కార్పొరేట్ ఆసుపత్రిలో కిడ్నీ రాకెట్: డాక్టర్ల అరెస్ట్ | Kidney Racket in famous Mumbai hospital: 13 arrested including 5 doctors | Sakshi
Sakshi News home page

కార్పొరేట్ ఆసుపత్రిలో కిడ్నీ రాకెట్: డాక్టర్ల అరెస్ట్

Published Wed, Aug 10 2016 10:07 AM | Last Updated on Mon, Sep 4 2017 8:43 AM

కార్పొరేట్ ఆసుపత్రిలో కిడ్నీ రాకెట్: డాక్టర్ల అరెస్ట్

కార్పొరేట్ ఆసుపత్రిలో కిడ్నీ రాకెట్: డాక్టర్ల అరెస్ట్

అచ్చం సినిమాల్లో చూపించినట్లే జరిగింది. జబ్బున పడ్డ ఓ డబ్బున్న వ్యక్తికి కిడ్నీ అవసరమైంది. డాక్టర్ల ద్వారా విషయం తెలుసుకున్న బ్రోకర్లు.. డబ్బు అవసరం ఉన్న ఓ మహిళకు వలవేశారు. భారీ మొత్తంలో డీల్ కుదిరింది. ఆమెను రోగి భార్యగా చిత్రీకరించి, అతను చికిత్స పొందుతున్న కార్పొరేట్ ఆసుపత్రిలోనే కిడ్నీ మార్పిడి ఆపరేషన్ కు రంగం సిద్ధం చేశారు. కానీ చివర్లో పోలీసుల ఎంట్రీతో గుట్టు రట్టైంది. ఆసుపత్రి సీఈవో, నలుగు సీనియర్ డాక్టర్లు, రోగి బంధువులు, కిడ్నీ ఇచ్చేందుకు సిద్ధమైన మహిళ సహా మొత్తం 13 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

ఈశాన్య ముంబైలోని ఎల్ హెచ్ హీరానందాని కార్పొరేట్ ఆసుపత్రిలో జరగనున్న అక్రమ కిడ్నీ ఆపరేషన్ ను పువాయి పోలీసులు మంగళవారం రాత్రి అడ్డుకున్నారు. ఆసుపత్రి సీఈవో సుర్జీత్ ఛటర్జీ, సీనియర్ డాక్టర్లయిన అనురాగ్ నాయక్, ముఖేశ్ సేథి, ముఖేశ్ షా, ప్రకాశ్ శెట్టిలతో పాటు 13 మందిని అరెస్టు చేశారు. ముంబై పోలీస్ శాఖ అధికార ప్రతినిధి అశోక్ దుబే కిడ్నీ రాకెట్ వివరాలు వెల్లడించాడు.

సూరత్ కు చెందిన వ్యాపారవేత్త బ్రిజ్ కిషోర్ జైస్వాల్ కిడ్నీలు చెడిపోవడంతో ముంబైలోని హీరానందాని ఆసుపత్రిలో చేరాడు. ట్రాన్స్ ప్లాంటేషన్ అవసరమని డాక్టర్లు చెప్పారు. ఆసుపత్రిలోనే తిష్టవేసిన నీలేశ్ కాంబ్లే అనే బ్రోకర్.. జైస్వాల్ కుటుంబీకులను సంప్రదించి కిడ్నీ ఏర్పాటుచేస్తానని భారీ మొత్తామనికి డీల్ కుదుర్చుకున్నాడు. శోభా ఠాకూర్ అలియాస్ రేఖా దేవి అనే మహిళను కిడ్నీ దానానినిక ఒప్పించిన కాంబ్లీ.. అందుకుగానూ ఆమెకు రూ.21 లక్షలు ఇవ్వజూపాడు.

తర్వాత.. కిడ్నీ దాత శోభను రోగి జైస్వాల్ భార్యగా డాక్టర్ల ముందు ప్రవేశపెట్టారు. కీలకమైన ఈ ఆపరేషన్ లో దాత రోగి బంధువా? కాదా? అనే విషయాన్ని నిర్ధారించుకోకుండానే డాక్టర్లు ఆపరేషన్ కు రంగం సిద్ధం చేశారు. మహేశ్ తన్నా అనే సామాజిక కార్యకర్త ఈ కిడ్నీ రాకెట్ వ్యవహారంపై పోలీసులకు సమాచారం అందించడంతో గుట్టురట్టైంది.

బిసేన్ అనే సూత్రధారి ఆధ్వర్యంలో కిడ్నీ రాకెట్ నడుస్తున్నదన్న పోలీసులు.. ఇప్పటివరకు 100కుపైగా అక్రమ ఆపరేషన్లు నిర్వహించి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. నిందితులైన జైస్వాల్ కొడుకు కిషన్, ప్రధాన ఏజెంట్ కాంబ్లీ, సబ్ ఏజెంట్లు భిజేందర్, భరత్ శర్మ, ఇక్బాల్ సిద్దిఖీ, దాత రేఖ, ఆసుపత్రి సీఈవో, నలుగురు డాక్టర్లు సహా నిందితులందరినీ బుధవారం అంధేరీ కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. వీరిపై మానవ అవయవ మార్పిడి చట్టం-1994 ను అనుసరించి కేసులు నమోదుచేశామని, రేఖ నుంచి 8 లక్షలు రికవరీ చేశామని, ఈ కేసుకు సంబంధించి ఇంకొందరిని విచారిస్తామని పేర్కొన్నారు. కాగా, హీరానందాల్ ఆసుపత్రి యాజమాన్యం మాత్రం భిన్నంగా స్పందించింది. అక్రమ కిడ్నీ ఆపరేషన్ వ్యవహారంపై అంతర్గత దర్యాప్తు చేపడతామని ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement