Himachal pradesh high court
-
పరిహారమివ్వకుండా సేకరణ కుదరదు: సుప్రీం
న్యూఢిల్లీ: సరైన పరిహారం చెల్లించకుండా పౌరుల నుంచి భూమిని సేకరించే అధికారం ప్రభుత్వాలకు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆస్తి హక్కు ఇప్పటికీ రాజ్యాంగపరమైన హక్కేనని గుర్తు చేసింది. పరిహారమివ్వకుండా భూ సేకరణ చెల్లదంటూ హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది. న్యాయమూర్తులు జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ కె.వి.విశ్వనాథన్ ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు తీర్పు వెలువరించింది. రోడ్డు విస్తరణ కోసం సేకరించదలచిన భూమికి గాను హైకోర్టు ఆదేశించిన మేరకు సొంతదారులకు హిమాచల్ సర్కారు ముందుగా పరిహారం చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. -
హైకోర్టు చీఫ్ జస్టిస్‌లుగా ఐదుగురు న్యాయమూర్తులకు పదోన్నతి
ఢిల్లీ: ఐదుగురు హైకోర్టు న్యాయమూర్తులకు ప్రధాన న్యాయమూర్తులుగా పదోన్నతి లభించింది. వివిధ హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులుగా ఐదుగురు న్యాయమూర్తులు పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సుల మేరకు ఐదుగురు న్యాయమూర్తులకు చీఫ్ జస్టిస్‌లుగా పదోన్నతి దక్కింది. జస్టిస్ విపిన్ సంఘీ (ప్రస్తుతం ఢిల్లీ) - ఉత్తరాఖండ్ హైకోర్టు జస్టిస్ ఏఏ సయ్యద్ (ప్రస్తుతం బొంబాయి) - హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు జస్టిస్ ఎస్ఎస్ షిండే (ప్రస్తుతం బొంబాయి) - రాజస్థాన్ హైకోర్టు జస్టిస్ రష్మిన్ ఎం ఛాయా (ప్రస్తుతం గుజరాత్) - గౌహతి హైకోర్టు జస్టిస్ ఉజ్జల్ భుయాన్ (ప్రస్తుతం తెలంగాణ) - తెలంగాణ హైకోర్టు -
మాతృత్వం స్త్రీ హక్కు.. బెయిల్ ఇస్తే ఏం కాదు: హైకోర్టు
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. గౌరవప్రదమైన మాతృత్వం ప్రతి స్త్రీ హక్కు.. గర్భిణీ స్త్రీలకు కావాల్సింది జైలు కాదు.. బెయిల్ అని స్పష్టం చేసింది. నార్మాటిక్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్ (ఎన్డిపిఎస్ యాక్ట్) కింద నమోదైన కేసులో సహ నిందితురాలిగా ఉన్న గర్భిణీ స్త్రీకి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా జస్టిస్ అనూప్ చిట్కర మాట్లాడుతూ.. నిందితురాలికి తాత్కాలిక బెయిల్ మంజూరు చేసి.. శిక్షను ప్రస్తుతం నిలిపివేసి.. డెలివరీ తర్వాత ఒక సంవత్సరం వరకు పొడిగించవచ్చని తెలిపారు. అంతేకాక నేరాలు చాలా ఘోరంగా ఉన్నప్పుడు, ఆరోపణలు చాలా తీవ్రంగా ఉన్నప్పుడు కూడా దీన్ని అనుమతించాలన్నారు. ‘‘జైలు శిక్షను వాయిదా వేయడం ద్వారా రాష్ట్రానికి, సమాజానికి ఏదైనా హానీ జరుగుతుందా.. జైలు శిక్ష వాయిదా వేస్తే ఆకాశం ఊడి పడదు. సమాజంలోని ప్రతి స్త్రీ గౌరవప్రదమైన మాతృత్వానికి అర్హురాలు. గర్భం దాల్చిన నాటి నుంచి డెలివరీ తరువాత ఏడాది వరకు ఆమె మీద ఎలాంటి పరిమితులు ఉండకూడదు” అన్నారు చిట్కరా. ‘‘జైలులో ప్రసవిస్తే.. ఆ బిడ్డ సామాజిక ద్వేషాన్ని చవి చూస్తుంది. పుట్టుక గురించి ప్రశ్నించి.. జైలులోనే జన్మించాడని తెలిస్తే.. సమాజం ఆ బిడ్డను ఎంత చీదరించుకుంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇవన్ని ఆ బిడ్డ మీద తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయి. ఇక జైలులో మంచి ఆహారం అందించడం ద్వారా శారీరక ఆరోగ్యం బాగానే ఉండవచ్చు.. కానీ మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది’’ అన్నారు. ‘‘ఎన్డీపీఎస్ చట్టంలోని సెక్షన్ 37 లోని ఆదేశం నిందితులు నిర్దోషులుకు క్లీన్ చీట్ ఇవ్వడానికి.. రెండు షరతులను సంతృప్తి పరచాలని సూచిస్తుంది. దర్యాప్తుదారులు సేకరించిన సాక్ష్యాలు నిందితులకు బెయిల్ నిరాకరించడానికి చట్టబద్ధంగా సరిపోకపోవడమే కాక, వారి మీద మరే ఇతర దోషపూరిత సాక్ష్యాలు, ఆరోపణలు లేనప్పుడు.. నిందితులను నిర్దోషులుగా భావించవచ్చు. దీని ప్రకారం, పిటిషనర్ మొదటి షరతును సంతృప్తిపరిచారు. కనుక ఆమెకు తక్కువ వ్యవధి బెయిల్ మంజూరు చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. దీని ఆధారంగా కోర్టు నిందితురాలికి బెయిల్ మంజూరు చేస్తుంది’’ అని తెలిపారు. కేసేంటంటే.. గర్భిణీ స్త్రీని, మాదకద్రవ్యాల వ్యాపారంలో తన భర్తతో కలిసి కుట్రపన్నారనే ఆరోపణలపై అరెస్టు చేశారు పోలీసులు. అంతేకాక వారి ఇంట్లో సోదాలు నిర్వహించి 259 గ్రాముల హెరాయిన్, 713 గ్రాముల ట్రామడోల్ మాత్రలను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో నిందితురాలు ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. దీని కంటే ముందు బాధితురాలు కంగ్రా జిల్లా ప్రత్యేక కోర్టులో బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. కానీ కోర్టు ఈ ఏడాది జనవరి, 19న దాన్ని కొట్టేసింది. దాంతో బాధితురాలు హైకోర్టును ఆశ్రయించారు. -
చిన్నరైతులకు రుణమాఫీ చేయండి: హైకోర్టు
చిన్న, సన్నకారు రైతులకు రూ. 50 వేల వరకు ఉన్న రుణాలను రద్దుచేయాలని, లేదా రుణాలను వాయిదా పద్ధతిలో చెల్లించేందుకు అనుమతించాలని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. రైతులు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నందువల్ల అత్యవసరంగా ఒక రైతు కమిషన్ ఏర్పాటుచేసి, పంటల బీమా పథకాన్ని అమలుచేయాలని తెలిపింది. భారతీయ గోవంశ్ రక్షణ్ సంవర్ధన పరిషత్ దాఖలుచేసిన పిటిషన్‌ను విచారించిన సందర్భంగా జస్టిస్ రాజీవ్ శర్మ, జస్టిస్ సురేశ్వర్ ఠాకూర్లతో కూడిన డివిజన్ బెంచి ఈ ఆదేశాలు జారీచేసింది. ఇక్కడి భౌగోళిక పరిస్థితుల కారణంగా రైతులు వర్షాలపైనే ఆధారపడ్డారని కోర్టు వ్యాఖ్యానించింది. రైతుల కష్టాలను తీర్చేందుకు ఇంతవరకు సరైన వేదిక లేదని, వాళ్ల ప్రయోజనాలను కాపాడాటం ప్రభుత్వ బాధ్యత అని బెంచి తెలిపింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటుచేసే కమిషన్ల ప్రతిపాదనలను ఆమోదించాలని, ఒకవేళ ఆమోదించకపోతే అందుకు తగిన కారణాలు కూడా చెప్పాలని కోర్టు చెప్పింది. కనీసం రూ. 50 వేల వరకు ఉన్న రుణాలను వెంటనే మాఫీ చేయాలని, కాని పక్షంలో వాటి మీద వడ్డీరేటును తగ్గించి, వాయిదాల్లో చెల్లించేందుకు అనుమతించాలని ప్రభుత్వానికి తెలిపింది. కేసు తదుపరి విచారణను జూన్ 13కు వాయిదా వేసింది. పట్టణ ప్రాంతాల్లో పశువల షెడ్లను కట్టేందుకు మూడు నెలల్లోగా పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధి, పశుసంవర్ధక శాఖలు ఒక్కోటి రూ. 5 కోట్ల చొప్పున కేటాయించాలని ఆయా శాఖల అదనపు ప్రధాన కార్యదర్శులను ఆదేశించింది. -
లైంగిక వేధింపులు.. జడ్జి సస్పెన్షన్
సిమ్లా: మహిళా జడ్జిపై లైంగిక వేధింపులకు పాల్పడిన మరో న్యాయమూర్తిని హిమచల్ ప్రదేశ్ హైకోర్టు సస్పెండ్ చేసింది. విచారణ పూర్తయ్యే వరకు ఆయనపై సస్పెన్షన్ విధించింది. ఈ కేసులో దర్యాప్తును రెండు నెలల్లోగా పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. సదరు జడ్జి జూన్ 8న మనాలిలో తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారని మహిళా జడ్జి ఫిర్యాదు చేయడంతో హైకోర్టు ఈ చర్య తీసుకుంది. మాదకద్రవ్యాల నేరాలపై గత నెలలో నిర్వహించిన జాతీయస్థాయి సదస్సుకు హాజరైనప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది. తనకు కంపెనీ ఇవ్వాలని బలవంతం చేయడమే కాకుండా... టీజ్ చేశారని, వేధించారని హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తికి బాధితురాలు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు దీనిపై విచారణ చేపట్టారు. -
విఎన్ఆర్ కాలేజీ యాజమాన్యానికి హైకోర్టు నోటీసులు
విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థులు బియాస్ నదిలో దిగేందుకు అనుమతి ఎవరిచ్చారో తెలపాలని ఆ కళాశాల యాజమాన్యానికి హిమాచల్ హైకోర్టు శుక్రవారం నోటీలసు జారీ చేసింది. ఇదిలా ఉండగా బియాస్ నదిలో విద్యార్థుల విషాదంపై నివేదికను మండి డివిజన్ కమిషన్ ఈరోజు హైకోర్టుకు అందజేసింది. డ్యామ్ అధికారుల నిర్లక్ష్యమే ఆ ప్రమాదానికి ఘటనకు కారణమని డివిజన్ కమిషన్ ఆ నివేదికలో పేర్కొంది. అలాగే డ్యామ్ నుంచి గంటలో 450 క్యూసెక్కుల నీరు విడుదలైందని వెల్లడించింది. నీటీ విడుదల సమయంలో స్పష్టమైన నిబంధనలను పాటించలేదని... వార్నింగ్ సిస్టమ్ సరిగా లేదని తెలిపింది. పవర్ హౌస్‌లో అధికారుల మధ్య సమన్వయం లేదని చెప్పింది. ఇటువంటి పొరపాట్ల కారణంగానే విద్యార్థులు మృతి చెందారని మండి డివిజన్ కమిషన్ హైకోర్టు అందజేసిన నివేదికలో పేర్కొంది. ఇటీవల హైదరాబాద్ నగరానికి చెందిన విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతీ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థులు విజ్ఞన యాత్ర కోసం ఉత్తర భారతదేశం వెళ్లారు. ఆ క్రమంలో హిమాచల్ ప్రదేశ్ లో పర్యటిస్తున్నారు. అక్కడి బియాస్ నదిలో ఫోటోలు దిగుతుండగా 24 మంది కాలేజీ విద్యార్థులు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఆ ఘటనలో ఇప్పటి వరకు 12 మంది విద్యార్థులు మృతదేహాలను వెలికి తీశారు. విద్యార్ధుల మృతదేహాల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.