దర్శన్ అఫిడవిట్ పీఎంవో పనే: మహువా మొయిత్రా | PMO forced Hiranandani to make affidavit: Mahua Moitra | Sakshi
Sakshi News home page

దర్శన్ అఫిడవిట్ పీఎంవో పనే: మహువా మొయిత్రా

Published Fri, Oct 20 2023 8:08 AM | Last Updated on Fri, Oct 20 2023 9:46 AM

Mahua Moitra Says Hiranandani Affidavit Made By PMO By  Force - Sakshi

ఢిల్లీ: మీడియాలో బహిర్గతమైన వ్యాపారవేత్త దర్శన్‌ హీరానందానీ అఫిడవిట్‌ వ్యవహారంపై ఎంపీ మహువా మొయిత్రా సంచలన ఆరోపణలు చేశారు. ప్రధానమంత్రి కార్యాలయం దర్శన్‌పై ఒత్తిడి చేసి తెల్లకాగితంపై సంతకం చేయించారని ఆరోపించారు. పీంవోనే ఓ తెల్లకాగితంపై రాసి మీడియాకు లీక్ చేశారని అన్నారు. పార్లమెంటు ఎథిక్స్ కమిటీకి సమర్పించిన అఫిడవిట్ విశ్వసనీయతపై ఆమె అనుమానం వ్యక్తం చేశారు. అఫిడవిట్ లెటర్ హెడ్ లేని తెల్ల కాగితంపై ఉందని అన్నారు. అధికారికంగా విడుదల చేయలేదని చెప్పారు. 

'వ్యాపార వేత్తగా కొనసాగుతున్న దర్శన్‌కు పీఎంతో పాటు మంత్రులందర్ని కలవగల సమర్ధత ఉంది. అలాంటప్పుడు పార్లమెంట్‌లో ప్రశ్నలు అడగడానికి మొదటిసారి ప్రతిపక్ష ఎంపీగా కొనసాగుతున్న నాకు ఎందుకు లంచం ఇస్తారు? ఇది పూర్తిగా అసత్యం. ఈ లేఖను దర్శన్ కాకుండా పీఎంవోనే రాసింది. దర్శన్‌, ఆయన తండ్రిపై పీఎంవో బెదిరింపులకు పాల్పడింది. లేఖపై సంతకం చేయడానికి 20 నిమిషాలు సమయం ఇచ్చారు.' అని పేర్కొంటూ తాను దర్శన్ నుంచి లంచం తీసుకున్నాననే ఆరోపణలను మహువా మొయిత్రా  ఖండించారు.

అదానీ వ్యవహారాన్ని లేవనెత్తకుండా తన నోరు మూయించడానికి బీజేపీ ప్రభుత్వం సిద్ధపడిందని మహువా మెుయిత్రా ఆరోపించారు. అఫిడవిట్‌లో పేర్కొన్న విషయాలు హాస్యాస్పదమైన అంశాలుగా పేర్కొన్నారు. బీజేపీ ఐటీ సెల్‌లో మంచి రచనా నైపుణ్యం కలిగిన మందబుద్ధిగల వ్యక్తిచే ఈ లేఖను రాయించారని దుయ్యబట్టారు. దర్శన్ తనపై నిజంగా ఆరోపణలు చేయాలనుకుంటే మీడియా ముందుకు వస్తారు కానీ ఇలా ఏదో ఒక ఛానల్‌కు లీక్ చేయరని అన్నారు. 

డబ్బులు తీసుకుని పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్‌ కాంగ్రెస్‌ మహిళా ఎంపీ మహువా మొయిత్రాపై వ్యాపారవేత్త దర్శన్‌ హీరానందానీ గురువారం సంచలన ఆరోపణలు చేశారు. ప్రధాని మోదీ, ఆదానీ గ్రూప్‌ను అప్రతిష్టపాలు చేయడమే లక్ష్యంగా టీఎంసీ నేత మొయిత్రా కుట్ర పన్నారని దర్శన్‌ ఆరోపించారు. ఈ మేరకు దర్శన్‌ సంతకం చేసిన అఫిడవిట్‌ ఒకటి మీడియాలో ప్రత్యక్షమైంది.

దర్శన్ అఫిడవిట్‌లో ఏముందంటే..?
► నాకు అనుకూలమైన ప్రశ్నలు అడిగేందుకు ఎంపీ అయిన మొయిత్రా నుంచి పార్లమెంట్‌ లాగిన్‌ ఐడీ వివరాలను తీసుకున్నాను
► ఇందుకుగాను ఆమె చాలా విలాసవంతమైన ప్రతిఫలాలు పొందారు. లగ్జరీ ఐటెమ్‌ అడిగేవారు. ఢిల్లీలోని ఆమె తన అధికారిక బంగ్లా ఆధునీకరణ పనులు చేయించుకున్నారు. దేశ, విదేశాల్లో ప్రయాణ ఖర్చులను భరించాలని డిమాండ్‌చేశారు.
► జాతీయస్థాయి నేతగా ఎదగాలని మొయిత్రాకు ఆశ. అందుకే ప్రధాని మోదీ, గౌతమ్‌ అదానీలను అప్రతిష్టపాలు చేసి ప్రతిష్ట పెంచుకుందామని స్నేహితులను ఉపాయాలు అడిగేవారు.  
► పార్లమెంట్‌లో ఆమె ప్రశ్నలు అడిగేందుకు తగిన సమాచారాన్ని ఆమె పార్లమెంటరీ మెయిల్‌ ఐడీకి పంపేవాడిని. తర్వాత నేనే నేరుగా ప్రశ్నలు అప్‌లోడ్‌ చేసేవాడిని.
► ఆమెకు రాహుల్‌ గాందీ, శశి థరూర్, పినాకీ మిశ్రా వంటి నేతలతో సత్సంబంధాలు ఉండటంతో నాకూ లాభం ఉంటుందని భావించా.
► ఫైనాన్షియల్‌ టైమ్స్, న్యూయార్క్‌ టైమ్స్, బీబీసీ ఇలా ప్రముఖ అంతర్జాతీయ వార్తాసంస్థలకు చెందిన జర్నలిస్టులతో ఆమె మాట్లాడేవారు
► సుచేతా దలాల్, శార్దూల్‌ ష్రాఫ్‌లతోపాటు మాజీ అదానీ ఉద్యోగులు ఇచ్చిన సమాచారాన్ని విశ్లేషించి ప్రశ్నలు అడిగేవాళ్లం. ఇలా ఉండగా, తన పరువుకు భంగం కలిగేలా మీడియా సంస్థలు వార్తలు ప్రచురించకుండా అడ్డుకోవాలంటూ మొయిత్రా వేసిన పిటిషన్‌ నేడు ఢిల్లీ హైకోర్టులో విచారణకు రానుంది.

లేఖ ఇంకా అందలేదు.: ఎథిక్స్ కమిటీ చీఫ్

వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ లేఖ తనకు ఇంకా అందలేదని ఎథిక్స్ కమిటీ ఛైర్మన్ వినోద్ సోంకర్ శుక్రవారం తెలిపారు. పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు తీసుకున్నారనే అంశం తీవ్రమైనదని ఆయన అన్నారు. ఈ వ్యవహారంలో సాక్ష్యాలను కమిటీ పరిశీలిస్తోందని సోంకర్ చెప్పారు. ఆధారాలు సమర్పించాలని ఇరువర్గాలను కోరామని ఆయన వెల్లడించారు.

ఇదీ చదవండి: ప్రయోజనం పొంది ప్రశ్నలడిగారు


 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement