధారణ ప్రజలు, బాధితులు సైతం అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఠాణాలకు వచ్చే బాధితురాళ్లు, మహిళా నిరసనకారులను పర్యవేక్షించడానికి ఇబ్బందులు పడటమే కాకుండా అనేక వివాదాల్లోనూ పోలీసులు చిక్కుకున్నారు.
ప్రభుత్వ చర్యలతో పరిస్థితుల్లో మార్పు...
సుదీర్ఘ కాలంగా ఉన్న ఈ ఇబ్బందులపై రాష్ట్ర ఏర్పడిన తర్వాత ఉన్నతాధికారులు దృష్టిపెట్టారు. పోలీసు విభాగంలో మహిళల సంఖ్య పెంచడానికి అనేక ప్రతిపాదనల్ని రూపొందించి ప్రభుత్వానికి నివేదించారు. ఉన్న ఇబ్బందులు, సమకాలీన అవసరాలు, ప్రాధాన్యతలను గుర్తించిన సర్కారు వీటికి ఆమోదముద్ర వేసింది. పోలీసు విభాగంలో మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్ల సహా అనేక కీలక పరిణాలకు ఇవే నాంధిగా మారాయి. డిపార్ట్‌మెంట్‌లో 33 శాతం మహిళలు ఉండాలనే లక్ష్యంతో అటు ప్రభుత్వం, ఇటు అధికారులు ముందుకు వెళ్తూ అనేక చర్యలు తీసుకున్నారు. దీంతో గడిచిన కొన్నేళ్లుగా హోంగార్డు, కానిస్టేబుల్, ఎస్సై, డీఎస్పీ... ఇలా ప్రతి స్థాయిలో మహిళలు, యువతుల సంఖ్య పెరుగుతోంది.
వరుస ఉదంతాలతో కుటుంబాల్లో గుబులు...
ఈ సమున్నత ఆశయానికి విచక్షణ మరిచి కొందరు పోలీసులు చేస్తున్న చర్యలతో తూట్లు పడుతున్నాయి. తమతో కలిసి పని చేస్తున్న, తమ ఠాణాల్లో విధులు నిర్వర్తిస్తున్న, సహోద్యోగులైన మహిళా అధికారులు, సిబ్బందినీ వేధిస్తున్న కీచకులు అనేక మంది ఉంటున్నారు. ఇలా వరుసగా వెలుగులోకి వస్తున్న ఈ ఉదంతాలు భవిష్యత్తులో పోలీసు విభాగంలో అడుగుపెట్టాలని భావించే, ఆ లక్ష్యంతో కృషి చేస్తున్న యువతులు వెనుకడుగు వేసేలా చేస్తున్నాయి. కేవలం వీళ్లే కాదు... యువతుల కుటుంబాలూ అభద్రతా భావంలోకి వెళ్లి పోలీసు విభాగంలో అడుగుపెట్టకుండా తమ వారిని నిలువరించేలా చేసే ప్రమాదం లేకపోలేదు. అదే జరిగితే మళ్లీ పాత పరిస్థితులు పునరావృతమయ్యే అవకాశం ఉంది.
కఠిన చర్యలతోనే సరైన ఫలితాలు...
ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటేనే ఈ పరిస్థితుల్లో మార్పు వస్తుందన్నది. మాజీ పోలీసు ఉన్నతాధికారుల మాట. తొలుత బదిలీ, ఆపై సస్పెన్షన్, కొన్నాళ్లకు లూప్‌లైన్‌లో పోస్టింగ్... ఇలా చేస్తుండటంతో ఆశించిన స్థాయి మార్పు రావట్లేదని వాళ్లు స్పష్టం చేస్తున్నారు. మరోపక్క పోలీసులపై వచ్చే ఇలాంటి ఆరోపణలకు సంబంధించిన కేసులను దర్యాప్తు చేసేది, అంతర్గత విచారణ, ఓరల్ ఎంక్వైరీలు చేపట్టేది కూడా పోలీసులే కావడంతో పూర్తి న్యాయం జరగదని అభిప్రాయపడుతున్నారు.
ఖా‘కీచకుల’పై విచారణకు ప్రత్యేకంగా స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న కమిటీలు ఏర్పాటు చేయాలని, ఆరోపణలు రుజువైతే ఉద్యోగం నుంచి తొలగింపు వంటి కఠిన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అయితే చర్యలు తీసుకోవడానికి ముందే ఆరోపణల్లో నిజానిజాలను పదేపదే సరిచూసుకోవాలని చెప్తున్నారు. ఇలా ముందుకు వెళ్తేనే సమాజంలోనే కాదు పోలీసు విభాగంలోనూ మహిళ భద్రంగా ఉంటుందని పేర్కొంటున్నారు.
చదవండి: ఫ్యాన్.. ఏసీ ఆన్.. హీటెక్కుతున్న 'గ్రేటర్'.. భారీగా విద్యుత్ వినియోగం
Comments
Please login to add a commentAdd a comment