హైవేపై కరెన్సీ నోట్ల వర్షం.. ఎగబడిన జనం!
సాంటియాగో: రోడ్డుపై వెళ్తున్నప్పుడు డబ్బులు కనిపిస్తే ఎవరైనా వద్దనుకుంటారా? మరో ఆలోచన లేకుండా తీసుకుని అక్కడి నుంచి జారుకుంటారు. అలాంటిది కరెన్సీ నోట్ల వర్షం కురిస్తే.. ఎవరైనా ఊరుకుంటారా? ఎంత పని ఉన్నా.. వాటిని పట్టుకునేందుకే ఎగబడతారు. చిలీ దేశంలో కూడా అలాగే జరిగింది. హైవేపై నోట్ల వర్షం కురవటంతో జనం ఎగబడ్డారు. భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడినా పట్టించుకోలేదు. అయితే, ఈ కరెన్సీ నోట్లు వర్షం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. గ్యాంబ్లింగ్ హాల్లో రాబరి చేసి వెళ్తుండగా నోట్ల కట్టలు ఇలా రోడ్డుపై పడిపోయినట్లు తెలుస్తోంది.
పుడహుయెల్లోని క్యాసినోపై శుక్రవారం రాత్రి 7.45 గంటల ప్రాంతంలో దుండగులు దాడికి పాల్పడి భారీగా నగదు దోచుకున్నారని పోలీసులు తెలిపారు. గ్యాంబ్లింగ్ హాల్లోని సిబ్బందిని, అక్కడున్న వారిని ఆయుధాలతో బెదిరించి పరారైనట్లు కోఆపరేటివా మీడియా పేర్కొంది. దుండగులు కారులో పరారవుతుండగా.. వారిని పోలీసులు వెంబడించారు. దీంతో వారు ఉత్తర తీర ప్రాంతానికి వెళ్లే హైవేపైకి వెళ్లారు. ఈ క్రమంలో పోలీసులను అడ్డుకోవడానికి దొంగలు కరెన్సీ నోట్లను హైవేపై వెదజల్లుతూ వెళ్లినట్లు మీడియా పేర్కొంది. కానీ, వారి ప్రయత్నాలు ఫలించలేదు. కారును అడ్డగించి వారిని అరెస్ట్ చేశారు పోలీసులు.
అరెస్ట్ చేసిన ఆరుగురిలో మొత్తం మంది విదేశీయులేనని పోలీసులు తెలిపారు. అందులో ఇద్దరు దేశంలో అక్రమంగా నివాసం ఉంటున్నారని చెప్పారు. అయితే, వారు ఏ దేశానికి చెందిన వారనే విషయాన్ని బయటకు తెలపలేదు. మరోవైపు.. గ్యాంబ్లింగ్ హాల్లో, హైవేపై ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, నగదు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
A violent robbery at a store ended in a police car chase, money raining down on a highway and six suspects getting arrested in Santiago, Chile#chile #santiago #chase #anews pic.twitter.com/KeHtPTQugh
— ANews (@anews) October 21, 2022
ఇదీ చదవండి: రాజకీయ పావులు కదుపుతున్న బోరిస్.. ఇప్పటికిప్పుడు ప్రధాని పదవి వద్దంటూ రిషి సునాక్కు ఆఫర్