వేడుక సమయం: ఇంట్లోనే వెల్కమ్ చెప్పండి
కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. రేపు అర్ధరాత్రిపాత కేలండర్‌కి టాటా చెప్పి కొత్త కేలండర్ అడుగు పెడుతుంది. కొత్తగా వస్తున్న అతిథికి సంతోషంగా స్వాగతం చెప్పాలి. హగ్ చేసుకుని సెలబ్రేట్ చేసుకోవాలి. బయట ఈవెంట్స్ హడావిడి అక్కర్లేదు. భారీ ఖర్చు పెట్టక్కర్లేదు. రోడ్డు మీద చలిలో తిరగక్కర్లేదు. ఆత్మీయులతో కలిసి సింపుల్‌గా, వెరైటీగా ఇంట్లోనే న్యూ ఇయర్‌కు వెల్కమ్ చెప్పొచ్చు. మరి ఆ టైమ్‌లో ఏమేం చేయొచ్చు?
ఇవిగో సలహాలు.
‘ఉందిలే మంచి కాలం ముందు ముందునా’ అన్నాడో కవి. ముందు ఉన్నది మంచి కాలమే అని నమ్మక΄ోతే ముందుకు సాగలేరు ఎవరూ. తాము, తమ కుటుంబం రాబోయే రోజుల్లో సంతోషంగా ఉండాలనే కోరుకుంటారు ఎవరైనా. కొత్త సంవత్సరంలో అంతా మంచే జరగాలని, మంచే తేవాలని కోరుకుంటూ అది అడుగు పెట్టే వేళలో వీలైనంత సంతోషంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. ఆ క్షణంలో సంతోషంగా ఉంటే సంవత్సరమంతా సంతోషంగా ఉండొచ్చనే సెంటిమెంట్. ఆ సమయంలో ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటే సంవత్సరమంతా అలాగే గడిచి΄ోతుందని నమ్మకం.
అందుకే డిసెంబర్ 31 రాత్రి అందరం ఉత్సాహంగా గడపడానికి చూస్తారు. తోచిన రీతిలో సంబరం చేసుకుంటారు. బయట అందుకోసమే భారీ ఈవెంట్స్ ఉంటాయి. పబ్బులు, రిసార్టులు, స్టార్ హోటళ్లు ప్రత్యేక కార్యక్రమాలతో హోరెత్తుతాయి. ఆకర్షిస్తాయి. ఖర్చు పెట్టదలచుకుని, హంగామాగా గడపాలనుకునేవారికి అదంతా బాగానే ఉంటుంది. కాని ఇళ్లల్లో ఉంటూ కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పడానికే ఎక్కువ ఫ్యామిలీలు ఇష్టపడతాయి. మీది అలాంటి ఫ్యామిలీ అయితే ఇంటి నుంచే కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పండి.
మిత్రులను ఎంచుకోండి
ఇంట్లో మనం మాత్రమే ఉండి సెలబ్రేట్ చేసుకోవాలా ఫ్రెండ్స్ గాని బంధువులుగాని ఉండాలా అనేది తేల్చుకోండి. మనం మాత్రమే ఉంటే బోర్ అనుకుంటే నచ్చిన ఫ్రెండ్స్‌ను వారి కుటుంబాలతోపాటు (మరీ ఎక్కువమంది వద్దు) పిలవండి. లేదా ఇష్టమైన బంధువుల్లో ఒకటి రెండు కుటుంబాలను ఆహ్వానించండి. ఇప్పుడుపార్టీకి సిద్ధమైనవారు స్పష్టంగా లెక్క తేల్తారు.
ఇల్లు సర్దుకోండి
పార్టీకి వచ్చిన అందరూ లివింగ్ ఏరియాలో ఉంటారు కాబట్టి అక్కడ కూచునే వ్యవస్థను సరి చేసుకోండి. సీటింగ్ అరేంజ్మెంట్ చూసుకోండి. రెండో ప్లేస్‌గా ఇంటి ముంగిలిగాని పెరడుగాని డాబా గానీ ఎంచుకోండి. ఇంటి ముంగిలి లేదా పెరడు చలిమంటకు ఉపయోగపడుతుంది. డాబా మీదపార్టీ బాగుంటుంది.
వంట ఏమిటి?
పార్టీకి తిండి రెండు పద్ధతులు. సరదాగా వంట చేసుకోవాలంటే అందరూ కలిసి చేయండి. బార్బెక్యూ ఒక అట్రాక్టివ్ ఆలోచన. అలా కాదంటే మంచి రెస్టరెంట్ నుంచి తిండి తెప్పించుకోవాలి. ఏ తిండి అయినా పిలిచి వడ్డించే పద్ధతి వద్దు. డైనింగ్ ఏరియాలో అన్నీ పెట్టేయండి. బఫెలాగా కావాల్సినవి కావాల్సినవారు తింటారు.పార్టీకి ముందు డైనింగ్ సామాగ్రి చెక్ చేసుకోండి. సరిపడా ప్లేట్లు, స్పూన్లు సిద్ధం చేసుకోండి. హోమ్ బార్ ఉంటే గనక ఎవరు ‘ఎంత’ తీసుకుంటున్నారో నిఘా అవసరం... ఆరోగ్య రీత్యా... అపశృతులు దొర్లకుండా.
ఆటలు రెడీయా?
ఇండోర్ గేమ్స్ సరదాగా ఉంటాయి. పరమ పద సోపాన పటం దగ్గరి నుంచి అలనాటి ఆటలు ఎన్నో బయటకు తీయవచ్చు. గుర్తు చేసుకోవచ్చు. పులిజూదం, వామనగుంటలు, తొక్కుడుబిళ్ల... ఇవన్నీ కొత్త ఉత్సాహం ఇస్తాయి. కళ్లు మూసి ఎదుటివారి ముఖం తాకి గుర్తు పట్టే ఆట తమాషాగా ఉంటుంది... పిల్లల కోసం చాక్లెట్లు, కొద్దిపాటి కాయిన్లు ఇంట్లోనే రకరకాల చోట దాచి ట్రెజర్ హంట్ ఆడొచ్చు. ఇక కార్డ్స్, వీడియో గేమ్స్ ఉండనే ఉంటాయి.
థీమ్పార్టీ
ఏదో ఒక థీమ్ అందరూపాటిస్తే అదో సరదా.పార్టీకి 1970ల కాలం నాటి స్టయిల్ బట్టలు ధరించాలి... లేదంటే బెల్బాటమ్స్లో రావాలి... స్త్రీలైతే ‘ప్రేమ్‌నగర్’లో వాణిశ్రీలా కట్టు, బొట్టుపాటించాలి... ఇలా సరదాగా అనుకోవచ్చు. అచ్చ తెనుగు ఆహార్యం పంచె, లాల్చీ, చీర, జడకుప్పెలు ఇలా కూడా అనుకోవచ్చు.
వాల్ ఆఫ్ మెమొరీస్
గత సంవత్సరంలోని మంచి జ్ఞాపకాలను తలచుకుంటే వచ్చే సంవత్సరం కూడా మంచి జ్ఞాపకాలు దక్కుతాయి. అందుకనిపార్టీ జరిగే ఇంటిలో ఒక గోడను ‘వాల్ ఆఫ్ మెమొరీస్’గా పెట్టి ఫోన్లలోని మంచి ఫొటోలను ప్రింట్స్ తీసి అంటించండి. వచ్చిన అతిథులను కూడా వారి బెస్ట్ మెమొరీస్‌ను ప్రింట్స్‌గా తెమ్మనండి. వాల్ ఆఫ్ మెమొరీస్ దగ్గర నిలబడి ఫొటోలు దిగండి.
మూవీ నైట్
సాయంత్రం నుంచి జమ అవుతారు గనుక మూవీలను ఎంచుకోండి. ఒక వైపు టీవీ స్క్రీన్ మీదో, హోమ్ థియేటర్లోనో సినిమా నడుస్తూ ఉంటే మరోవైపు కబుర్లతోపార్టీ నడవడం బాగుంటుంది.
కరోకి నైట్
పాటలు లేనిపార్టీయా?పార్టీలు ఎవరు ఎలాపాడినా బాగానే ఉంటుంది. నవ్వుకోవడానికి వీలుగా ఉంటుంది. ట్రాక్స్‌ను ప్లే చేసి అభినవ మంటసాలగానో, జాలి సుబ్రహ్మణ్యంగానో, జానశీలగానో రెచ్చి΄ోవచ్చు. పిల్లలతో కలిసి అంత్యాక్షరి ఎలానూ ఆడొచ్చు.పాటలు రికార్డు చేసిపార్టీకి రాని వారికి పంపి వారి మీద కసి తీర్చుకోవచ్చు.
దంపతులకు మాత్రమే
ఇంట్లో ఇద్దరు మాత్రమే ఉంటే మీరిద్దరే కొత్త సంవత్సరానికి స్వాగతం చెబుతూ ఉంటే అది కూడా బాగుంటుంది. ఏ రాత్రి పదకొండుకో మంచి కాఫీ పెట్టుకుని, రగ్గు కప్పుకుని కూచుని గడచిన జీవితంలోని మంచి ఘట్టాలను నెమరు వేసుకోవచ్చు. కలిసి టీవీలో ఏదైనా న్యూ ఇయర్ ఈవెంట్ చూస్తూ గడపవచ్చు. లేదా పక్క పక్కనే కూచుని నిశ్శబ్దంగా పుస్తకం చదువుకోవచ్చు. పన్నెండు కాగానే ప్రేమగా ఒకరినొకరు దగ్గరకు తీసుకుని శుభాకాంక్షలు చెప్పుకోవచ్చు.