
మోన్‌ట్రియల్(కెనడా): ఎయిర్ కెనడా విమానంలో ఆస్ట్రేలియాకు వెళుతున్న ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురైంది. సాంకేతిక లోపంతో విమానం కుదుపులకు లోనవడంతో ప్రయాణికులు గాల్లోకి ఎగిరి పైకప్పును ఢీకొట్టారు. ఈ ఘటనలో 35 మంది గాయపడ్డారు. దీంతో విమానాన్ని అత్యవసరంగా కిందకు దించాల్సి వచ్చింది.
వివరాలు.. కెనడా నుంచి 269 మంది ప్రయాణికులు, 15 మంది సిబ్బందితో గురువారం సిడ్నీ వెళ్తున్న బోయింగ్ విమానంలో హవాయి రాష్ట్రం దాటిన తర్వాత సాంకేతిక లోపం ఏర్పడింది. విమానం ఒక్కసారిగా కుదుపులకు లోనవడంతో ప్రయాణికులు పై కప్పును గుద్దుకున్నారు. పైకెగిరి కింద పడటంతో 35 మంది ప్రయాణికులకు స్వల్పగాయాలయ్యాయి. విమానం సీలింగ్ అక్కడక్కడా దెబ్బతిని వైర్లు బయటకు వచ్చాయి. ఊహించని పరిణామంతో ప్రయాణికులంతా భయాందోళనకు గురయ్యారు.
అప్రమత్తమైన పైలట్లు విమానాన్ని వెనక్కు మళ్లించి హోనోలులు విమానాశ్రయంలో సురక్షితంగా దింపారు. తదుపరి విమానం వచ్చేంతవరకు ప్రయాణికులందరికి ఎయిర్ కెనడా వసతి, భోజన సదుపాయాలను కల్పించింది.
Comments
Please login to add a commentAdd a comment