6,000 వరకూ పెరగనున్న హోండా కార్ల ధరలు !
న్యూఢిల్లీ: హోండా కార్ ఇండియా కంపెనీ తన కార్ల ధరలను రూ.6,000 వరకూ పెంచాలని యోచిస్తోంది. ప్రతికూలమైన ఎక్స్ఛేంజ్ రేటు ప్రభావం కారణంగా ఉత్పత్తి వ్యయాలు పెరగడంతో ధరలను ఈ మేరకు పెంచాలని హోండా కార్ ఇండియా భావిస్తోంది. వచ్చే నెల నుంచి ధరలు పెరిగే అవకాశాలున్నాయి. ఏఏ మోడల్ ధరలను ఎంతెంత పెంచాలన్న విషయమై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. కాగా వాహనాలపై మౌలిక సుంకం విధించిన నేపథ్యంలో ఈ నెల మొదట్లోనే ఈ కంపెనీ తన వాహనాల ధరలను రూ.79,000 వరకూ పెంచింది. ఈ కంపెనీ భారత్లో రూ.4.31 లక్షలున్న బ్రియో నుంచి రూ.26 లక్షలున్న ఎస్యూవీ సీఆర్వీ వరకూ మొత్తం ఆరు మోడళ్లను విక్రయిస్తోంది.