ప్రపంచంలోనే భయం లేని జంతువు
దాదాపు 30 కిలోమీటర్ల మేర వినిపించేంత భీకరంగా అరిచే అరుదైన జీవి తేనె కుక్క. హనీ బ్యాడ్జర్గా పిలిచే ఈ వన్య జీవులు పాపికొండలు అభయారణ్యంలో సందడి చేస్తున్నాయి. చిన్నపాటి ఎలుగు బంటిని పోలినట్టుండే తేనె కుక్కలు సుమారు రెండేళ్ల క్రితం కర్ణాటకలోని కావేరి వన్య ధామంలో కనిపించాయి. ఇటీవల పాపికొండలు అభయారణ్యంలో సైతం వీటి జాడలు ట్రాప్ కెమెరాలకు భారీగానే చిక్కాయి.
బుట్టాయగూడెం: తేనె కుక్కలుగా పిలిచే అరుదైన వన్యప్రాణి హనీ బ్యాడ్జర్ (రాటిల్) పాపికొండలు అభయారణ్యంలో కనువిందు చేస్తున్నాయి. 25 ఏళ్ల క్రితం దక్షిణాఫ్రికా అడవుల్లో మాత్రమే గుర్తించిన ఈ జీవులు పోలవరం ప్రాజెక్ట్ ప్రాంతంలోనూ ట్రాప్ కెమెరాలకు చిక్కాయి. వీటి ఎత్తు కేవలం 12 అంగుళాలు. తల నుంచి తెలుపు, తెలుపు గీతలతో కూడిన మందపాటి.. దట్టమైన నల్లని బొచ్చును కలిగి ఉండటం వీటి ప్రత్యేకత. తేనె కుక్కల పంజా గోళ్లు మూడు అంగుళాల వరకు పొడవు ఉన్నాయి. చూసేందుకు చిన్నపాటి ఎలుగుబంటి.. పెద్దగా ఉండే ముంగిసలా కనిపిస్తుంది. నడకలో మాత్రం కుక్కను పోలి ఉంటుంది. వీపుపై తెల్లని ఛాయలుండే నల్లని ఈ జీవి చూసేందుకు భీతి గొలుపుతుంది. ఈ జీవులకు పౌరుషంలో మరో వన్యప్రాణి సాటిరాదు. వీటికి అడవిలో లభించే తేనె తుట్టెల్లోని తేనెటీగ లార్వాలంటే ఎంతో ఇష్టం. అందుకే వీటికి హనీ బ్యాడ్జర్ అని పేరొచ్చింది. ఇతర కీటకాలు, కుందేళ్లను కూడా తింటాయి. వీటి ఆహారంలో 25 శాతం పాములే. కలుగుల్లో ఉండే కొండ ఎలుకల్ని సైతం ఇవి ఇష్టంగా తింటాయి.
వీటిని చూస్తే జంతువులకు హడల్
తేనె కుక్కలను చూడగానే నక్కలు, తోడేళ్లు, ఎలుగుబంట్లు, ఏనుగులు హడలిపోతాయి. ఇవి కనిపిస్తే వాటికి దారిచ్చి తప్పుకుని వెళ్లిపోతాయి. ఇవి చాలా ధైర్యం గల ప్రాణులు. వీటి చర్మం ఎలాస్టిక్ మాదిరిగా సాగే గుణాన్ని కలిగి ఉంటుంది. పదునైన పళ్లు ఉంటాయి. అడవిలో ఎంత పెద్ద క్రూర జంతువుతోనైనా ధైర్యంగా పోరాడగల జంతువు ఇది. పులి, చిరుత, కొండచిలువతోనైనా పోరాడుతుంది. పాము విషం కూడా వీటిని ఏమీ చేయలేదు. ప్రపంచంలోనే భయం లేని జంతువు హనీ బ్యాడ్జర్ ఒక్కటే అని అటవీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. వీటి జీవిత కాలం ఏడేళ్లు మాత్రమే. వాసనను పసిగట్టి ఆహారాన్ని సేకరించడంలో స్నిపర్ డాగ్‌ను మించిన నైపుణ్యం వీటి సొంతం. అరుదైన హనీ బ్యాడ్జర్ల సంచారం పాపికొండల అటవీప్రాంతంలో ఎక్కువగా∙ఉన్నట్టు అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. సుమారు 1,200 పైగా హనీ బ్యాడ్జర్లు ఇక్కడ ఉన్నట్టు ఇక్కడి ట్రాప్ కెమెరాలలో చిక్కిన జాడలను బట్టి తెలుస్తోందన్నారు.
వీటి సంతతి పెరుగుతోంది
అరుదైన హనీ బ్యాడ్జర్లు పాపికొండలు అభయారణ్యంలో ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత ధైర్యమైన జంతువుగా దీనికి పేరుంది. తేనెటీగల లార్వాను చాలా ఇష్టంగా తింటాయి. పులి, చిరుతతో పాటు ఎటువంటి జంతువుతోనైనా ఎదిరించి పోరాడగలవు. వీటి సంతతి 1,200కు పైగా ఉన్నట్టు అంచనా వేశాం.
– దావీదు రాజునాయుడు, ఫారెస్ట్ రేంజ్ అధికారి, ఏలూరు జిల్లా