బిల్లులు అందక ఇందిరమ్మ ఇళ్ల తాకట్టు | Mortgaged homes | Sakshi
Sakshi News home page

బిల్లులు అందక ఇందిరమ్మ ఇళ్ల తాకట్టు

Published Fri, Mar 20 2015 2:54 AM | Last Updated on Sat, Sep 2 2017 11:06 PM

Mortgaged homes

ఇప్పటికే పలు ఇళ్ల అమ్మకాలు
పలమనేరు డివిజన్లో పెండింగ్ బిల్లులు రూ.1.5 కోట్లు
ఇక బిల్లులొచ్చేది అనుమానమే


పలమనేరు: పక్కా ఇల్లు పేదవాని కల. అది కలగానే మిగి లింది. అప్పోసప్పో చేసి కట్టిన ఇందిరమ్మ ఇళ్లకు ప్రభుత్వం బిల్లులు అందివ్వలేదు. ఫలితంగా ఇంటి నిర్మాణాలకు చేసిన అప్పులకు వడ్డీ మొదలు పెరిగి అదే ఇళ్లను అమ్ముకోవడం, లేదా తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో నిరుపేదల గూళ్లు కళ్లముందే పరులపాలవుతున్నాయి. ఇది పలమనేరు నియోజకవర్గంలో బిల్లులందని ఇందిరమ్మ లబ్ధిదారుల గోడు. పలమనేరు హౌసింగ్ డివిజన్ పరిధిలోనే రూ.1.5 కోట్ల బిల్లులు పెండింగ్ పడ్డాయంటే పరిస్థితి ఊహించుకోవచ్చు.

ఇళ్ల నిర్మాణాల కోసం ప్రభుత్వం అందజేస్తోన్న రుణం ఏ మూలకూ చాలక చేసిన వడ్డీ తడిసి మోపెడయింది. ఫలి తంగా అసలు, వడ్డీ కట్టలేక అరాకొర నిర్మాణాలను కొందరు తాకట్టు పెడుతున్నారు. మరికొందరు ఇళ్లనే విక్రయించేస్తున్నారు. పలమనేరు హౌసింగ్ డివిజన్‌లో ఇందిరమ్మ పథకం ద్వారా 2006 నుండి 2014 వరకు దాదాపు 32వేల ఇళ్లు మంజూరయ్యాయి. మున్సిపల్ పరిధిలోని లబ్ధిదారులకు హౌసింగ్ శాఖ రూ.44వేలను (ఎస్సీ, ఎస్టీలకు కాకుండా ఇతరులకు) రుణంగా అందించింది. అదే విధంగా రూరల్‌లో ఇంటి నిర్మాణానికి రూ.33 వేలను రుణంగా ఇచ్చింది. అయితే ఈ డబ్బు ఇంటి నిర్మాణానికి ఏమాత్రం చాలలేదు.  
 
భారీగా పెరిగిన నిర్మాణ వ్యయం

ప్రభుత్వ నిబంధనల మేరకు ఓ ఇందిరమ్మ ఇంటిని నిర్మించాలంటే రూ.లక్షకు పైగా ఖర్చవుతోంది. దీని నిర్మాణానికి 6వేల ఇటుకలకు రూ.25వేలు, రూ.265 చొప్పున 70 బస్తాల సిమెంట్‌కు రూ.19వేలు, ఇనుముకు రూ.6వేలు, ఇసుక లోడు రూ.1000 చొప్పున ఐదు లోడ్లకు రూ.5వేలు, పునాది రాళ్లు లోడు రూ.1500 చొప్పున 4 లోడ్లకు రూ.6వేలు, ట్యాంకర్లతో నీటిని తెచ్చుకోడానికి రూ.5వేలు, మేస్త్రీ, కూలీలు, తలుపులు, ద్వారబంధనం తదితరాలు, పెయింటింగ్, వైరింగ్ తదితరాలకు మరో రూ.40వేలు అంతా కలిపి దాదాపు లక్ష రూపాయలకు పైగా దాటింది. దీంతో సామాన్యులు ప్రభుత్వం ఇచ్చే రుణంతో ఇందిరమ్మ ఇంటిని కట్టుకొనే పరిస్థితి లేదు. అప్పోసప్పో చేసుకొని ఇంటి నిర్మాణం పూర్తి చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

గత డాది మార్చిలో ఆగిన బిల్లులు

గత డాది మార్చి 23నుంచి ఇప్పటి వరకు లబ్ధిదారులకు బిల్లులు అందలేదు. అప్పట్లో రాష్ట్ర విభజన కారణంగా హౌసింగ్ ఆన్‌లైన్ వ్యవస్థను ఆపేశారు. దాం తో ఇంటి నిర్మాణాలు సైతం వివిధ దశల్లో ఆగిపోయాయి. కొందరు అప్పులు చేసి ఇళ్ల నిర్మాణాలను చేపట్టారు. ఇప్పటివరకు వీరికి అందాల్సిన బకాయిలు రూ.1.5 కోట్లు ఇంతవరకు రాలేదు. ఇన్నాళ్లుగా ఎదురుచూసినా ఫలితం లేకుండా పోయింది.
 
కట్టిన ఇళ్లు తాకట్టుకు జమ


సమయానికి బిల్లులు చెల్లించకపోవడంతో నూటికి రూ.10తో లబ్ధిదారులు ఎడాపెడా అప్పులు చేశారు. ఆ అప్పులు పెరిగి గుదిబండగా మారాయి. సంవత్సరాలుగా తిరుగుతున్నా బిల్లులేమో చేతికి రాలేదు. దీంతో అప్పు ఇచ్చిన వారు లబ్ధిదారులను వేధింపులకు గురి చేస్తున్నారు. మరోవైపు కొందరు లబ్ధిదారులు ఇంట్లో ఉన్న నగలు తాకట్టు పెట్టి వాటిని విడిపించుకోలేక ఇబ్బంది పడుతున్నారు. బిల్లులు వచ్చినప్పుడు వడ్డీ మొదలు వసూలు చేసుకోవచ్చని భా వించి అప్పు ఇచ్చినవారు బిల్లులు రాకపోయే సరికి డబ్బులు చెల్లించండి లేదా ఆ ఇళ్లనే తాకట్టు పెట్టాల ని ఒత్తిడి చేస్తున్నారు. మరికొందరైతే లబ్ధిదారుల వ ర్క్ ఆర్డర్లను సైతం లాగేసుకున్నారు. దీంతోదాదాపు 900 దాకా వివిధ దశల్లో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను విక్రయించేశారని తెలుస్తోంది. మరికొందరు ఇదే ఇంది రమ్మ ఇళ్లను స్టాంప్ పేపర్లలో అగ్రిమెంట్లు సైతం చేసేసుకున్నారు. అటు ఇందిరమ్మ ఇంటికి నోచుకోక, చేసిన అప్పులు కట్టలేక బాధతో ఆ ఇళ్లను అమ్మేస్తున్నారు. అధికారులు స్పందించి ఇందిరమ్మ బిల్లులను అందజేయాల్సిన అవసరముంది. ఈవిషయమై హౌ సింగ్ డీఈ అశోకచక్రవర్తిని వివరణ కోరగా రూ.1.5 కోట్లు బిల్లులు పెండింగ్ ఉన్నమాట నిజమేనన్నారు. అయితే అవి వచ్చే నమ్మకాలు లేవన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement