చిన్న పరిశ్రమలకు కొత్త పాలసీ
ఉన్నతాధికారులతో సమీక్షలో సీఎం చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎస్‌ఎంఇ) పరిశ్రమలకు ప్రోత్సాహానికి ప్రాధాన్యమివ్వాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచించారు. నూతన పారిశ్రామిక విధాన రూపకల్పనలో భాగంగా మంగళవారం ఆయన సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. వచ్చే పదేళ్లలో ఎంఎస్‌ఎంఇ ద్వారా 2.7 లక్షల మంది ఉపాధి కల్పించేలా కొత్త విధానాన్ని రూపొందిస్తున్నట్టు పరిశ్రమల శాఖ అధికారులు సీఎంకు తెలిపారు.
మహిళలు, ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు మరిన్ని ప్రోత్సాహకాలందేలా కొత్త విధానం ఉంటుందని వివరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, అవి ఎదుర్కొంటున్న సమస్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
ఉదార విధానమే ఉత్తమం: ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక విధానం ఉదారంగా, సరళీకృతంగా, పారిశ్రామికహితంగా ఉండాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. గతంలో పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేసిన పెద్ద కంపెనీలకు భూములిస్తే మరిన్ని కంపెనీలు రాష్ట్రానికి వచ్చే వీలుందన్నారు.
నేడు విశాఖ, ఢిల్లీలలో చంద్రబాబు పర్యటన
సాక్షి, హైదరాబాద్/ విశాఖపట్నం: సీఎం చంద్రబాబు బుధవారం విశాఖతోపాటు దేశ రాజధాని ఢిల్లీలో పర్యటించనున్నారు. ఉదయం విశాఖ చేరుకున్న అనంతరం రాష్ర్ట పారిశ్రామిక విధానాన్ని విడుదల చేస్తారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన పలువురు పారిశ్రామిక వేత్తలతో కలసి ఎంఓయూపై సంతకాలు చేస్తారు.
తొలుత ఉత్తరాంధ్రలో హుద్‌హుద్ వల్ల దెబ్బతిన్న ఇళ్ల పునర్నిర్మాణ ప్రాజెక్టు నిర్మాణ కోసం ఉడా పార్కు వద్ద ఏర్పాటుచేసిన శంకుస్థాపన పైలాన్‌ను ఉదయం 9.40 గంటలకు ఆవిష్కరిస్తారు. అనంతరం ఢిల్లీ చేరుకుని అక్కడ ఇండో-జపాన్ ఎనర్జీ ఫోరం సమావేశంలో ప్రసంగిస్తారు. 30వ తేదీ ఉదయం నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో స్వచ్ఛ్‌భారత్‌పై జరిగే సమావేశంలో పాల్గొంటారు.