జియోకు భారీగా షాకిస్తున్నారు!
ముంబై : రిలయన్స్ జియో ఉచిత ఆఫర్లతో మార్చి వరకు ఊదరగొట్టిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ నుంచి రిలయన్స్ జియో ఇక టారిఫ్ బాదుడు ప్రారంభించింది. అప్పటిదాక జియో వైపు మొగ్గుచూపిన కస్టమర్లందరూ ఆ నెట్ వర్క్ కు భారీగా షాకిస్తూ ఇతర నెట్ వర్క్ లవైపుకు మరలడం ప్రారంభించారట. అంతేకాక తగ్గుతున్న రేట్ల ఛార్జీలు కూడా కస్టమర్లను ఆకట్టుకుంటున్నట్టు తెలుస్తోంది.
రిలయన్స్ జియోకు మరలిన డేటా కస్టమర్లందరూ ఇప్పటికే భారీగా తమ నెట్ వర్క్ వైపుకు వచ్చేస్తున్నారంటూ టెలికాం దిగ్గజం ఐడియా సెల్యులార్ ప్రకటించింది. ఏప్రిల్ నుంచి ప్రారంభమైన ఈ ఆర్థిక సంవత్సరంలో 2017లో వచ్చిన నష్టాల నుంచి గట్టెక్కుతామని ఐడియా అంచనావేస్తోంది. ఛార్జీలు బాదుడు ప్రారంభించిన తర్వాత నుంచే డేటా కస్టమర్లందరూ జియో నెట్ వర్క్ కు గుడ్ బై చెబుతున్నారంటూ ఐడియా సెల్యులార్ మేనేజింగ్ డైరెక్టర్ హిమాన్షు కపానియా చెప్పారు. ద్వితీయార్థంలో రేట్లు స్థిరీకరణ జరుగుతుందని ఆయన అంచనావేశారు.
'' ఇండస్ట్రీకి, తమకు ఈ రెవెన్యూ వృద్ధిని మేము ముందే అంచనావేశాం. ఏడాది బేసిస్ తో స్వల్ప వృద్ధితో ఇండస్ట్రీ ఫ్లాట్ గా ఉంటుందని అనుకున్నాం. 2017 క్యూ 4 నష్టాల నుంచి ఇండస్ట్రీ వచ్చే ఏడాది క్యూ 4 వరకు 15 శాతం రికవరీ అవుతుంది'' అని పేర్కొన్నారు. 2016 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే, 2017 ఆర్థిక సంవత్సరంలో ఇండస్ట్రీ 14-15 శాతం నష్టపోయినట్టు తెలిపారు. మార్కెట్లోకి సంచలనాలు రేపుతూ ఎంట్రీ ఇచ్చిన రిలయన్స్ జియోకు 75 మిలియన్ కస్టమర్లు చేరడం, మూడు టాప్ టెలికాం దిగ్గజాలకు నష్టాలు చేకూర్చడం స్వల్పమేనని, తాము సబ్ స్క్రైబర్లు జోడించుకుంటూనే ఉన్నామని కపానియా చెప్పారు. వాయిస్ వాడక వృద్ధి రెండంకెలు నమోదవుతుందని అంచనావేస్తున్నట్టు తెలిపారు. డేటా వృద్ధిలో రెండంకెలు, వైర్ లెస్ బ్రాడ్ బ్యాండ్ సర్వీసుల్లో మూడింతలు వృద్ధిని నమోదుచేసే దిశగా ఇండస్ట్రీ పయనిస్తుందని పేర్కొన్నారు.