honolulu
-
విమానంలో సీలింగ్‌ను గుద్దుకున్న ప్రయాణీకులు
-
విమానంలో సీలింగ్‌ను గుద్దుకున్న ప్రయాణీకులు
మోన్‌ట్రియల్(కెనడా): ఎయిర్ కెనడా విమానంలో ఆస్ట్రేలియాకు వెళుతున్న ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురైంది. సాంకేతిక లోపంతో విమానం కుదుపులకు లోనవడంతో ప్రయాణికులు గాల్లోకి ఎగిరి పైకప్పును ఢీకొట్టారు. ఈ ఘటనలో 35 మంది గాయపడ్డారు. దీంతో విమానాన్ని అత్యవసరంగా కిందకు దించాల్సి వచ్చింది. వివరాలు.. కెనడా నుంచి 269 మంది ప్రయాణికులు, 15 మంది సిబ్బందితో గురువారం సిడ్నీ వెళ్తున్న బోయింగ్ విమానంలో హవాయి రాష్ట్రం దాటిన తర్వాత సాంకేతిక లోపం ఏర్పడింది. విమానం ఒక్కసారిగా కుదుపులకు లోనవడంతో ప్రయాణికులు పై కప్పును గుద్దుకున్నారు. పైకెగిరి కింద పడటంతో 35 మంది ప్రయాణికులకు స్వల్పగాయాలయ్యాయి. విమానం సీలింగ్ అక్కడక్కడా దెబ్బతిని వైర్లు బయటకు వచ్చాయి. ఊహించని పరిణామంతో ప్రయాణికులంతా భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన పైలట్లు విమానాన్ని వెనక్కు మళ్లించి హోనోలులు విమానాశ్రయంలో సురక్షితంగా దింపారు. తదుపరి విమానం వచ్చేంతవరకు ప్రయాణికులందరికి ఎయిర్ కెనడా వసతి, భోజన సదుపాయాలను కల్పించింది. -
అమెరికాలో భారీ అగ్నిప్రమాదం
హోనలూలు: అమెరికాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. హవాయి రాష్ట్ర రాజధాని హోనలూలులోని 31 అంతస్తుల అపార్టుమెంట్లో జరిగిన ఆ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మార్కోపోలో అపార్టుమెంట్లో 26వ అంతస్తులో మొదట మంటలు చెలరేగాయి. ఇవి 27వ అంతస్తుకు ఎగబాకాయి. ఈ సంఘటనలో ముగ్గురు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. అపార్టుమెంట్లో 586 ఫ్లాట్లు, నాలుగు వాణిజ్య సముదాయాలు ఉన్నాయి. గాయపడిన వారికి పారామెడికల్ సిబ్బంది చికిత్సలు అందించారు. గాయపడిన వారిలో ఇద్దరిని ఆస్పత్రికి తరలించగా వారి పరిస్థితి నిలకడగా ఉందని అగ్నిమాపక శాఖ అధికారి కెప్టెన్ డేవిడ్ జెన్కిన్స్ తెలిపారు. మృతులు ముగ్గురూ 26 వ అంతస్తుకు చెందినవారేనన్నారు. -
విమానంలో యోగా.. గలాభా
హొనోలులు: విమానంలో భార్యపై దౌర్జన్యం చేయడమే కాకుండా, సిబ్బందితో గొడవ పడిన దక్షిణ కొరియా ప్రయాణికుడు అమెరికాలో జైలు పాలయ్యాడు. జపాన్ కు చెందిన యునైటెడ్ ఎయిర్ లైన్స్ విమానంలో మార్చి 26న ఈ ఘటన చోటుచేసుకుందని ఎఫ్ బీఐ తెలిపింది. హొనోలులు ఎయిర్ పోర్టు నుంచి నారిటా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుగా వెళుతున్న విమానంలో హయొంగటాయ్ పాయె అనే వ్యక్తి దౌర్జన్యానికి పాల్పడ్డాడని వెల్లడించింది. భోజనం వడ్డించే సమయంలో సీటులో ఉండనని యోగా, మెడిటేషన్ చేసుకునేందుకు హయొంగటాయ్ పాయె విమానంలోని వెనక భాగానికి వెళ్లిపోయాడు. తిరిగి వచ్చిన అతడిని సీటులో కూర్చోమని పాయె భార్యతో, విమాన సిబ్బంది కోరడంతో ...పాయె కోపంతో ఊగిపోయాడు. భార్యను పక్కకు తోసేందుకు ప్రయత్నించి, అడ్డుకున్న సిబ్బందిపై దౌర్జన్యం చేశాడు. సర్దిచెప్పేందుకు ప్రయత్నించిన తోటి ప్రయాణికులను చంపేస్తానంటూ బెదిరించాడు. దీంతో హయొంగటాయ్ భార్య కిమ్ ను అతడి వెనుక సీటులో కూర్చొబెట్టారు. విమాన సిబ్బంది ఫిర్యాదు మేరకు అతడిని అరెస్ట్ చేసి, అమెరికా కోర్టులో ప్రవేశపెట్టారు. 25 వేల డాలర్ల పూచీకత్తుతో అతడికి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయింది. అయితే పాయె మానసిక స్థితిగా సరిగా లేదన్న కారణంతో అతడిని విడుదల చేయలేదు. తమ 40వ వివాహ వార్షికోత్సవాన్ని హవాయ్ లో జరుపుకునేందుకు వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుందని పాయె భార్య కిమ్ వాపోయింది. ఒత్తిడిని తట్టుకునేందుకు ఇటీవలే పాయె యోగా నేర్చుకున్నాడని, గత 11 రోజులుగా అతడు సరిగా నిద్ర పోలేదని వెల్లడించింది. -
బాత్రూంలో అత్యాచారయత్నం: వెనుదిరిగిన విమానం
హవాయి నుంచి జపాన్ వెళ్తున్న విమానంలో ఓ ప్రయాణికుడు సహచర ప్రయాణికురాలిపై అత్యాచారయత్నం చేయడంతో.. విమానం వెనుదిరగాల్సి వచ్చింది. మైఖేల్ టనోయె (29) అనే ప్రయాణికుడు విమానం టేకాఫ్ తీసుకున్న దాదాపు రెండు గంటల తర్వాత బలంతంగా బాత్రూంలోకి వెళ్లాడు. అక్కడ జపాన్‌కు చెందిన ఓ ప్రయాణికురాలి దుస్తులు విప్పి ఆమెపై అత్యాచారం చేయబోయాడు. అయితే ఆమె ఎలాగోలా బాత్రూంలో ఉన్న ఎమర్జెన్సీ బటన్ నొక్కారు.దాంతో విమాన సిబ్బంది తలుపు బలవంతంగా తీసే ప్రయత్నం చేశారు. అయితే అతడు తలుపులకు అడ్డంగా ఉండటంతో అది సాధ్యం కాలేదు. చివరకు తలుపుకు ఉన్న స్క్రూలు విప్పదీసి తలుపు తీయగలిగారు. హొనొలులు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి జపాన్‌లోని కన్సాయ్ నగరానికి ఆ విమానం వెళ్తోంది. హవాయికి చెందిన మైఖేల్ టనోయె తన తల్లితో కలిసి ఆ విమానంలో ప్రయాణిస్తున్నాడు. అతడి మానసిక ఆరోగ్యం సరిగా లేదని, అందుకే మందులు వాడుతున్నామని ఆమె చెప్పారు. ఈ సంఘటన తర్వాత బయటకు వచ్చిన అతడికి ఆమె ఏవో టాబ్లెట్లు ఇవ్వగా, కొద్దిసేపటికే నిద్రలోకి జారిపోయాడు. తర్వాత విమానాన్ని వెనక్కి తిప్పగా, హొనొలులులో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఇలా విమానంలో అత్యాచారయత్నం చేసినందుకు అతడికి భారీ శిక్షే పడే అవకాశం ఉంది.