The highest temperature
-
మళ్లీ సుర్రుమన్న ‘సూరీడు’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొన్ని రోజులుగా చల్లబడ్డ వాతావరణం కాస్తా మళ్లీ ఒక్కసారిగా వేడెక్కింది. రాష్ట్రంపై సూరీడు సుర్రుమంటూ విరుచుకుపడ్డాడు. తెలంగాణను నిప్పుల కుంపటిలా మార్చాడు. శుక్రవారం రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీల సెల్సియస్ మేర ఎక్కువగా నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. జగిత్యాల జిల్లా నేరెళ్లలో అత్యధికంగా 45.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.అలాగే మంచిర్యాల జిల్లా కొండాపూర్‌లో 44.9 డిగ్రీలు, మంచిర్యాల జిల్లా హాజీపూర్‌లో 44.5, పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్‌లో 44.4, ఆదిలాబాద్ జిల్లా అర్లిలో 44 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డయింది. రానున్న మూడు రోజులు ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయికి చేరతాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. 26న బంగ్లాదేశ్‌లో తీరం దాటనున్న తుపాను పశి్చమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ఈశాన్య దిశగా కదిలి శుక్రవారం ఉదయం మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండంగా మారింది. ఇది బంగ్లాదేశ్‌లోని ఖేర్పురకు దక్షిణ నైరుతి దిశలో 750 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ శాఖ వివరించింది. ఈ వాయుగుండం ఈశాన్య దిశలోనే కదులుతూ మరింత బలపడి శనివారం ఉదయానికి తూర్పుమధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారనున్నట్లు తెలిపింది.క్రమంగా ఉత్తర దిక్కులో కదులుతూ మరింత బలపడి తీవ్ర తుపానుగా మారి ఈ నెల 26న అర్ధరాత్రికల్లా బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ తీరానికి సమీపంలోని సాగర్ ఐలాండ్ ఖేర్పుర మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు వివరించింది. దీని ప్రభావం ఉత్తర తెలంగాణ ప్రాంతంపై అతితక్కువగా ఉంటుందని, కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు నైరుతి రుతుపవనాలు దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవుల్లోని మిగిలిన ప్రాంతాలు, ఉత్తరమధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.శుక్రవారం ప్రధాన కేంద్రాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు (డిగ్రీల సెల్సియస్‌లలో) కేంద్రం గరిష్టం ఆదిలాబాద్ 42.8 మహబూబ్‌నగర్ 41.5 రామగుండం 41.4 నల్లగొండ 40.5 మెదక్ 40.2 హైదరాబాద్ 39.7 ఖమ్మం 39.4 నిజామాబాద్ 39.3 భద్రాచలం 37.0 హనుమకొండ 36.8 -
నిప్పుల కొలిమి
నందిగామలో 44.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు బెజవాడలో 42.7 డిగ్రీలు అల్లాడిపోయిన నగరవాసులు విజయవాడ : జిల్లాలో ఎండవేడి రోజురోజుకూ పెరిగి నిప్పుల కొలిమిగా మారుతోంది. నందిగామ, విజయవాడలో ఈ సీజన్లోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో జనం తల్లడిల్లిపోయారు. ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఎండవేడిమి తీవ్రంగాఉండటంతో జనం ఆపసోపాలు పడ్డారు. ఉదయం ఆరు గంటలకే 31 డిగ్రీలతో ఎండవేడిమి ప్రారంభమై 10 గంటల సమయానికి 32 డిగ్రీలకు చేరింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి రెండు గంటలకు ఎండ వేడిమి 42.7 డిగ్రీలకు పెరిగింది. మూడు గంటల నుంచి క్రమేపీ తగ్గుతూ వచ్చి సాయంత్రం ఆరు గంటలకు కూడా 39 డిగ్రీలకు చేరింది. ఎండ వేడిమి తాళలేక జనం ఇళ్ల నుంచి బయటకు రాలేదు. దీంతో నగరంలో నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారాయి. జన సంచారం, వాహనాల రాకపోకలు లేక బందరు రోడ్డు వెలవెలబోయింది. ఏలూరు రోడ్డు, పోలీసు కంట్రోల్ రూమ్ ఏరియాల్లో కనీసం పిట్ట కూడా కనిపించలేదు. చిట్టినగర్, మొగల్రాజపురం, గుణదల తదితర కొండ ప్రాంత ఇళ్లలో నివసించే కుటుంబాలవారు ఎండవేడిమి తాళలేక నానా అగచాట్లు పడ్డారు. అత్యవసర పనులపై బయటకు వచ్చేవారు గొడుగులు, తలలకు మాస్కులు వేసుకుని ఎండ వేడిమితో అవస్థలు పడ్డారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు, సిబ్బంది ఎం డవేడిమి, ఉక్కపోతకు అల్లాడిపోయారు. రోడ్లపై వేడి సెగలు వ్యాపించాయి. వాహనాల్లో కూడా జనం ప్రయాణించలేకపోయ ూరు. నందిగామలో శుక్రవారం గరిష్టంగా 44.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న రెండు రోజులు కూడా ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. -
రాష్ట్రంలో కొనసాగుతున్న ఎండల తీవ్రత
విశాఖపట్నం: రాష్ట్రంలో ఎండల తీవ్రత ఆదివారం కూడా కొనసాగింది. ముఖ్యంగా రాయలసీమలో ఈ తీవ్రత అధికంగా ఉంది. ఆదివారం రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు రాయలసీమలోనే నమోదయ్యాయి. చిత్తూరులో 42 డిగ్రీలు, కర్నూలు, అనంతపురంలలో 41 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు కోస్తా ప్రాంతంలోని నెల్లూరులోనూ భానుడు ప్రతాపం చూపాడు. ఇక్కడ ఆదివారం 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రెంటచింతల, నందిగామల్లోనూ 41 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదవగా.. కావలిలో 40, విశాఖపట్నంలో 38.2, కాకినాడలో 36, మచిలీపట్నంలో 38, బాపట్లలో 37 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఏప్రిల్ సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో వేడి వాతావరణం, పొడిగాలుల ప్రభావం మరింతగా ఉంటుందని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా రాయలసీమ, ఉత్తరాంధ్రపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని వారు తెలిపారు.