‘సహనం’పైనా అసత్యాలేనా?
భారతీయులు దురాక్రమణకు గురవుతూ వచ్చారే కానీ, వారెన్నడూ ఇతర దేశాలపై దండెత్తలేదు అనే భావాన్నీ, తమను జయించిన వారి పట్ల కూడా సహన భావం ప్రదర్శిస్తున్న ఏకైక జాతి భారతీయులే అనే భావాన్నీ చారిత్రక వాస్తవాలు పూర్వపక్షం చేస్తున్నాయి. కానీ చాలా మంది భారతీయులు చివరికి కేంద్ర కేబినెట్లోని మంత్రులు కూడా మరీ చిన్న పిల్లల స్థాయి అమాయకత్వంతో కూడిన ఇలాంటి కల్పిత భావనలను నేటికీ విశ్వసిస్తుండటమే ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది.
మన జాతి గురించీ, మన గురించీ చాలామంది భారతీయుల్లో పాతుకుపోయి ఉన్న రెండు బలమైన విశ్వాసాలపై నేను రాయాలనుకున్నాను. ఇవే అభిప్రాయాలను కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కూడా కొద్ది రోజుల క్రితం ఒక కార్యక్రమంలో పునరుద్ఘాటించారు. ఆయనిలా చెప్పారు. ‘‘ప్రస్తుతం దేశంలో ఒక కొత్త ధోరణిని చూస్తున్నాం. దేశంలో సహనభావం తగ్గిపోతోందని వారంటున్నారు.
కానీ ప్రపంచంలోనే సహనాన్ని పాటిస్తున్న ఏకైక దేశం ఇండియా. నూరు శాతం కాకున్నా 99 శాతం వరకు సహనాన్ని మనం పాటిస్తున్నాం’’ అంటూనే వెంకయ్య మరిన్ని మాటల్ని జోడించారు. ‘‘మీరు చరిత్రకేసి చూసినట్లయితే, ఇండియా అనేక దేశాల దురాక్రమణకు గురవుతూ వచ్చింది కానీ, ఒక్కటంటే ఒక్క దేశం పైన అయినా భారత్ దండెత్తిన, దురాక్రమించిన ఘటన లేనే లేదు. భారతీయులకు అలాంటి వైఖరి లేదు కూడా. అన్ని మతాలనూ మనం గౌరవిస్తున్నాం. అదే భారత్ గొప్పతనం. భారతీయుల రక్తంలోనే సహనభావం ఇంకిపోయి ఉంది.’’
భారతీయులు అనేకమంది పై రెండు విశ్వాసాలను కలిగి ఉన్నారు. మొదటిదాన్ని చూస్తే ఇండియా ఎప్పటికీ దురాక్రమణకు గురవుతూనే వచ్చింది కానీ భారతీయులు ఎన్నడూ ఏ దేశాన్నీ దురాక్రమించలేదు. ఇక రెండో భావన ఏమిటంటే, భారతీయులు అంటే పై సందర్భంలో హిందువులు విశిష్టమైనవారు. ఎందుకంటే మనకు సహనభావం ఉంది కనుక. మన మధ్యే జీవిస్తూ ఉన్న మన విజేత పట్ల కూడా మనం సహనభావం ప్రదర్శిస్తున్నాం కనుక.
పైన ప్రస్తావించిన వాటిలో రెండో విశ్వాసాన్ని మనం మొదట చూద్దాం. మనకు జరిగిన అనుభవాలనే అనేక ఇతర దేశాలు కూడా పొంది ఉన్నాయి. ఉత్తర భారతదేశాన్ని ముస్లింలు జయించిన శతాబ్దంలోనే అంటే 1066వ సంవత్సరంలో ఇంగ్లండ్‌ను ఫ్రెంచ్ వాళ్లు జయించారు. ఇండియాలా కాకుండా, ఇంగ్లండు భూస్వామ్య కులీనవర్గం, ఉన్నత వర్గాల్లోని అధికశాతం విదేశీ మూలాలు కలిగిన వారే. క్వీన్ ఎలిజిబెత్ సైతం శాక్సె-కోబర్గ్ గోథా రాజవంశానికి చెందినవారు.
పేరు సూచిస్తున్నట్లుగా ఆమె ఇంగ్లిష్ వ్యక్తి కాదు. జర్మన్ మూలానికి చెందింది. జర్మన్ వ్యతిరేక మనోభావాలు పెచ్చరిల్లిన కారణంగా ప్రపంచ యుద్ధ కాలంలోనే ఆమెకున్న జర్మనీ పేరు పక్కకు వెళ్లి విండ్సార్ అనే బ్రిటిష్ పేరు వచ్చి చేరింది. అయితే ఇంగ్లండ్ కులీనవర్గాలు తమ విదేశీ మూలాలను ఎంతో ఆత్మగౌరవంతో అట్టిపెట్టుకున్నారు. తమ విదేశీ మూలాన్ని వారెన్నడూ తప్పుగా భావించలేదు. ఆ తర్వాత 200 సంవత్సరాలకు కుబ్లయ్ ఖాన్ పాలనలో మంగోలులు చైనాను జయించి తమ భూభాగంలో కలిపేసుకున్నారు. మంగోల్ యువాన్ రాజవంశాన్ని చైనా ప్రజలు గొప్పగా తలుచుకుంటారు. ఇక ఉత్తర ఆఫ్రికా అయితే క్రీస్తు పూర్వం 450 (హెరొడోటస్ చరిత్రపై తొలి పుస్తకం రాసిన కాలం) లేదా అంతకు మునుపటి కాలం నుంచే వివిధ జాతుల కలయిక నుంచి రూపొందింది.
ఇక టర్కీని మధ్య ఆసియా టర్కులు జయించారు. గ్రీకులతోపాటు వివిధ జాతుల ప్రజలు ఇక్కడ నివసించేవారు. టర్కీని అనటోలియా అని పిలిచేవారు. గ్రీకు భాషలో అనటోల్ అంటే తూర్పు అని అర్థం. దీని కారణంగా సైప్రస్ అర్ధ టర్కిష్ గానూ అర్ధ గ్రీకుగాను ఉంటోంది. మన భారత, పాకిస్తాన్ దేశాలకు మల్లే ఈ రెండు దేశాల ప్రజలు కూడా ఇరుగుపొరుగునే జీవిస్తున్నారు పైగా వారిలో ఎవరికీ అపరాధ భావన లేదు.
హంగరీ పేరు హున్స్ నుంచి వచ్చింది. వీరు మధ్యాసియాకు చెందిన గిరిజన తెగ ప్రజలు. వీరు హంగరీని జయించి యూరోపియన్లతో కలిసిపోయారు. హంగేరియన్ అనేది ఇండో యూరోపియన్ భాష కాదు. గ్రీకులు శతాబ్దాలపాటు ఈజిప్ట్‌ను పాలించడమే కాకుండా వారితో కలసి జీవించారు. (ఈజిఫ్టు చివరి రాణి క్లియోపాత్రా వాస్తవానికి గ్రీకు మాట్లాడేది.) ఇవి చరిత్రకు సంబంధించి నా జ్ఞాపకాలలోంచి నేను ఇచ్చిన కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇంకా ఇలాంటి ఉదాహరణలు చాలానే ఉన్నాయి. కాబట్టి మనకు సహనభావం ఉంది లేదా మనల్ని జయించిన విజేతలతో కూడా కలసి జీవించాము కాబట్టి మనది అసాధారణ జాతి లేదా విశిష్టమైన జాతి అని వెంకయ్య నాయుడు చెప్పిన మాట శుద్ధ తప్పు.
ఇక రెండో విషయాన్ని, అంటే భారతీయులు ఎన్నడూ మరో దేశాన్ని ఆక్రమించలేదు అనే కల్పిత గాథను చూద్దాం. దీనికి సంబంధించి మనం చరిత్రలో ఎంతో వెనక్కు వెళ్లాల్సిన అవసరం లేదు. భారతీయ చక్రవర్తి రంజిత్ సింగ్ సేనానులు అతడి పాలనా కాలపు చివరి రోజుల్లో కాబూల్‌ను ఆక్రమించారు. అయితే రంజిత్ సింగ్ తనను తాను ఇండియన్‌గా కాకుండా పంజాబీలాగే భావించుకునేవాడు. ఎందుకంటే ఇండియా జాతీయ రాజ్యంగా మారకముందే ఇది జరిగింది. కాని ఇదేమంత పెద్ద విషయం కాదు. అశోక చక్రవర్తి కాందహార్‌లో సుప్రసిద్ధ స్తూపాన్ని నిర్మించాడు. ఇది ఆయన గౌరవార్థం అక్కడ నిర్మించి ఉంటారంటే నాకు సందేహమే. అశోకుడు కాందహార్‌పై దాడి చేసి ఉంటాడు లేక అఫ్ఘానిస్తాన్ లొంగిరాకపోతే దాడి చేస్తానని బెదిరించి ఉండవచ్చు కూడా.
అఫ్ఘానిస్తాన్ కూడా ఇండియాలో భాగమేనని కొంతమంది చెప్పవచ్చు. దీనికి నేను చెప్పేది ఒకటే. మహమ్మద్ గజనీ నుంచి ఇబ్రహీం లోడీ, షేర్ ఖాన్ సూర్ల వరకు ఉత్తర భారతదేశంలో అఫ్ఘాన్ విజయాల చరిత్రను చూసినట్లయితే ఇండియాయే అఫ్ఘానిస్తాన్‌లో భాగమని కూడా చెప్పవచ్చు మరి. నేను చెప్పే ముఖ్య విషయం ఏమిటంటే, హిందువులు శాంతికాముకులు, ఉదార స్వభావులు అని చెప్పే భావన ఆధునికమైన దేకావచ్చు. మన రక్తాన్ని మనమే చిందించడం మనకెప్పుడూ ఒక సమస్య కాలేదు. ఉదాహరణకు మరాఠాలు గుజరాత్‌ను జయించారు. వారు ఇప్పటికీ బరోడాపై పట్టు కలిగి ఉన్నారు. ఇది శాంతియుతమైన లేక ప్రజాస్వామికమైన ఆక్రమణ అయితే కాదు.
అశోకుడు కళింగ దేశాన్ని నేలమట్టం చేశాడు. వేలాది ఒరియా ప్రజలను ఊచకోత కోశాడు. ఏ ఒక్కరూ ఈ అభిప్రాయంతో విభేదించరనుకుంటాను. చైనా, బర్మా, ఆస్ట్రేలియా వంటి దేశాలపై దాడి చేయకుండా అతడిని అడ్డుకున్నది సహనభావం కాదు, ఆ దేశాలకు వెళ్లడానికి అశోకుడికి వీసా లేకపోవడం అసలే కాదు. అవి మనకు సహజ సిద్ధమైన సరిహద్దులు. విదేశాన్ని లేక ఉపఖండేతర భూభాగాన్ని జయించడానికి ఉత్తర భారత రాజవంశాలకు భౌగోళిక పరమైన అవకాశం చాలా తక్కువగా ఉండేది.
ఇక దక్షిణాదికి వస్తే ఇతర ఉదాహరణలు ఉన్నాయి. ఉత్తర భారతదేశం ముస్లింల ఆక్రమణకు, ఇంగ్లండ్ దేశం ఫ్రాన్స్ ఆక్రమణకు గురవుతున్న కాలంలోనే, చోళరాజుల పాలనలో తమిళ జాతీయులు ఆగ్నేయాసియా ప్రాంతం పై దండెత్తి ఆక్రమించారు. ఎందుకంటే నావికా బల సామర్థ్యం ఉన్న అతి కొద్ది భారతీయ రాజరికాల్లో చోళులూ ఒకరు.
ఇంతవరకు ఇక్కడ ప్రస్తావించిన విషయాలు చరిత్రలో తేలినవే. నేను ఒక్కటీ కొత్తగా చెప్పింది లేదు. కానీ చరిత్ర చెప్పే ఈ చేదు వాస్తవాలను పక్కన బెట్టి చాలా మంది భారతీయులు చివరికి కేంద్ర కేబినెట్లోని మంత్రులు కూడా మరీ చిన్న పిల్లల అమాయకత్వంతో కూడిన ఇలాంటి కల్పితగాథలను నేటికీ విశ్వసిస్తుండటమే ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది.
(వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com)
- ఆకార్ పటేల్