నైపుణ్యమున్న కార్మికులను దుబాయ్‌కి పంపిస్తాం
హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి
మాదాపూర్:న్యాక్‌లో శిక్షణ పొందిన కార్మికులను ప్రభుత్వ సహాయంతో దుబాయ్‌కి పంపిస్తామని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి చెప్పారు. మాదాపూర్‌లోని న్యాక్‌లో గురువారం నిర్వహించిన స్కిల్ డెవలప్మెంట్ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నైపుణ్యమున్న కార్మికులను దుబాయ్‌కి పంపిస్తామని, ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. కార్మికులు దుబాయ్‌లో ఇక్కడి ప్రభుత్వ ఉద్యోగి పర్యవేక్షణలో ఉంటారని చెప్పారు.
న్యాక్‌లో శిక్షణ పొంది ఉద్యోగాలు సంపాదించిన యువకులు వాటిని నిలబెట్టుకోవాలన్నారు. ప్రతి ఏడాది కన్స్ట్రక్షన్ బోర్డు నుంచి న్యాక్‌కు రూ.10 కోట్లు ఇవ్వాలని సీఎం కేసీఆర్ సూచించినట్లు వెల్లడించారు. ఎలాంటి అవకతవకలు లేకుండా సింగిల్‌విండో విధానం ద్వారా కంపెనీలకు అనుమతులు మంజూరు చేస్తున్నామన్నారు. భూటాన్ నుంచి వచ్చి వివిధ రంగాల్లో శిక్షణ పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్‌గౌడ్, న్యాక్ డెరైక్టర్ భిక్షపతి, సిబ్బంది పాల్గొన్నారు.