హత్యా.. ఆత్మహత్యా? | Suspicious died | Sakshi
Sakshi News home page

హత్యా.. ఆత్మహత్యా?

Published Mon, Mar 16 2015 2:33 AM | Last Updated on Sat, Aug 11 2018 8:11 PM

Suspicious died

 నరసన్నపేట: మండలంలోని రావులవలసలో మంటల్లో కాలి మృతి చెందిన హిజ్రా (వర్ధిని)(28) మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. శనివారం రాత్రి వర్ధిని అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం విదితమే. సంఘటనను తెలుసుకున్న నరసన్నపేట సీఐ చంద్రశేఖర్, ఎస్‌ఐ చిన్నంనాయుడు రాత్రి 2 గంటల సమయంలో రావలవలస వెళ్లి పరిస్థితులను సమీక్షించారు. ఉదయానికి ఈ సంఘటన నరసన్నపేట ప్రాంతంలో సంచలనమైంది. ఇది ఆత్మహత్యా లేక హత్యా అనేది నిర్ధారించాల్సి ఉంది. హిజ్రా ఆత్మహత్యకు పాల్పడిందని కొందరు అంటుంటే మరికొందరు ఆమె మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమె వినియోగించే మొబైల్ ఫోన్ సంఘటనా స్థలం సమీపంలో ఉన్న చెరువులో పోలీసులకు లభించింది. దీంతో అనుమానాలు పెరిగాయి. కానీ ఆమె నివసించే నక్కవీధికి చెందిన మరికొందరు, హిజ్రా సంఘానికి చెందిన కొందరు ఇచ్చిన సమాచారం మేరకు ఆత్మహత్యగానే భావిస్తున్నారు. దీనిపై పోలీసులు ఓ కొలిక్కి రాలేకపోతున్నారు. సీఐ చంద్ర శేఖర్, ఎస్‌ఐ చిన్నంనాయుడు మరింత లోతుగా దర్యాప్తు చేపట్టారు. రావులవలసకు చెందిన ఓ వ్యక్తితో వర్ధినికి శారీరక సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
 
 ఆ వ్యక్తితో హిజ్రా కొంతకాలంగా ఘర్షణ పడుతున్నట్లు.. కొందరు పెద్దమనుషుల వద్ద వీరిద్దరికీ రాజీ కుదరగా ఆ వ్యక్తి నుంచి కొంత డబ్బు వర్ధినికి అప్పగించినట్లు తెలుస్తోంది. అప్పటి నుంచి ఆ వ్యక్తి ఈమెతో దురంగా ఉండటాన్ని జీర్ణించుకోలేని హిజ్రా ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. నక్కవీధిలో శనివారం సాయంత్రం వర్ధిని కిరోసిన్  సేకరించిందని పోలీసులు గుర్తించారు. అయితే పక్కాగా సమాచారం లేకపోవడం, ఈమె గాజులు సమీప కాలువలో ఉండడంతో అనుమానాస్పద కేసుగా గుర్తించారు. నరసన్నపేటకు చెందిన వైద్యులతో సంఘటనా స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించారు. ఈ నివేదిక ఆధారంగా విచారణ కొనసాగిస్తామని పోలీసులు చెప్పారు.  హిజ్రాతో సంబంధం ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. సంఘటనా స్థలాన్ని క్లూస్ టీం పరిశీలించింది. క్లూస్ టీం సీఐ కోటేశ్వరరావు, ఏఎస్‌ఐలు మురళి, సత్యం పరిశీలించి వివరాలు సేకరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement