Homes for sale
-
పెద్ద పట్టణాల్లో ఇళ్ల అమ్మకాల జోరు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన పట్టణాల్లో ఇళ్ల విక్రయాలు డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో 11 శాతం పెరిగినట్టు రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తెలిపింది. ఏడు పట్టణాల్లో 149 మిలియన్ చదరపు అడుగులు (ఎంఎస్ఎఫ్) అమ్ముడుపోయినట్టు వెల్లడించింది. గత పదేళ్లలో ఒక త్రైమాసికం వారీ అత్యధిక విక్రయాలు ఇవేనని పేర్కొంది. డిమాండ్ మెరుగ్గా ఉండడమే వృద్ధికి మద్దతునిచ్చినట్టు తెలిపింది. 2022–23 మొదటి తొమ్మిది నెలల్లో (2022 ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు) ఈ ఏడు ప్రధాన పట్టణాల్లో 412 ఎంఎస్ఎఫ్ అడుగుల ఇళ్లను విక్రయించినట్టు ఇక్రా తెలిపింది. అంతక్రితం ఏడాది ఇదే తొమ్మిది నెలల్లో విక్రయాలు 307 ఎంఎస్ఎఫ్తో పోలిస్తే 30 శాతానికి పైగా వృద్ధి నమోదైంది. కరోనా మహమ్మారి తర్వాత కొనుగోలుదారుల ప్రాధాన్యతల్లో మార్పు వచ్చిందంటూ.. లగ్జరీ, మధ్య స్థాయి ధరల ఇళ్ల వాటా పెరిగినట్టు వివరించింది. 2019–20లో లగ్జరీ ఇళ్ల వాటా 14 శాతం, మధ్యస్థాయి ధరల ఇళ్ల వాటా 36 శాతం చొప్పున ఉంటే.. 2022–23 ఏప్రిల్–డిసెంబర్ కాలానికి లగ్జరీ ఇళ్ల అమ్మకాల వాటా 16 శాతానికి పెరిగితే, మధ్యస్థాయి ఇళ్ల విక్రయాల వాటా 42 శాతానికి చేరింది. హైదరాబాద్‌తోపాటు, చెన్నై బెంగళూరు, కోల్‌కతా, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్, నేషనల్ క్యాపిటల్ రీజియన్, పుణె పట్టణాలకు సంబంధించి ఇక్రా గణాంకాలు విడుదల చేసింది. 2023–24లో 16 శాతం.. ‘‘రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ అమ్మకాలు విలువ పరంగా 2022–23లో 8–12 శాతం మేర వృద్ధి చెందొచ్చు. 2023–24లో 14–16 శాతం మధ్య పెరగొచ్చు’’అని ఇక్రా వైస్ ప్రెసిడెంట్, కో గ్రూప్ హెడ్ అనుపమ రెడ్డి తెలిపారు. టాప్–12 డెవలపర్ల ప్రాథమిక గణాంకాల ఆధారంగా వేసిన అంచనాలుగా ఇక్రా పేర్కొంది. ఆర్బీఐ వడ్డీ రేట్ల పెరుగుదల గృహ కొనుగోళ్లపై లేదని తెలిపింది. ‘‘కరోనా ముందున్న నాటి రేట్ల కంటే ఇప్పటికీ గృహ రుణాలపై రేట్లు తక్కువే ఉన్నాయి. కనుక కొనుగోలు శక్తి ఇప్పటికీ ఆరోగ్యంగానే ఉంది. తక్కువ నిల్వలు, డెవలపర్లు తమకు అనుకూలంగా ప్రాజెక్టులు ప్రారంభించడం, ఉద్యోగ మార్కెట్లో మందగమనం, వడ్డీ రేట్లు మరింత పెరుగుదల కొనుగోలు శక్తిపై చూపించే అంశాలు’’అని పేర్కొంది. 2022 డిసెంబర్ నాటికి అమ్ముడుపోని ఇళ్ల పరిమాణం 839 ఎంఎస్ఎఫ్గా ఉందని ఇక్రా తెలిపింది. 2021 డిసెంబర్లో విక్రయం కాని ఇళ్లు 923 ఎంఎస్ఎఫ్తో పోలిస్తే తక్కువేనని గుర్తు చేసింది. వార్షికంగా చూస్తే 2022 డిసెంబర్ త్రైమాసికంలో ఇళ్ల ధరలు 10 శాతం పెరిగినట్టు పేర్కొంది. పెరిగిన నిర్మాణ వ్యయాలను కస్టమర్లకు బదిలీ చేయడమే ధరల పెరుగుదలకు కారణంగా తెలిపింది. -
హౌసింగ్ బూమ్..! రేట్లు పెరిగినా తగ్గేదెలే!
న్యూఢిల్లీ: అధిక వడ్డీ రేట్లు ఇళ్ల కొనుగోలు డిమాండ్‌కు అవరోధం కాదని బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) అధ్యయన నివేదిక తెలిపింది. రుణ కాల వ్యవధిలో వడ్డీ రేట్లు పెరగడం, తగ్గడం సహజమేనన్న విషయమై వారికి అవగాహన ఉంటుందని పేర్కొంది. రెండేళ్లుగా వడ్డీ రేట్ల పరంగా ఎటువంటి మార్పుల్లేని విషయం తెలిసిందే. కానీ, ఆర్బీఐ ఈ ఏడాది మే నుంచి మూడు విడతలుగా మొత్తం 1.4 శాతం మేర రేట్లను పెంచడంతో.. బ్యాంకులు సైతం రేట్లను సవరించాయి. ఈ నేపథ్యంలో బీవోబీ పరిశోధన నివేదిక ఇళ్ల డిమాండ్, వడ్డీ రేట్లపై దృష్టి సారించడం గమనించాలి. ‘భారత్‌లో గృహ రుణాల తీరు’ పేరుతో ఈ నివేదికను విడుదల చేసింది. కరోనా తర్వాత దేశంలో గృహ రుణ రంగం బలంగా నిలబడినట్టు తెలిపింది. ప్రభుత్వరంగ బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు ఇచ్చే గృహ రుణాల్లో మంచి వృద్ధి కనిపించడాన్ని ప్రస్తావించింది. ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం ఈ రంగానికి ప్రకటించిన మద్దతు చర్యలు, దీనికితోడు ప్రాపర్టీల ధరలు తగ్గడం, తక్కువ వడ్డీ రేట్లు మార్కెట్‌కు కలిసొచ్చినట్టు వివరించింది. గృహ రుణాలకు డిమాండ్ ఆర్థిక కార్యకలాపాలు సాధారణంగా మారిపోవడం, వృద్ధి పుంజుకోవడం, గృహాలకు డిమాండ్‌ను గణనీయంగా పెంచనున్నట్టు ఈ నివేదికను రూపొందించిన బీవోబీ ఆర్థికవేత్త అదితి గుప్తా పేర్కొన్నారు. ఈ సానుకూలతలు మద్దతుగా గృహ రుణాలకు మరింత డిమాండ్ ఉంటుందని అంచనా వేశారు. ‘‘అధిక వడ్డీ రేట్లు కొద్ది మంది రుణ గ్రహీతలకు అవరోధం కావచ్చు. కానీ, ఇళ్లకు నెలకొన్న బలమైన డిమాండ్ దీన్ని అధిగమిస్తుంది. పైగా వ్యక్తిగత గృహ కొనుగోలుదారులు వడ్డీ రేట్ల ఆటుపోట్లపై అవగాహనతో ఉంటారు. కనుక అధిక రేట్లు వారి కొనుగోళ్లకు అవరోధం కాబోవు’’అని అదితి గుప్తా వివరించారు. జీడీపీలో పెరిగిన వాటాయే నిదర్శనం గడిచిన పదేళ్ల కాలంలో జీడీపీలో బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల గృహ రుణాల రేషియో పెరగడం గృహ రుణాలకు పెరుగుతున్న ప్రాధాన్యానికి నిదర్శనమని ఈ నివేదిక గుర్తు చేసింది. 2010–2011లో జీడీపీలో గృహ రుణాల రేషియో 6.8 శాతంగా ఉంటే, 2020–21 నాటికి అది 9.5 శాతానికి పెరిగినట్టు తెలిపింది. కరోనా మహమ్మారి విరుచుకుపడిన ఆర్థిక సంవత్సరంలోనూ జీడీపీలో గృహ రుణాల రేషియో 9.8 శాతానికి పెరిగినట్టు పేర్కొంది. కరోనా మహమ్మారి నుంచి రియల్ ఎస్టేట్ బలంగా కోలుకుందని, గత ఆర్థిక సంవత్సరంలో గృహ రుణాల రేషియో జీడీపీలో 11.2 శాతానికి పెరిగినట్టు తెలిపింది. ‘‘2020–11 నాటికి రూ.3.45 లక్షల కోట్లుగా ఉన్న బ్యాంకుల గృహ రుణాల పోర్ట్‌ఫోలియో 2020–21 నాటికి రూ.15 లక్షల కోట్లకు పెరిగింది. ఏటా 14.3 శాతం వృద్ధి నమోదైంది. గృహ రుణాల మార్కెట్లో ఇప్పటికీ ప్రభుత్వరంగ బ్యాంకుల ఆధిపత్యమే కొనసాగుతోంది. వీటి వాటా 61.2 శాతంగా ఉంది. 2022లో హౌసింగ్ బూమ్..! పరిశ్రమ వర్గాల అభిప్రాయాలు ఇళ్ల ధరలు పెరిగాయి. గృహ రుణాల రేట్లు కూడా పెరుగుతున్నాయి. అయినా సరే 2022లో ఇళ్ల విక్రయాలు కరోనా ముందు నాటిని మించి నమోదవుతాయని పరిశ్రమ భావిస్తోంది. దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన పట్టణాల్లో ఈ ఏడాది మొత్తం మీద ఇళ్ల అమ్మకాలు.. కరోనా ముందు సంవత్సరం 2019లో నమోదైన 2.62 లక్షల యూనిట్లను మించుతాయని అంచనాతో ఉంది. డీమోనిటైజేషన్, రెరా, జీఎస్టీ, కరోనా మహమ్మారి కారణంగా గడిచిన ఆరేళ్లుగా ఈ పరిశ్రమ ఎన్నో సవాళ్లను ఎదుర్కోవడం గమనార్హం. అయితే, రెరా చట్టం కారణంగా కొనుగోళ్ల సెంటిమెంట్ మెరుగుపడినట్టు గృహ కొనుగోలుదారుల మండలి ఎఫ్‌పీసీఈ అంటోంది అన్ని ప్రధాన రియల్ ఎస్టేట్ లిస్టెడ్ కంపెనీలు గత ఆర్థిక సంవత్సరానికి బుకింగ్‌ల పరంగా మంచి గణాంకాలను నమోదు చేయగా, 2022–23లోనూ మెరుగైన విక్రయాలు, బుకింగ్‌ల పట్ల ఆశాభావంతో ఉంది. అయితే, ఆర్బీఐ రెపో రేటును 1.4 శాతం మేర పెంచడం, బ్యాంకులు ఈ మొత్తాన్ని రుణ గ్రహీతలకు బదిలీ చేయడంతో స్వల్ప కాలంలో ఇళ్ల విక్రయాలపై ఈ ప్రభావం ఉంటుందని పరిశ్రమ అంచనా వేస్తోంది. ఇళ్ల ధరల పెరుగుదల ప్రభావం కూడా స్వల్పకాలంలో ఉండొచ్చని అంగీకరించింది. జూన్ త్రైమాసికంలో ఇళ్ల ధరలు సుమారు 5 శాతం మేర పెరగడం గమనార్హం. పండుగల జోష్ అయితే పండుగల సీజన్ నుంచి ఇళ్ల విక్రయాలు పుంజుకోవచ్చని రియల్ ఎస్టేట్ పరిశ్రమ అంచనాలతో ఉంది. రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ సైతం ఈ ఏడాది ఇళ్ల విక్రయాలు ఏడు ప్రధాన పట్టణాల్లో (ఢిల్లీ–ఎన్సీఆర్, ముంబై మెట్రోపాలిటన్, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, పుణె) 2019లో నమోదైన 2,61,358 యూనిట్లను మించుతాయని అంచనా వేసింది. అయితే 2014లో నమోదైన గరిష్ట విక్రయాలు 3.43 లక్షల యూనిట్ల కంటే తక్కువే ఉండొచ్చని పేర్కొంది. దేశ హౌసింగ్ పరిశ్రమ నిర్మాణాత్మక అప్‌సైకిల్ ఆరంభంలో ఉందని మ్యాక్రోటెక్ డెవలపర్స్ ఎండీ, సీఈవో అభిషేక్ లోధా తెలిపారు. వచ్చే 10–20 ఏళ్ల కాలానికి వృద్ధిపై ఆశావహంగా ఉన్నట్టు చెప్పారు. -
లగ్జరీ ఇళ్లకు అనూహ్య డిమాండ్
న్యూఢిల్లీ: ఖరీదైన ఫ్లాట్లు/ఇళ్ల విక్రయాలు (రూ.1.5 కోట్లకు పైన విలువైనవి) దూసుకుపోతున్నాయి. దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన పట్టణాల్లో ఈ ఏడాది జనవరి–జూన్ కాలంలో 25,680 యూనిట్లు అమ్ముడుపోయాయి. గడిచిన మూడేళ్ల కాలంలో మొదటి ఆరు నెలల విక్రయాలతో పోలిస్తే అధికంగా నమోదైనట్టు ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ తెలిపింది. 2021 సంవత్సరం మొత్తం విక్రయాలు 21,700తో పోల్చి చూసినా 20 శాతం అధికంగా నమోదయ్యాయి. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లోని మొత్తం విక్రయాల్లో సగం ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లోనే నమోదయ్యాయి. ఖరీదైన ఇళ్ల విక్రయాలు ఈ ఏడాది అద్భుతంగా సాగినట్టు అనరాక్ పేర్కొంది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, ఎంఎంఆర్, ఢిల్లీ ఎన్సీఆర్, పుణె పట్టణాలకు సంబంధించిన గణాంకాలతో అనరాక్ సోమవారం ఓ నివేదిక విడుదల చేసింది. 2020లో 8,470 యూనిట్లు, 2019లో 17,740 యూనిట్లు అమ్ముడుపోవడం గమనించాలి. ‘‘లగ్జరీ ఇళ్ల విక్రయాలు పుంజుకోవడానికి కొన్ని కారణాలున్నాయి. ఈ ఏడాది చాలా వరకు లగ్జరీ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయింది. కస్టమర్లు వెంటనే గృహ ప్రవేశానికి అనుకూలంగా ఉన్న ఇళ్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు’’అని అనరాక్ చైర్మన్ అనుజ్‌పురి తెలిపారు. అధిక ధనవంతులు (హెచ్ఎన్ఐలు) కరోనా మహమ్మారి సమయంలో స్టాక్ మార్కెట్ నుంచి లాభాలు సంపాదించారని, దాన్ని వారు ఇప్పుడు రియల్ ఎస్టేట్‌పై పెడుతున్నారని చెప్పారు. ‘‘ఉమ్మడి కుటుంబాలు మరింత విశాలమైన ఇళ్లు అవసమని కరోనా సమయంలో అర్థం చేసుకున్నాయి. ఇది కూడా డిమాండ్‌ను పెంచడానికి ఓ కారణం’’అని అనుజ్‌పురి వెల్లడించారు. వైశాల్యం, వసతులకు ప్రాధాన్యం ‘‘కరోనా తర్వాత కొనుగోలుదారులు ఖరీదైన వసతుల కోసం చూస్తున్నారు. మరింత పెద్ద ఇళ్లను మంచి ట్రాక్ రికార్డు కలిగిన డెవలపర్ల నుంచి కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు’’అని కల్పతరు డైరెక్టర్ ముకేశ్ సింగ్ తెలిపారు. పట్టణాల వారీగా.. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ మధ్య ఖరీదైన ఇళ్ల విక్రయాలను పరిశీలిస్తే.. హైదరాబాద్ మార్కెట్లో 2,420 యూనిట్లుగా ఉన్నాయి. 2021లో 1,880 యూనిట్లు, 2020లో 620 యూనిట్లు, 2019లో 500 యూనిట్లు చొప్పున అమ్ముడుపోవడం గమనార్హం. ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో 4,160 యూనిట్లు, ఎంఎంఆర్‌లో 13,670 యూనిట్లు, బెంగళూరులో 2,430 యూనిట్లు, పుణెలో 1,460 యూనిట్లు, చెన్నైలో 900 యూనిట్లు, కోల్‌కతా మార్కెట్లో 630 యూనిట్ల చొప్పున ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో విక్రయాలు నమోదయ్యాయి. ఎన్ఆర్ఐల ఆసక్తి ప్రవాస భారతీయుల (ఎన్ఆర్ఐ) నుంచి కూడా ఇళ్లకు డిమాండ్ ఉన్నట్టు అనరాక్ తెలిపింది. రూపాయి విలువ క్షీణించడాన్ని వారు అనుకూలంగా చూస్తున్నట్టు పేర్కొంది. 2022 మొదటి ఆరు నెలల్లో దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన పట్టణాల్లో 1.84 లక్షల ఇళ్ల యూనిట్లు అమ్ముడుపోయాయి. ఇందులో లగ్జరీ ఇళ్ల వాటా 14 శాతానికి చేరుకుంది. కరోనా రెండో విడత తర్వాత నుంచి ఇళ్ల ధరలు పెరిగినట్టు అనరాక్ తెలిపింది. ఇప్పటికీ ఇళ్ల ధరలు సహేతుక స్థాయిలోనే ఉన్నాయని, ఈ రేట్లు ఇంకా పెరగొచ్చని కొనుగోలుదారులు భావిస్తున్నట్టు వెల్లడించింది. -
సప్లయి తగ్గింది.. డిమాండ్ పెరిగింది!
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి నేపథ్యంలో అందుబాటు గృహాల సరఫరా తగ్గినప్పటికీ.. డిమాండ్ మాత్రం పుంజుకుంది. దీంతో దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో ఇన్వెంటరీ 21 శాతం క్షీణించాయి. 2020 జనవరి–మార్చి (క్యూ1)లో 2,34,600 అఫర్డబుల్ యూనిట్ల ఇన్వెంటరీ ఉండగా.. ఈ ఏడాది క్యూ1 నాటికి 1,86,150 యూనిట్లకు తగ్గాయని అనరాక్ డేటా వెల్లడించింది. ► రెండేళ్ల కోవిడ్ కాలంలో అఫర్డబుల్ గృహాల సప్లయి తగ్గింది. కరోనా కంటే ముందు 2019 జనవరి–మార్చి (క్యూ1)లో దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో 70,480 యూనిట్లు ప్రారంభం కాగా.. ఇందులో అందుబాటు గృహాల వాటా 44 శాతంగా ఉంది. కరోనా మొదలైన ఏడాది 2020 క్యూలోని గృహాల సప్లయిలో అఫర్డబుల్ వాటా 38 శాతం, 2021 క్యూ1లో 30 శాతం, ఈ ఏడాది క్యూ1 నాటికి 25 శాతానికి తగ్గింది. సప్లయి తగ్గడం వల్ల డెవలపర్లు అమ్ముడుపోకుండా ఉన్న గృహాల (ఇన్వెంటరీ)ని విక్రయించడంపై దృష్టిసారించారని అనరాక్ గ్రూప్ చైర్మన్ అనూజ్ పూరీ తెలిపారు. దీంతో గత రెండేళ్లలో ఏడు నగరాల్లోని అఫర్డబుల్ హౌసింగ్ ఇన్వెంటరీ 21 శాతం, లగ్జరీ గృహాల ఇన్వెంటరీ 5 శాతం తగ్గుముఖం పట్టాయి. ► ఈ ఏడాది తొలి త్రైమాసికం ముగింపు నాటికి దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో 6,27,780 గృహాల ఇన్వెంటరీ ఉండగా.. ఇందులో 1,86,150 యూనిట్లు రూ.40 లక్షల లోపు ధర ఉన్న అందుబాటు గృహాలే. అదే గతేడాది క్యూ1లో ఇవి 2,17,63, 2020 క్యూ1లో 2,34,600 యూనిట్లున్నాయి. 2021 క్యూ1లో అత్యధికంగా చెన్నైలో 52%, పుణేలో 33 శాతం, ముంబైలో 27% అఫర్డబుల్ హౌసింగ్ ఇన్వెంటరీ తగ్గాయి. ► ఇదే రెండేళ్ల కరోనా సమయంలో రూ.2.5 కోట్లకు పైగా ధర ఉన్న అల్ట్రా లగ్జరీ గృహాల ఇన్వెంటరీ 5 శాతం మేర తగ్గింది. 2020 క్యూ1లో 41,750 యూనిట్ల ఇన్వెంటరీ ఉండగా.. గతేడాది క్యూ1 నాటికి 42,080కు, ఈ ఏడాది క్యూ1 నాటికి 39,810 యూనిట్లకు క్షీణించాయి. అత్యధికంగా ముంబైలో 16 శాతం, కోల్‌కతాలో 15 శాతం అల్ట్రా లగ్జరీ హౌసింగ్ ఇన్వెంటరీ తగ్గాయి. -
గృహ విక్రయాలు, లాంచింగ్స్‌లో హైదరాబాద్ రికార్డ్
దేశంలోని ప్రధాన నగరాల రియల్టీ మార్కెట్ ప్రతికూలంలోకి జారిపోతే.. హైదరాబాద్ స్థిరాస్తి మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. గృహ విక్రయాలు, లాంచింగ్స్‌లోనూ చరిత్ర సృష్టించింది. దశాబ్ద కాలంలోనే అత్యుత్తమ స్థాయిలో గతేడాది 24,318 గృహాలు విక్రయమయ్యాయి. ఇదే సమయంలో రికార్డ్ స్థాయిలో 35,736 యూనిట్లు లాంచింగ్ అయ్యా యని నైట్‌ఫ్రాంక్ ఇండియా తెలిపింది. సాక్షి, హైదరాబాద్: దేశంలోని ఏ ఇతర నగరాలలో లేని విధంగా 2013 నుంచి ఇప్పటివరకు హైదరాబాద్‌లో ప్రాపర్టీల ధరలు తగ్గలేదు. 2020లో కరోనా మహమ్మారి సమయంలోనూ ధరలలో క్షీణత నమోదు కాకపోవటం గమనార్హం. అయినా సరే నేటికీ ఇతర నగరాలతో పోలిస్తే భాగ్యనగరంలో ధరలు అందుబాటులోనే ఉన్నాయి. అందుకే గృహ కొనుగోలుదారులతో పాటూ ఇన్వెస్టర్లూ నగర రియల్టీ మార్కెట్ వైపు ఆసక్తిని కనబరుస్తున్నారు. గతేడాది హెచ్2లో నగరంలో ధరలు 5 శాతం మేర పెరిగాయి. గృహ ప్రవేశానికి సిద్ధమైన ఇళ్లకు, ప్రధాన డెవలపర్లయితే నిర్మాణంలో ఉన్న యూనిట్ల కొనుగోళ్లకు కస్టమర్లు ఆసక్తిని చూపిస్తున్నారు. దీంతో 2020 హెచ్2లో 11.5 త్రైమాసికాలుగా ఉన్న ఇన్వెంటరీ.. గతేడాది హెచ్2 నాటికి 7.6 త్రైమాసికాలకు క్షీణించింది. రెడీ టు మూవ్ ప్రాజెక్ట్‌లకు డిమాండ్ పెరగడమే ఈ క్షీణతకు కారణం. హెచ్2లో 135 శాతం వృద్ధి రేటు.. గతేడాది జూలై– డిసెంబర్ (హెచ్2)లో నగరంలో 12,344 గృహాలు విక్రయమయ్యాయి. అంతకుక్రితం హెచ్2లో ఇవి 5,260లుగా ఉన్నాయి. ఏడాదిలో 135 శాతం వృద్ధి రేటును నమోదు చేసింది. అలాగే 2020 హెచ్2లో 8,404 యూనిట్లు లాంచింగ్ కాగా.. గతేడాది హెచ్2 నాటికి 126 శాతం వృద్ధి రేటుతో 19,024 గృహాలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం నగరంలో గృహాల ఇన్వెంటరీ 159 శాతం క్షీణించి 18,598లకు చేరాయి. వీటి విక్రయానికి 4.3 త్రైమాసికాల సమయం పడుతుంది. ఇందులో 12,141 యూనిట్లు పశ్చిమ హైదరాబాద్‌లోనే ఉన్నాయి. ఆ తర్వాత 2,892 యూనిట్లు నార్త్‌లో, 1,643 ఈస్ట్‌లో, 1,230 సౌత్‌లో, 692 యూనిట్లు సెంట్రల్ హైదరాబాద్‌లో ఉన్నాయి. కొనసాగుతున్న పశ్చిమ హైదరాబాద్ జోరు.. మొదట్నుంచి నగర రియల్టీ మార్కెట్‌కు ఆయువు పట్టు కూకట్పల్లి, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, కోకాపేట వంటి పశ్చిమ హైదరాబాద్ ప్రాంతాలే. ఎప్పటిలాగే గతేడాది లాంచింగ్ అయిన యూనిట్లలో 64 శాతం వెస్ట్ జోన్లోనే ఎక్కువగా ప్రారంభమయ్యాయి. కోకాపేట, పీరంచెరు, గోపన్‌పల్లి, నల్లగండ్లలో ఎక్కువగా నిర్మాణ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. విక్రయాలలో కూడా పశ్చిమ హెదరాబాద్ జోరు కొనసాగింది. గతేడాది విక్రయమైన యూనిట్లలో 60 శాతం ఈ జోన్లోనే జరిగాయి. హైటెక్ సిటీ, గచ్చిబౌలి, నానక్‌రాంగూడలోని కార్యాలయాలకు దగ్గరగా ఉండాలని కొనుగోలుదారులు భావిస్తున్నారు. 23 శాతం రూ.50 లక్షల కంటే తక్కువ ధర ఉన్న గృహాలు, 48 శాతం రూ.50 లక్షల నుంచి రూ.కోటి, 30 శాతం రూ.కోటిపైన ధర ఉండే యూనిట్లు అమ్ముడుపోయాయి. కరోనాతో గృహాలకు డిమాండ్.. హైదరాబాద్‌లో గృహాల విక్రయాలలో ఐటీ ఉద్యోగుల వాటానే ఎక్కువగా ఉంటుంది. కరోనా తర్వాతి నుంచి ఐటీ, ఫార్మా మినహా అన్ని రంగాలు కొంత ప్రభావితమయ్యాయి. నగర మార్కెట్లో ఈ రెండు రంగాలు బాగుండటంతో గృహ విక్రయాలకూ ప్రభావితం కాలేదు. ఇంకా చెప్పాలంటే కరోనా తర్వాత ఇంటి అవసరం ఇంకా ఎక్కువగా పెరిగింది. వర్క్ ఫ్రం హోమ్, ఆన్లైన్ క్లాస్‌లు కొనసాగుతున్న నేపథ్యంలో విస్తీర్ణమైన గృహాలు, వ్యక్తిగత గృహాలకు మరింత డిమాండ్ ఏర్పడింది. చదవండి: యాదాద్రిని చూపించి వరంగల్ హైవే మార్కెట్‌ని పాడు చేశారు -
అక్కడ చదరపు అడుగు రూ.12లక్షలు పై మాటే!
విక్టోరియా : మనదేశంలో కోవిడ్-19 కారణంగా రియల్ ఎస్టేట్ కుదేలవటం, లాక్‌డౌన్‌తో నిర్మాణ రంగ కూలీలంతా తమ సొంతూళ్లకు వలసపోవడంతో సేల్స్ నేలచూపులు చూస్తున్నాయి. అయినా సరే అద్దె ఇంట్లో నివసించే ఎక్కువ శాతం మంది సొంతంగా ఇళ్లను కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. మనదేశంలో పరిస్థితి ఇలా ఉంటే విదేశాల్లో కారు పార్కింగ్‌కు సైతం కోట్లు కుమ్మరించాల్సి వస్తుంది. దీంతో కొనుగోలు దారులు వామ్మో కారు పార్కింగ్‌కు ఇంత ఖరీదా అంటూ ముక్కున వేలేసేకుంటున్నారు. బ్లూమ్‌బర్గ్ బిజినెస్ మ్యాగజైన్ కథనం ప్రకారం.. హాంకాంగ్ వాన్ ఛాయ్ జిల్లాలో అత్యంత రద్దీ ప్రాంతం మౌంట్ నికల్సన్. ఇక్కడ కొండల మీద ఇళ్లు వాటి ఎదురుగా విమానాశ్రయం. ఇంటి బయట కూర్చుంటే వీచే చల్లటి గాలులతో ఆ ప్రాంతంలో నివసించేందుకు సంపన్నులు మక్కువ చూపుతుంటారు. దీంతో ఆ ప్రాంతంలో నిర్మించుకున్న ఇళ్లు .. ప్రపంచంలో అత్యంత ఖరీదైనవిగా గుర్తింపు పొందాయి. ప్రతి ఏడు బ్లూమ్ బెర్గ్ అత్యంత ఖరీదైన ఇళ్ల జాబితాలో ఈ ప్రాంతంలో నిర్మించిన ఇళ్లు ప్రథమస్థానాన్ని సంపాదించుకుంటున్నాయి.ఈ ప్రాంతంలో రద్దీ ఎక్కువగా ఉండడం, నిర్మించుకునేందుకు ప్లేసులు లేకపోవడంతో ఇప్పటికే ఇళ్లను నిర్మించుకున్న యజమానులు, ఇళ్ల పార్కింగ్ స్థలాన్ని కోట్లలో అమ్ముకుంటున్నారు. పార్కింగ్ ఏరియాల్ని కొనుగోలు చేసేందుకు ఔత్సాహికులు ఎగబడుతున్నారు. తాజాగా ఈ ప్రాంతంలో 12.5 చదరపు మీటర్లు (135 చదరపు అడుగుల) ఓ అపార్ట్ మెంట్ కారు పార్కింగ్ స్థలం 1.3 మిలియన్లకు అమ్ముడైనట్లు బ్లూమ్ బెర్గ్ తన నివేదికలో పేర్కొంది. ఇదే స్థలం ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ. 9,49,16,380.00గా ఉంది. ఫైనాన్షియల్ సంస్థ యూబీఎస్ 2019 నివేదిక ప్రకారం.. ఓ సాధారణ ఉద్యోగి ఇక్కడ 60 చదరపు మీటర్ల ఫ్లాట్ కొనడానికి 22 సంవత్సరాల ఆదాయం అవసరం అవుతుందని తెలిపింది. కాగా ఈ సంవత్సరం, 3,378 చదరపు అడుగుల పెంట్ హౌస్ 59 మిలియన్ డాలర్లకు అమ్ముడైంది, ఇది చదరపు అడుగుకు,రూ.12,78,185.12 మార్క్ చేరి కొత్త రికార్డ్ ను క్రియేట్ చేసింది. చదవండి : 'అద్దె ఇంట్లో ఉండలేం బాబోయ్..సొంతిల్లే కొనుక్కుంటాం' -
చిన్న పట్టణాల్లో ఇళ్లకు డిమాండ్
న్యూఢిల్లీ: ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో ఇళ్లకు డిమాండ్ పెరిగింది. కరోనా తర్వాత భారీ సంఖ్యలో చిన్న పట్టణాలకు తిరిగి వలసపోవడమే కారణమని హౌసింగ్ డాట్ కామ్ నివేదిక తెలియజేసింది. ఏడాది క్రితంతో పోలిస్తే ఇళ్ల కొనుగోలు, అద్దె ఇళ్లకు డిమాండ్ మూడు రెట్లు పెరిగినట్టు ఈ నివేదిక పేర్కొంది. ‘‘హౌసింగ్ డాట్‌కామ్ ప్లాట్‌ఫామ్‌పై గడిచిన కొన్ని నెలల కాలంలో నివాసిత గృహాలకు ఆసక్తి గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా అమృత్సర్, చండీగఢ్, నాగ్‌పూర్, విజయవాడ, కోయంబత్తూర్ తదితర పట్టణాల విషయంలో ఈ పరిస్థితి కనిపించింది’’ అంటూ ఎలారా టెక్నాలజీస్ సీఈవో ధృవ్ అగర్వాల్ తెలిపారు. హౌసింగ్ డాట్ కామ్, మకాన్, ప్రాప్‌టైగర్ పోర్టళ్ల మాతృ సంస్థయే ఎలారా టెక్నాలజీస్. ‘‘కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థలో ఏర్పడిన సంక్షోభం.. ఉద్యోగపరమైన అనిశ్చితులు ప్రజలను తిరిగి తమ ప్రాంతాలకు తరలిపోయేందుకు దారితీసింది. అసంఘటిత రంగంలోని వారితోపాటు.. సంఘటిత రంగంలోనూ ఉద్యోగాలు పోవడం లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా ఎక్కువ మంది తిరిగి సొంత పట్టణాలు, చిన్న పట్టణాలకు వలసబాట పట్టారు’’ అని నివేదిక వివరించింది. దీనివల్ల చిన్న పట్టణాల్లో ఇళ్ల కొనుగోలుకు, అద్దె ఇళ్లకు డిమాండ్ పెరగడమే కాకుండా, ఈ కామర్స్ సంస్థల వృద్ధికి కూడా తోడ్పడినట్టు తెలిపింది. పెద్ద పట్టణాల్లో పడిపోయిన అమ్మకాలు ప్రాపర్టీ కన్సల్టెంట్ అనరాక్ దేశంలోని ఏడు ప్రథమ శ్రేణి పట్టణాల్లో ఇళ్ల విక్రయాలు గణనీయంగా తగ్గాయి. జూలై–సెప్టెంబర్ క్వార్టర్లో 29,520 యూనిట్లు అమ్ముడుపోయాయని, క్రితం ఏడాది ఇదే కాలంలో నమోదైన అమ్మకాలు 55,080 యూనిట్లతో పోలిస్తే 46 శాతం తగ్గినట్టు ప్రాపర్టీ కన్సల్టెంట్ అనరాక్ తెలిపింది. ఢిల్లీ–ఎన్సీఆర్, ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతం (ఎంఎంఆర్), కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, పుణేలో కరోనా కారణంగా డిమాండ్ స్తబ్దుగా ఉన్నట్టు పేర్కొంది. ఇక ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ కాలంలో ఇళ్ల అమ్మకాలు 57% క్షీణించి 87,460 యూనిట్లు (ఒక యూనిట్:ఒక ఇల్లు/ఫ్లాట్)గా ఉన్నాయి. కానీ, 2019 ఇదే కాలంలో 2,02,200 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో ఇళ్ల విక్రయాలు 12,730 యూనిట్లకు పడిపోగా, తర్వాతి త్రైమాసికం జూలై–సెప్టెంబర్‌లో విక్రయాలు రెట్టింపునకు చేరినట్టు అన్‌రాక్ చైర్మన్ అనుజ్‌పురి తెలిపారు. కరోనా ముందస్తునాటితో పోలిస్తే జూలై–సెప్టెంబర్ క్వార్టర్లో విక్రయాలు 65 శాతం సాధారణ స్థితికి చేరినట్టు చెప్పారు. -
బిల్లులు అందక ఇందిరమ్మ ఇళ్ల తాకట్టు
ఇప్పటికే పలు ఇళ్ల అమ్మకాలు పలమనేరు డివిజన్లో పెండింగ్ బిల్లులు రూ.1.5 కోట్లు ఇక బిల్లులొచ్చేది అనుమానమే పలమనేరు: పక్కా ఇల్లు పేదవాని కల. అది కలగానే మిగి లింది. అప్పోసప్పో చేసి కట్టిన ఇందిరమ్మ ఇళ్లకు ప్రభుత్వం బిల్లులు అందివ్వలేదు. ఫలితంగా ఇంటి నిర్మాణాలకు చేసిన అప్పులకు వడ్డీ మొదలు పెరిగి అదే ఇళ్లను అమ్ముకోవడం, లేదా తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో నిరుపేదల గూళ్లు కళ్లముందే పరులపాలవుతున్నాయి. ఇది పలమనేరు నియోజకవర్గంలో బిల్లులందని ఇందిరమ్మ లబ్ధిదారుల గోడు. పలమనేరు హౌసింగ్ డివిజన్ పరిధిలోనే రూ.1.5 కోట్ల బిల్లులు పెండింగ్ పడ్డాయంటే పరిస్థితి ఊహించుకోవచ్చు. ఇళ్ల నిర్మాణాల కోసం ప్రభుత్వం అందజేస్తోన్న రుణం ఏ మూలకూ చాలక చేసిన వడ్డీ తడిసి మోపెడయింది. ఫలి తంగా అసలు, వడ్డీ కట్టలేక అరాకొర నిర్మాణాలను కొందరు తాకట్టు పెడుతున్నారు. మరికొందరు ఇళ్లనే విక్రయించేస్తున్నారు. పలమనేరు హౌసింగ్ డివిజన్లో ఇందిరమ్మ పథకం ద్వారా 2006 నుండి 2014 వరకు దాదాపు 32వేల ఇళ్లు మంజూరయ్యాయి. మున్సిపల్ పరిధిలోని లబ్ధిదారులకు హౌసింగ్ శాఖ రూ.44వేలను (ఎస్సీ, ఎస్టీలకు కాకుండా ఇతరులకు) రుణంగా అందించింది. అదే విధంగా రూరల్‌లో ఇంటి నిర్మాణానికి రూ.33 వేలను రుణంగా ఇచ్చింది. అయితే ఈ డబ్బు ఇంటి నిర్మాణానికి ఏమాత్రం చాలలేదు. భారీగా పెరిగిన నిర్మాణ వ్యయం ప్రభుత్వ నిబంధనల మేరకు ఓ ఇందిరమ్మ ఇంటిని నిర్మించాలంటే రూ.లక్షకు పైగా ఖర్చవుతోంది. దీని నిర్మాణానికి 6వేల ఇటుకలకు రూ.25వేలు, రూ.265 చొప్పున 70 బస్తాల సిమెంట్‌కు రూ.19వేలు, ఇనుముకు రూ.6వేలు, ఇసుక లోడు రూ.1000 చొప్పున ఐదు లోడ్లకు రూ.5వేలు, పునాది రాళ్లు లోడు రూ.1500 చొప్పున 4 లోడ్లకు రూ.6వేలు, ట్యాంకర్లతో నీటిని తెచ్చుకోడానికి రూ.5వేలు, మేస్త్రీ, కూలీలు, తలుపులు, ద్వారబంధనం తదితరాలు, పెయింటింగ్, వైరింగ్ తదితరాలకు మరో రూ.40వేలు అంతా కలిపి దాదాపు లక్ష రూపాయలకు పైగా దాటింది. దీంతో సామాన్యులు ప్రభుత్వం ఇచ్చే రుణంతో ఇందిరమ్మ ఇంటిని కట్టుకొనే పరిస్థితి లేదు. అప్పోసప్పో చేసుకొని ఇంటి నిర్మాణం పూర్తి చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. గత డాది మార్చిలో ఆగిన బిల్లులు గత డాది మార్చి 23నుంచి ఇప్పటి వరకు లబ్ధిదారులకు బిల్లులు అందలేదు. అప్పట్లో రాష్ట్ర విభజన కారణంగా హౌసింగ్ ఆన్లైన్ వ్యవస్థను ఆపేశారు. దాం తో ఇంటి నిర్మాణాలు సైతం వివిధ దశల్లో ఆగిపోయాయి. కొందరు అప్పులు చేసి ఇళ్ల నిర్మాణాలను చేపట్టారు. ఇప్పటివరకు వీరికి అందాల్సిన బకాయిలు రూ.1.5 కోట్లు ఇంతవరకు రాలేదు. ఇన్నాళ్లుగా ఎదురుచూసినా ఫలితం లేకుండా పోయింది. కట్టిన ఇళ్లు తాకట్టుకు జమ సమయానికి బిల్లులు చెల్లించకపోవడంతో నూటికి రూ.10తో లబ్ధిదారులు ఎడాపెడా అప్పులు చేశారు. ఆ అప్పులు పెరిగి గుదిబండగా మారాయి. సంవత్సరాలుగా తిరుగుతున్నా బిల్లులేమో చేతికి రాలేదు. దీంతో అప్పు ఇచ్చిన వారు లబ్ధిదారులను వేధింపులకు గురి చేస్తున్నారు. మరోవైపు కొందరు లబ్ధిదారులు ఇంట్లో ఉన్న నగలు తాకట్టు పెట్టి వాటిని విడిపించుకోలేక ఇబ్బంది పడుతున్నారు. బిల్లులు వచ్చినప్పుడు వడ్డీ మొదలు వసూలు చేసుకోవచ్చని భా వించి అప్పు ఇచ్చినవారు బిల్లులు రాకపోయే సరికి డబ్బులు చెల్లించండి లేదా ఆ ఇళ్లనే తాకట్టు పెట్టాల ని ఒత్తిడి చేస్తున్నారు. మరికొందరైతే లబ్ధిదారుల వ ర్క్ ఆర్డర్లను సైతం లాగేసుకున్నారు. దీంతోదాదాపు 900 దాకా వివిధ దశల్లో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను విక్రయించేశారని తెలుస్తోంది. మరికొందరు ఇదే ఇంది రమ్మ ఇళ్లను స్టాంప్ పేపర్లలో అగ్రిమెంట్లు సైతం చేసేసుకున్నారు. అటు ఇందిరమ్మ ఇంటికి నోచుకోక, చేసిన అప్పులు కట్టలేక బాధతో ఆ ఇళ్లను అమ్మేస్తున్నారు. అధికారులు స్పందించి ఇందిరమ్మ బిల్లులను అందజేయాల్సిన అవసరముంది. ఈవిషయమై హౌ సింగ్ డీఈ అశోకచక్రవర్తిని వివరణ కోరగా రూ.1.5 కోట్లు బిల్లులు పెండింగ్ ఉన్నమాట నిజమేనన్నారు. అయితే అవి వచ్చే నమ్మకాలు లేవన్నారు.