Hijra suicide
-
ఇంటికి వెళ్తే రానివ్వరని మనస్తాపంతో హిజ్రా ఆత్మహత్య..
కర్నూలు: పట్టణంలోని త్రివర్ణ కాలనీలో నివాసం ఉంటున్న సాయిపల్లవి (సాయినాథ్‌రెడ్డి వయస్సు 21) అనే హిజ్రా ఆత్మహత్య చేసుకున్నారు. పట్టణ ఎస్ఐ శరత్‌కుమార్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. అవుకు మండలం జూనూతల గ్రామానికి చెందిన సాయినాథరెడ్డి నాలుగేళ్ల క్రితం హిజ్రాగా మారి డోన్ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ పట్టణంలో నివసించేవారు. బంధువులు, కుటుంబ సభ్యులకు దూరంగా ఉండటం, ఇంటికి వెళితే తనను నిరాకరిస్తారని మనస్తాపంతో సోమవారం తెల్లవారు జామున ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. గమనించిన తోటి హిజ్రాలు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సాయినాథ్‌రెడ్డి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు. -
గుడేకల్ చెరువులో బయటపడ్డ మృతదేహం.. హిజ్రాగా గుర్తింపు
ఎమ్మిగనూరురూరల్ (కర్నూలు): గుడేకల్ గ్రామ చెరువులో సోమవారం హిజ్రా మృతదేహం బయటపడింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కర్ణాటక రాష్ట్రం బళ్లారికి చెందిన హిజ్రా గంగమ్మ అలియాస్ ఎర్రిస్వామి (36) 20 రోజుల క్రితం ఎమ్మిగనూరుకు వచ్చాడు. పక్షవాతంతో పాటు అనారోగ్యంతో బాధపడుతూ ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతంలో ఉండటంతో స్థానికులు వేదాస్ సేవా సమితి అనాథ ఆశ్రమానికి చేర్చారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించి, బళ్లారిలో ఉన్న కుటుంబ సభ్యులతో మాట్లాడించారు. అయితే మూడు రోజులుగా కనిపించకపోవటంతో బళ్లారికి వెళ్లినట్లు భావించారు. కాగా సోమవారం ఉదయం చెరువులో చేపలు పట్టేవారికి మృతదేహం కనిపించడంతో రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న రూరల్ ఎస్ఐ సునీల్‌కుమార్ సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మూడు రోజులు కావటంతో శరీరం ఉబ్బిపోయి, గుర్తు పట్టడానికి వీలులేకుండా ఉంది. అయితే మృతుడి జేబులోని పర్సులో ఆధార్ కార్డు ఉండటంతో మృతుడి ఆచూకీ తెలిసింది. ఈ మేరకు కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. -
స్కూటర్ లాక్కెళ్లారని హిజ్రా ఆత్మాహుతి
పోలీసు స్టేషన్ ఎదుట ఘాతుకం పోలీసుల తీరుపై ఆక్రోశం ఆందోళనలతో సహచరుల ఆగ్రహం పోలీసులు బలవంతంగా తన స్కూటర్‌ను లాక్కెళ్లడంతో ఆవేదనకు లోనైన ఓ హిజ్రా బుధవారం అగ్నికి ఆహుతి అయింది. పోలీసు స్టేషన్ ఎదుటే ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకోవడం స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల కారణంగా హిజ్రా ఆహుతి కావడాన్ని జీర్ణించుకోలేక సహచర హిజ్రాలు ఆందోళనలకు దిగారు. వీరిని బుజ్జగించడం పోలీసు ఉన్నతాధికారులకు తలకు మించిన భారంగా మారింది. చెన్నై: టీనగర్, పాండి బజార్ పోలీసులు మంగళవారం రాత్రి తిరుమలై పిళ్లై వీధిలో వాహనాల తనిఖీల్లో నిమగ్నమయ్యారు. అర్ధరాత్రి వేళ అటు వైపుగా వచ్చిన స్కూటర్‌ను ఆ పారు. ఆ స్కూటర్‌ను నడుపుకుంటూ వచ్చింది హిజ్రాగా గుర్తించారు. ఆ వాహనానికి ధ్రువీవీకరణ పత్రాలు, లైసెన్స్ లు గానీ చూపించేందుకు ఆ హిజ్రా నిరాకరించింది. మద్యం మత్తులో ఉన్నట్టుగా నిర్ధారించుకున్న పోలీసులు ఆ స్కూటర్‌ను తమ ఆధీనంలోకి తీసుకుని పాండి బజార్ స్టేషన్ కు తరలించారు. ఇంత వరకు అంతా బాగానే ఉన్నా, బుధవారం ఉదయం ఐదు గంటల సమయంలో పాండి బజార్ స్టేషన్ కు వచ్చిన ఆ హిజ్రా తన స్కూటర్‌ను అప్పగించాలని పోలీసులపై ఒత్తిడి తెచ్చింది. స్టేషన్ సిబ్బంది నిరాకరించి బయటకు బలవంతంగా పంపించడంతో, తీవ్ర మనోవేదనకు, ఆగ్రహానికి గురైన ఆ హిజ్రా వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను పోలీసు స్టేషన్ ఎదుటే తన మీద పోసుకుని నిప్పు అంటించుకుంది. హఠాత్తుగా చోటు చేసుకున్న ఈ పరిణామంతో అక్కడి పోలీసులు పరుగులు తీశారు. మంటల్ని ఆర్పేందుకు యత్నించారు. అంబులెన్స్ ను పిలిపించి , చికిత్స నిమిత్తం కీల్పాకం ఆసుపత్రికి తరలించారు. 90 శాతం కాలిన గాయాలతో కీల్పాకం ఆసుపత్రిలో చేర్పించిన హిజ్రాకు అక్కడి వైద్యులు చికిత్స అందించారు. ఆ హిజ్రా చూలైమేడు సమీపంలోని నమశ్శివాయ పురంకు చెందిర తార(33)గా గుర్తించారు. చికిత్సపొందుతున్న తార పది గంటల సమయంలో మరణించింది. ఈ సమాచారంతో చెన్నై నగరంలో ఉన్న హిజ్రాల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కోపోద్రిక్తులైన హిజ్రాలు వందలాది మంది కీల్పాకం ఆసుపత్రి వైపుగా దూసుకొచ్చారు. పోలీసులు హతమార్చి, ఆహుతి చేయడమే కాకుండా, ఆత్మాహుతి నాటకం ఆడుతున్నట్టుందని ఆరోపించడం మొదలెట్టారు. దీంతో పోలీసుల్లో ఆందోళన బయలు దేరింది. అదే సమయంలో మరింత ఆగ్రహంతో పూందమల్లి హైరోడ్డుపై హిజ్రాలు ఆందోళనకు దిగడంతో ఎక్కడి వాహనాలు అక్కడే ఆగాయి. ఉదయాన్నే విధుల నిమిత్తం కార్యాలయాలకు వెళ్లాల్సిన వాళ్లకు తంటాలు తప్పలేదు. పోలీసుల మీదకు హిజ్రాలు దూసుకు రావడంతో వెనక్కు తగ్గాల్సిన పరిస్థితి. ఏమి చేయాలో తోచని స్థితిలో పోలీసులు కాసేపు సంయమనం పాటించాల్సి వచ్చింది. సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు అక్కడికి చేరుకుని హిజ్రాలను బుజ్జగించేం దుకు శ్రమించాల్సి వచ్చింది. తార స్కూటర్‌ను లాక్కెళ్లిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని, ఈ ఘటనపై విచారణ వేగవంతం చేసి బాధ్యులను కఠినంగా శిక్షించాలని హిజ్రాలు ఉంచిన డిమాండ్‌కు పోలీసు ఉన్నతాధికారులు తలొగ్గక తప్పలేదు. పోలీ సు అధికారుల హామీతో ఆందోళనను విరమించారు.మృత దేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. -
హిజ్రా ఆత్మహత్య
టీనగర్: యువకులు లైంగిక వేధింపులు తట్టుకోలేక మానసికంగా కుంగిపోయిన ఒక హిజ్రా ఆత్మహత్య చేసుకుంది. దీంతో సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటేనే మృతదేహాన్ని తీసుకుంటామని హిజ్రాలు ఆందోళన జరపడంతో పళని ఆసుపత్రి ప్రాంగణంలో సంచలనం ఏర్పడింది. నాగపట్టణం జిల్లా, వేదారణ్యంకు చెందిన హిజ్రా మధుమిత (23). ఈమె 10 ఏళ్ల క్రితం తన కుటుంబాన్ని విడిచి దిండుగల్ జిల్లా, పళనికి చేరుకున్నారు. ఇక్కడ రామనాథన్ నగర్లో నివశిస్తున్న 60 మంది హిజ్రాలతో కలిసి వుంటూ వచ్చారు. దూరవిద్య ద్వారా బిఎ చదువుతూ వచ్చారు. శుక్రవారం ఇదే ప్రాంతానికి చెందిన యువకులు శివ, సతీష్, అతని సోదరుడు మధుమితను గేలి చేసి లైంగిక వేధింపులకు గురిచేశారు. దీనిగురించి మధుమిత ఫిర్యాదు చేయడంతో మిగిలిన హిజ్రాలు యువకుల వద్ద విచారణ జరిపారు. దీంతో ఆగ్రహించిన స్థానిక ప్రజలు హిజ్రాలను ఆ ప్రాంతం నుంచి వెళ్లిపొమ్మని హెచ్చరించడమే కాకుండా వారిపై దాడి జరిపారు. దీంతో మనస్తాపానికి గురైన మధుమిత విషం సేవించింది. ప్రాణాపాయ స్థితిలో వున్న ఆమెను వెంటనే పళని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్సలు పొందుతూ మధుమిత మృతిచెందింది. దీంతో హిజ్రాలు ఆమెను వేధించిన యువకులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆసుపత్రిని ముట్టడించారు. -
హత్యా.. ఆత్మహత్యా?
నరసన్నపేట: మండలంలోని రావులవలసలో మంటల్లో కాలి మృతి చెందిన హిజ్రా (వర్ధిని)(28) మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. శనివారం రాత్రి వర్ధిని అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం విదితమే. సంఘటనను తెలుసుకున్న నరసన్నపేట సీఐ చంద్రశేఖర్, ఎస్ఐ చిన్నంనాయుడు రాత్రి 2 గంటల సమయంలో రావలవలస వెళ్లి పరిస్థితులను సమీక్షించారు. ఉదయానికి ఈ సంఘటన నరసన్నపేట ప్రాంతంలో సంచలనమైంది. ఇది ఆత్మహత్యా లేక హత్యా అనేది నిర్ధారించాల్సి ఉంది. హిజ్రా ఆత్మహత్యకు పాల్పడిందని కొందరు అంటుంటే మరికొందరు ఆమె మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమె వినియోగించే మొబైల్ ఫోన్ సంఘటనా స్థలం సమీపంలో ఉన్న చెరువులో పోలీసులకు లభించింది. దీంతో అనుమానాలు పెరిగాయి. కానీ ఆమె నివసించే నక్కవీధికి చెందిన మరికొందరు, హిజ్రా సంఘానికి చెందిన కొందరు ఇచ్చిన సమాచారం మేరకు ఆత్మహత్యగానే భావిస్తున్నారు. దీనిపై పోలీసులు ఓ కొలిక్కి రాలేకపోతున్నారు. సీఐ చంద్ర శేఖర్, ఎస్ఐ చిన్నంనాయుడు మరింత లోతుగా దర్యాప్తు చేపట్టారు. రావులవలసకు చెందిన ఓ వ్యక్తితో వర్ధినికి శారీరక సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ వ్యక్తితో హిజ్రా కొంతకాలంగా ఘర్షణ పడుతున్నట్లు.. కొందరు పెద్దమనుషుల వద్ద వీరిద్దరికీ రాజీ కుదరగా ఆ వ్యక్తి నుంచి కొంత డబ్బు వర్ధినికి అప్పగించినట్లు తెలుస్తోంది. అప్పటి నుంచి ఆ వ్యక్తి ఈమెతో దురంగా ఉండటాన్ని జీర్ణించుకోలేని హిజ్రా ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. నక్కవీధిలో శనివారం సాయంత్రం వర్ధిని కిరోసిన్ సేకరించిందని పోలీసులు గుర్తించారు. అయితే పక్కాగా సమాచారం లేకపోవడం, ఈమె గాజులు సమీప కాలువలో ఉండడంతో అనుమానాస్పద కేసుగా గుర్తించారు. నరసన్నపేటకు చెందిన వైద్యులతో సంఘటనా స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించారు. ఈ నివేదిక ఆధారంగా విచారణ కొనసాగిస్తామని పోలీసులు చెప్పారు. హిజ్రాతో సంబంధం ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. సంఘటనా స్థలాన్ని క్లూస్ టీం పరిశీలించింది. క్లూస్ టీం సీఐ కోటేశ్వరరావు, ఏఎస్ఐలు మురళి, సత్యం పరిశీలించి వివరాలు సేకరించారు.