HMA
-
మళ్లీ ఐపీవోల స్పీడ్
న్యూఢిల్లీ: ఆటుపోట్ల మధ్య స్టాక్ మార్కెట్లు బలపడుతుండటంతో ప్రైమరీ మార్కెట్లకు మళ్లీ కళ వస్తోంది. తాజాగా మూడు కంపెనీలు పబ్లిక్ ఇష్యూలు చేపట్టేందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. నిధుల సమీకరణ చేపట్టనున్న జాబితాలో జ్యువెలరీ రిటైల్ కంపెనీ సెన్కో గోల్డ్ లిమిటెడ్, ఎలక్ట్రానిక్ సబ్‌సిస్టమ్స్, కేబుళ్ల(ఎలక్ట్రానిక్) తయారీ సంస్థ డీసీఎక్స్ సిస్టమ్స్, మాంసం(ఫ్రోజెన్) ఎగుమతుల కంపెనీ హెచ్ఎంఏ ఆగ్రో ఇండస్ట్రీస్ చేరాయి. ఈ కంపెనీలు ఐపీవోలు చేపట్టేందుకు వీలుగా మార్చి, ఏప్రిల్ నెలల్లోనే సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌లను దాఖలు చేశాయి. ప్రాస్పెక్టస్‌ల ప్రకారం మూడు కంపెనీలూ ఉమ్మడిగా రూ. 1,605 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉన్నాయి. సెన్కో గోల్డ్ ఐపీవోలో భాగంగా సెన్కో గోల్డ్ రూ. 325 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా కంపెనీ వాటాదారు సైఫ్ పార్టనర్స్ ఇండియా 4 లిమిటెడ్ మరో రూ. 200 కోట్ల విలువైన షేర్లను విక్రయానికి ఉంచనుంది. వెరసి కంపెనీ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 525 కోట్లు సమకూర్చుకోనుంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 240 కోట్లను వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. ప్రస్తుతం కంపెనీ 127 షోరూమ్‌లను నిర్వహిస్తోంది. వీటిలో 70 సొంతంకాగా.. మరో 57 ఫ్రాంచైజీలు. ఆన్లైన్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా సైతం ప్రొడక్టులను విక్రయిస్తోంది. జ్యువెలరీని దుబాయ్, మలేసియా, సింగపూర్‌లకు ఎగుమతి చేస్తోంది. డీసీఎక్స్ సిస్టమ్స్ పబ్లిక్ ఇష్యూ ద్వారా డీసీఎక్స్ సిస్టమ్స్ రూ. 600 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉంది. ఇందుకు అనుగుణంగా రూ. 500 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుండగా.. మరో రూ. 100 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్ సంస్థలు ఎన్‌సీబీజీ హోల్డింగ్స్, వీఎన్‌జీ టెక్నాలజీ ఆఫర్ చేయనున్నాయి. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, సొంత అనుబంధ సంస్థ రేనియల్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్‌లో పెట్టుబడులు తదితరాలకు వినియోగించనుంది. కంపెనీ ప్రధానంగా సిస్టమ్ ఇంటిగ్రేషన్‌తోపాటు వివిధ ఎలక్ట్రానిక్ కేబుళ్లు, అసెంబ్లీలను రూపొందిస్తోంది. హెచ్ఎంఏ ఆగ్రో ఐపీవో ద్వారా హెచ్ఎంఏ ఆగ్రో ఇండస్ట్రీస్ రూ. 480 కోట్ల నిధులను సమకూర్చుకునే యోచనలో ఉంది. ఇందుకు వీలుగా రూ. 150 కోట్ల ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. మరో రూ. 330 కోట్ల షేర్లను ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. ఐపీవో నిధుల్లో రూ. 135 కోట్లను వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. ఆగ్రా కేంద్రంగా పనిచేస్తున్న కంపెనీ ఘనీభవించిన ఎద్దు మాంసంతో కూడిన ప్రొడక్టులను 40 దేశాలకుపైగా ఎగుమతి చేస్తోంది. అమ్మకాలలో 90 శాతం ఎగుమతుల ద్వారానే సమకూరుతోంది. -
రూ. 480 కోట్ల సమీకరణలో హెచ్ఎంఏ ఆగ్రో
న్యూఢిల్లీ: ఫ్రోజెన్ మాంసం ఎగుమతిదారు హెచ్ఎంఏ ఆగ్రో ఇండస్ట్రీస్ .. ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) ద్వారా రూ. 480 కోట్లు సమీకరించనుంది. ఇందుకు సంబంధించిన ముసాయిదా పత్రాలను (డీఆర్‌హెచ్‌పీ) మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించింది. కొత్తగా షేర్ల జారీ ద్వారా రూ. 150 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానంలో ప్రమోటర్ల షేర్ల విక్రయం ద్వారా దాదాపు రూ. 330 కోట్లు సమీకరించనున్నట్లు సంస్థ పేర్కొంది. డీఆర్‌హెచ్‌పీ ప్రకారం ఓఎఫ్ఎస్లో భాగంగా ప్రమోటర్లయిన వాజిద్ అహ్మద్ రూ. 120 కోట్లు విలువ చేసే షేర్లు, గుల్జార్ అహ్మద్, మెహ్మూద్ ఖురేషి తదితరులు తలో రూ. 49 కోట్లు విక్రయించనున్నారు. ఐపీవో ద్వారా సమీకరించిన నిధుల్లో రూ. 135 కోట్లను .. వర్కింగ్ క్యాపిటల్ తదితర అవసరాల కోసం కంపెనీ వినియోగించుకోనుంది. హెచ్ఎంఏ ఆగ్రో ఇండస్ట్రీస్ దాదాపు 40 దేశాలకు మాంసం ఎగుమతి చేస్తోంది. ఆదాయంలో 90 శాతం వాటా ఎగుమతులదే ఉంటోంది. గత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ. 1,720 కోట్లు కాగా రూ. 73 కోట్ల లాభం నమోదు చేసింది. -
15 రకాల వస్తు దిగుమతులను నివారించొచ్చు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి పిలుపునిచ్చిన ఆత్మ నిర్భర్ (స్వీయ సమృద్ధి) సాధన కోసం భారీగా దిగుమతి చేసుకుంటున్న 15 వస్తువులను అసోచామ్ గుర్తించింది. దేశీయంగా ఉత్పత్తిని పెంచడం ద్వారా వీటి విషయంలో స్వావలంబన సాధించొచ్చని పేర్కొంది. వీటిల్లో ఎలక్ట్రానిక్స్, బొగ్గు, ఐరన్–స్టీల్, నాన్ ఫెర్రస్ మెటల్స్, వంటనూనెలు, తదితర ఉత్పత్తులున్నాయి. ప్రతి నెలా 5 బిలియన్ డాలర్ల విలువైన (37,500 కోట్లు) ఈ వస్తువులను దిగుమతి చేసుకుంటున్నామని.. విదేశీ మారక నిల్వలకు భారీగా చిల్లు పెడుతున్న ఈ దిగుమతులకు వెంటనే కళ్లెం వేయాలని అసోచామ్ సూచించింది. దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమల్లో ఉన్న మే నెలలో 2.8 బిలియన్ డాలర్ల విలువైన (రూ.21,000 కోట్లు) ఎలక్ట్రానిక్ వస్తు దిగుమతులు నమోదయ్యాయి. హెచ్ఎంఏ ప్రెసిడెంట్‌గా సంజయ్ కపూర్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (హెచ్ఎంఏ) నూతన ప్రెసిడెంట్‌గా సంజయ్ కపూర్ ఎన్నికయ్యారు. 2020–21 కాలానికి ఆయన ఈ పదవిలో ఉంటారు. పలు మల్టీనేషనల్ కంపెనీలకు ఆయన కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తున్నారు. -
బీవీఆర్ మోహన్ రెడ్డికి జీవన సాఫల్య పురస్కారం
హైదరాబాద్‌లో గురువారం జరిగిన ఒక కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు చేతుల మీదుగా హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (హెచ్ఎంఏ) లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు-2015ను అందుకుంటున్న సైయంట్ వ్యవస్థాపకుడు, నాస్కామ్ చైర్మన్ బీవీఆర్ మోహన్ రెడ్డి. -
‘మాస్టర్ ’కు మళ్లీ మార్పులు
ఐటీఐఆర్ కోసం హెచ్ఎండీఏ కసరత్తు ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు తాజా ప్రతిపాదన కేంద్ర నిధుల కోసం సర్కార్ ఆరాటం సాక్షి, సిటీబ్యూరో : హెచ్ఎండీఏ విస్తరిత ప్రాంతానికి ప్రస్తుతం అమల్లో ఉన్న మాస్టర్ ప్లాన్ త్వరలో కొత్త రూపు సంతరించుకోనుంది. ఐటీఐఆర్ ప్రాజెక్టుకనుగుణంగా మాస్టర్ ప్లాన్‌ను సవరించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. ఈమేరకు మాస్టర్ ప్లాన్‌లో మళ్లీ మార్పులు చేసేందుకు హెచ్ఎండీఏ సన్నద్ధమైంది. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టుకునేందుకు వీలుగా ఐటీఐఆర్‌కు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించడంతో ఆ మేరకు కసరత్తు మొదలైంది. నగర పరిధిలో ఇప్పటికే ఉన్న ఏడు మాస్టర్ ప్లాన్లను ఒకే గొడుగు కిందకు తెస్తూ హెచ్ఎండీఏ రూపొందించిన బృహత్ ప్రణాళికను ఏడాది క్రితం ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. కాగా మరోమారు మార్పులకు శ్రీకారం చుట్టారు. వాస్తవానికి హెచ్ఎండీఏ యాక్టు ప్రకారం... మహా నగరంలో మరో అథార్టీ ఉండకూడదు. ఇప్పటికే హెచ్ఎండీఏ రూపొందించి అమలు చేస్తున్న విస్తరిత ప్రాంత మాస్టర్‌ప్లాన్‌లో ఐటీఐఆర్‌కు ప్రత్యేకంగా భూముల కేటాయింపు జరగలేదు. అదే ఇప్పుడు ఈ మెగా ప్రాజెక్టుకు ప్రతిబంధకంగా మారింది. ఐటీఐఆర్ ప్రాజెక్టుతో ‘మహా’ నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలని యోచిస్తోన్న ప్రభుత్వానికి మాస్టర్‌ప్లాన్ సవరణ ఇప్పుడు ఓ సవాల్‌గా మారింది. నగరం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ గ్రోత్ కారిడార్ లోపల సుమారు 202 చ.కి.మీ. మేర 5 జోన్లలో ఐటీఐఆర్ ప్రాజెక్టుల ఏర్పాటుకు సీఎం ప్రత్యేక శ్రద్ధ చూపుతుండటంతో మాస్టర్ ప్లాన్‌లో మార్పులు అనివార్యమయ్యాయి. ఫంక్షనల్ యూనిట్.. ఐటీఐఆర్ కు ప్రత్యేకంగా మాస్టర్‌ప్లాన్ రూపొందించాలంటే సాంకేతికంగా ఇబ్బందులతో కూడుకున్న అంశం. అయితే ఇది జరగాలంటే ప్రత్యేకంగా ఓ ఫంక్షనల్ యూనిట్‌ను ఏర్పాటు చేసి దానికింద ఐటీఐఆర్‌ను పెట్టవచ్చని హెచ్ ఎండీఏ అధికారుల పరిశీలనలో తేలింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు చేసి హెచ్ఎండీఏ పరిధిలోనే ఉంచాలని నిర్ణయించారు. ఈ కమిటీకి హెచ్ఎండీఏ కమిషనర్ చైర్మన్‌గా, ఐటీ సెక్రటరీ కన్వీనర్‌గా, ఫైనాన్స్, ఎంఏ అండ్ యూడీ, టీఎస్ఐఐసీ, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, ఇరిగేషన్, పీసీబీ, జీహెచ్ఎంసీ, జలమండలి విభాగాల ఉన్నతాధికారులను సభ్యులుగా ప్రతిపాదిస్తూ హెచ్ఎండీఏ ఇటీవల ప్రభుత్వానికి ఓ ప్రతిపాదన పంపింది. దీనిపై ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే కొత్త కమిటీ ఏర్పాటవుతుందని అధికారులు చెబుతున్నారు. అనంతరం ఈ కమిటీ రంగంలోకి దిగి ఐటీఐఆర్ కింద ప్రాజెక్టులు ఎక్కడెక్కడ వస్తాయి ? వాటి సరిహద్దులు, సర్వే నంబర్లు వంటివాటిని గుర్తించాల్సి ఉంటుంది. ఆమేరకు ప్రస్తుతం ఉన్న మాస్టర్‌ప్లాన్‌లో కొన్ని మార్పులు చేసి సవరించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ వేగవంతంగా జరగాలంటే ఫంక్షనల్ యూనిట్ ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి అనుమతి రావాలని అధికారులు పేర్కొంటున్నారు. మార్పులు అనివార్యం.. హెచ్ఎండీఏ మాస్టర్‌ప్లాన్‌లో ఐటీఐఆర్ కోసం ప్రత్యేకంగా భూ వినియోగాన్ని ప్రతిపాదించక పోవడం వల్లే ఇప్పుడు మార్పులు, సవరణలు అనివార్యమయ్యాయి. నివాస, వాణిజ్య, పబ్లిక్, సెమీ పబ్లిక్, మల్టీపుల్ జోన్లలో ఐటీఐఆర్‌కు అనుమతి ఉంది. నిజానికి ఇవి కాలుష్యరహితమైన సంస్థలు కాబట్టి అన్నింట్లో అనుమతిస్తామని హెచ్ఎండీఏ అధికారులు చెబుతున్నారు. అయితే... ఐటీఐఆర్‌కు అనుగుణంగా భూ వినియోగం ఉండాలి గనుక ప్రభుత్వ అనుమతితో ప్రణాళికలో మళ్లీ మార్పులు చేయాల్సి ఉంటుందంటున్నారు. ఇప్పటికే కేంద్రం ప్రకటించిన ఐటీఐఆర్ ప్రాజెక్టులు ఒక్క మహేశ్వరం మండలంలో తప్ప మిగతావన్నీ ఔటర్ రింగ్‌రోడ్డు లోపలే ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటిలో అవసరమైన మార్పులు చేయడం పెద్ద సమస్యేమీ కాదని, ప్రభుత్వ నుంచి అనుమతి వస్తే వెంటనే పని ప్రారంభించి మాస్టర్‌ప్లాన్‌లో మార్పులు చేసేందుకు పక్కా గా ఏర్పాట్లు చేశామని అధికారులు చెబుతున్నారు.