Hiranandani Hospital
-
మహువా మెయిత్రా కేసులో వెలుగులోకి కీలక అంశాలు
ఢిల్లీ: డబ్బులు తీసుకుని లోక్‌సభలో ప్రశ్నలు అడిగారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ మహువా మెయిత్రా కేసులో కీలక అంశాలు బయటకొస్తున్నాయి. ఆమె పార్లమెంటరీ ఖాతాను దుబాయ్ నుంచి 47 సార్లు ఉపయోగించినట్లు తెలుస్తోంది. మహవా మెయిత్రా నేడు లోక్‌సభ ఎథిక్స్ కమిటీ ముందు విచారణకు హాజరు కానున్న నేపథ్యంలో ఇలాంటి ఆరోపణలు వెలువడ్డాయి. దుబాయ్ నుంచి మహువా ఎంపీ ఖాతా 47 సార్లు తెరవబడినట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో భాజపా ఎంపీ నిషికాంత్ దూబే స్పందించారు. మహువా అవినీతి చర్యలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఎంపీలందరూ నిలబడాలని కోరారు. వ్యాపారవేత్త హీరానందానీ తన వ్యాపార ప్రయోజనాల కోసమే మహువా ఖాతాను ఉపయోగించి ఆయనే ఈ ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోందని అన్నారు. పెట్టిబడిదారుల ఉపయోగాల కోసం ఎంపీల బృందం పనిచేస్తోంందా? అని దేశవ్యాప్తంగా ఎంపీలందర్ని ఉద్దేశించి ప్రశ్నించారు. లోక్‌సభలో ప్రశ్నలు అడగడానికి టీఎంసీ ఎంపీ మహవా మెయిత్రా వ్యాపారవేత్త హీరానందానీ నుంచి డబ్బులు తీసుకున్నారని నిషికాంత్ దూబే ఆరోపించారు. ఈ క్రమంలో మహువాకు లంచం ఇచ్చినట్లు ఆరోపిస్తూ హీరానందానీ పేర ఓ లేఖకు చక్కర్లు కొట్టింది. వీటిని మహవా మెయిత్రా ఖండించారు. ఈ వ్యవహారంలో మహువాకు లోక్‌సభ ఎథిక్స్ కమిటీ సమన్లు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆమె గురువారం ఎథిక్స్ కమిటీ ముందు హాజరు కానున్నారు. ఇదీ చదవండి: మరాఠా రిజర్వేషన్‌కు అనుకూలమే: ఏక్నాథ్ షిండే -
దర్శన్ అఫిడవిట్ పీఎంవో పనే: మహువా మొయిత్రా
ఢిల్లీ: మీడియాలో బహిర్గతమైన వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ అఫిడవిట్ వ్యవహారంపై ఎంపీ మహువా మొయిత్రా సంచలన ఆరోపణలు చేశారు. ప్రధానమంత్రి కార్యాలయం దర్శన్‌పై ఒత్తిడి చేసి తెల్లకాగితంపై సంతకం చేయించారని ఆరోపించారు. పీంవోనే ఓ తెల్లకాగితంపై రాసి మీడియాకు లీక్ చేశారని అన్నారు. పార్లమెంటు ఎథిక్స్ కమిటీకి సమర్పించిన అఫిడవిట్ విశ్వసనీయతపై ఆమె అనుమానం వ్యక్తం చేశారు. అఫిడవిట్ లెటర్ హెడ్ లేని తెల్ల కాగితంపై ఉందని అన్నారు. అధికారికంగా విడుదల చేయలేదని చెప్పారు. 'వ్యాపార వేత్తగా కొనసాగుతున్న దర్శన్‌కు పీఎంతో పాటు మంత్రులందర్ని కలవగల సమర్ధత ఉంది. అలాంటప్పుడు పార్లమెంట్లో ప్రశ్నలు అడగడానికి మొదటిసారి ప్రతిపక్ష ఎంపీగా కొనసాగుతున్న నాకు ఎందుకు లంచం ఇస్తారు? ఇది పూర్తిగా అసత్యం. ఈ లేఖను దర్శన్ కాకుండా పీఎంవోనే రాసింది. దర్శన్, ఆయన తండ్రిపై పీఎంవో బెదిరింపులకు పాల్పడింది. లేఖపై సంతకం చేయడానికి 20 నిమిషాలు సమయం ఇచ్చారు.' అని పేర్కొంటూ తాను దర్శన్ నుంచి లంచం తీసుకున్నాననే ఆరోపణలను మహువా మొయిత్రా ఖండించారు. అదానీ వ్యవహారాన్ని లేవనెత్తకుండా తన నోరు మూయించడానికి బీజేపీ ప్రభుత్వం సిద్ధపడిందని మహువా మెుయిత్రా ఆరోపించారు. అఫిడవిట్లో పేర్కొన్న విషయాలు హాస్యాస్పదమైన అంశాలుగా పేర్కొన్నారు. బీజేపీ ఐటీ సెల్లో మంచి రచనా నైపుణ్యం కలిగిన మందబుద్ధిగల వ్యక్తిచే ఈ లేఖను రాయించారని దుయ్యబట్టారు. దర్శన్ తనపై నిజంగా ఆరోపణలు చేయాలనుకుంటే మీడియా ముందుకు వస్తారు కానీ ఇలా ఏదో ఒక ఛానల్‌కు లీక్ చేయరని అన్నారు. డబ్బులు తీసుకుని పార్లమెంట్లో ప్రశ్నలు అడిగారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ మహిళా ఎంపీ మహువా మొయిత్రాపై వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ గురువారం సంచలన ఆరోపణలు చేశారు. ప్రధాని మోదీ, ఆదానీ గ్రూప్‌ను అప్రతిష్టపాలు చేయడమే లక్ష్యంగా టీఎంసీ నేత మొయిత్రా కుట్ర పన్నారని దర్శన్ ఆరోపించారు. ఈ మేరకు దర్శన్ సంతకం చేసిన అఫిడవిట్ ఒకటి మీడియాలో ప్రత్యక్షమైంది. దర్శన్ అఫిడవిట్లో ఏముందంటే..? ► నాకు అనుకూలమైన ప్రశ్నలు అడిగేందుకు ఎంపీ అయిన మొయిత్రా నుంచి పార్లమెంట్ లాగిన్ ఐడీ వివరాలను తీసుకున్నాను ► ఇందుకుగాను ఆమె చాలా విలాసవంతమైన ప్రతిఫలాలు పొందారు. లగ్జరీ ఐటెమ్ అడిగేవారు. ఢిల్లీలోని ఆమె తన అధికారిక బంగ్లా ఆధునీకరణ పనులు చేయించుకున్నారు. దేశ, విదేశాల్లో ప్రయాణ ఖర్చులను భరించాలని డిమాండ్‌చేశారు. ► జాతీయస్థాయి నేతగా ఎదగాలని మొయిత్రాకు ఆశ. అందుకే ప్రధాని మోదీ, గౌతమ్ అదానీలను అప్రతిష్టపాలు చేసి ప్రతిష్ట పెంచుకుందామని స్నేహితులను ఉపాయాలు అడిగేవారు. ► పార్లమెంట్లో ఆమె ప్రశ్నలు అడిగేందుకు తగిన సమాచారాన్ని ఆమె పార్లమెంటరీ మెయిల్ ఐడీకి పంపేవాడిని. తర్వాత నేనే నేరుగా ప్రశ్నలు అప్లోడ్ చేసేవాడిని. ► ఆమెకు రాహుల్ గాందీ, శశి థరూర్, పినాకీ మిశ్రా వంటి నేతలతో సత్సంబంధాలు ఉండటంతో నాకూ లాభం ఉంటుందని భావించా. ► ఫైనాన్షియల్ టైమ్స్, న్యూయార్క్ టైమ్స్, బీబీసీ ఇలా ప్రముఖ అంతర్జాతీయ వార్తాసంస్థలకు చెందిన జర్నలిస్టులతో ఆమె మాట్లాడేవారు ► సుచేతా దలాల్, శార్దూల్ ష్రాఫ్‌లతోపాటు మాజీ అదానీ ఉద్యోగులు ఇచ్చిన సమాచారాన్ని విశ్లేషించి ప్రశ్నలు అడిగేవాళ్లం. ఇలా ఉండగా, తన పరువుకు భంగం కలిగేలా మీడియా సంస్థలు వార్తలు ప్రచురించకుండా అడ్డుకోవాలంటూ మొయిత్రా వేసిన పిటిషన్ నేడు ఢిల్లీ హైకోర్టులో విచారణకు రానుంది. లేఖ ఇంకా అందలేదు.: ఎథిక్స్ కమిటీ చీఫ్ వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ లేఖ తనకు ఇంకా అందలేదని ఎథిక్స్ కమిటీ ఛైర్మన్ వినోద్ సోంకర్ శుక్రవారం తెలిపారు. పార్లమెంట్లో ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు తీసుకున్నారనే అంశం తీవ్రమైనదని ఆయన అన్నారు. ఈ వ్యవహారంలో సాక్ష్యాలను కమిటీ పరిశీలిస్తోందని సోంకర్ చెప్పారు. ఆధారాలు సమర్పించాలని ఇరువర్గాలను కోరామని ఆయన వెల్లడించారు. ఇదీ చదవండి: ప్రయోజనం పొంది ప్రశ్నలడిగారు -
కార్పొరేట్ ఆసుపత్రిలో కిడ్నీ రాకెట్: డాక్టర్ల అరెస్ట్
అచ్చం సినిమాల్లో చూపించినట్లే జరిగింది. జబ్బున పడ్డ ఓ డబ్బున్న వ్యక్తికి కిడ్నీ అవసరమైంది. డాక్టర్ల ద్వారా విషయం తెలుసుకున్న బ్రోకర్లు.. డబ్బు అవసరం ఉన్న ఓ మహిళకు వలవేశారు. భారీ మొత్తంలో డీల్ కుదిరింది. ఆమెను రోగి భార్యగా చిత్రీకరించి, అతను చికిత్స పొందుతున్న కార్పొరేట్ ఆసుపత్రిలోనే కిడ్నీ మార్పిడి ఆపరేషన్ కు రంగం సిద్ధం చేశారు. కానీ చివర్లో పోలీసుల ఎంట్రీతో గుట్టు రట్టైంది. ఆసుపత్రి సీఈవో, నలుగు సీనియర్ డాక్టర్లు, రోగి బంధువులు, కిడ్నీ ఇచ్చేందుకు సిద్ధమైన మహిళ సహా మొత్తం 13 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈశాన్య ముంబైలోని ఎల్ హెచ్ హీరానందాని కార్పొరేట్ ఆసుపత్రిలో జరగనున్న అక్రమ కిడ్నీ ఆపరేషన్ ను పువాయి పోలీసులు మంగళవారం రాత్రి అడ్డుకున్నారు. ఆసుపత్రి సీఈవో సుర్జీత్ ఛటర్జీ, సీనియర్ డాక్టర్లయిన అనురాగ్ నాయక్, ముఖేశ్ సేథి, ముఖేశ్ షా, ప్రకాశ్ శెట్టిలతో పాటు 13 మందిని అరెస్టు చేశారు. ముంబై పోలీస్ శాఖ అధికార ప్రతినిధి అశోక్ దుబే కిడ్నీ రాకెట్ వివరాలు వెల్లడించాడు. సూరత్ కు చెందిన వ్యాపారవేత్త బ్రిజ్ కిషోర్ జైస్వాల్ కిడ్నీలు చెడిపోవడంతో ముంబైలోని హీరానందాని ఆసుపత్రిలో చేరాడు. ట్రాన్స్ ప్లాంటేషన్ అవసరమని డాక్టర్లు చెప్పారు. ఆసుపత్రిలోనే తిష్టవేసిన నీలేశ్ కాంబ్లే అనే బ్రోకర్.. జైస్వాల్ కుటుంబీకులను సంప్రదించి కిడ్నీ ఏర్పాటుచేస్తానని భారీ మొత్తామనికి డీల్ కుదుర్చుకున్నాడు. శోభా ఠాకూర్ అలియాస్ రేఖా దేవి అనే మహిళను కిడ్నీ దానానినిక ఒప్పించిన కాంబ్లీ.. అందుకుగానూ ఆమెకు రూ.21 లక్షలు ఇవ్వజూపాడు. తర్వాత.. కిడ్నీ దాత శోభను రోగి జైస్వాల్ భార్యగా డాక్టర్ల ముందు ప్రవేశపెట్టారు. కీలకమైన ఈ ఆపరేషన్ లో దాత రోగి బంధువా? కాదా? అనే విషయాన్ని నిర్ధారించుకోకుండానే డాక్టర్లు ఆపరేషన్ కు రంగం సిద్ధం చేశారు. మహేశ్ తన్నా అనే సామాజిక కార్యకర్త ఈ కిడ్నీ రాకెట్ వ్యవహారంపై పోలీసులకు సమాచారం అందించడంతో గుట్టురట్టైంది. బిసేన్ అనే సూత్రధారి ఆధ్వర్యంలో కిడ్నీ రాకెట్ నడుస్తున్నదన్న పోలీసులు.. ఇప్పటివరకు 100కుపైగా అక్రమ ఆపరేషన్లు నిర్వహించి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. నిందితులైన జైస్వాల్ కొడుకు కిషన్, ప్రధాన ఏజెంట్ కాంబ్లీ, సబ్ ఏజెంట్లు భిజేందర్, భరత్ శర్మ, ఇక్బాల్ సిద్దిఖీ, దాత రేఖ, ఆసుపత్రి సీఈవో, నలుగురు డాక్టర్లు సహా నిందితులందరినీ బుధవారం అంధేరీ కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. వీరిపై మానవ అవయవ మార్పిడి చట్టం-1994 ను అనుసరించి కేసులు నమోదుచేశామని, రేఖ నుంచి 8 లక్షలు రికవరీ చేశామని, ఈ కేసుకు సంబంధించి ఇంకొందరిని విచారిస్తామని పేర్కొన్నారు. కాగా, హీరానందాల్ ఆసుపత్రి యాజమాన్యం మాత్రం భిన్నంగా స్పందించింది. అక్రమ కిడ్నీ ఆపరేషన్ వ్యవహారంపై అంతర్గత దర్యాప్తు చేపడతామని ప్రకటించింది.