హవాయి నుంచి జపాన్ వెళ్తున్న విమానంలో ఓ ప్రయాణికుడు సహచర ప్రయాణికురాలిపై అత్యాచారయత్నం చేయడంతో.. విమానం వెనుదిరగాల్సి వచ్చింది.
హవాయి నుంచి జపాన్ వెళ్తున్న విమానంలో ఓ ప్రయాణికుడు సహచర ప్రయాణికురాలిపై అత్యాచారయత్నం చేయడంతో.. విమానం వెనుదిరగాల్సి వచ్చింది. మైఖేల్ టనోయె (29) అనే ప్రయాణికుడు విమానం టేకాఫ్ తీసుకున్న దాదాపు రెండు గంటల తర్వాత బలంతంగా బాత్రూంలోకి వెళ్లాడు. అక్కడ జపాన్కు చెందిన ఓ ప్రయాణికురాలి దుస్తులు విప్పి ఆమెపై అత్యాచారం చేయబోయాడు.
అయితే ఆమె ఎలాగోలా బాత్రూంలో ఉన్న ఎమర్జెన్సీ బటన్ నొక్కారు.దాంతో విమాన సిబ్బంది తలుపు బలవంతంగా తీసే ప్రయత్నం చేశారు. అయితే అతడు తలుపులకు అడ్డంగా ఉండటంతో అది సాధ్యం కాలేదు. చివరకు తలుపుకు ఉన్న స్క్రూలు విప్పదీసి తలుపు తీయగలిగారు. హొనొలులు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి జపాన్లోని కన్సాయ్ నగరానికి ఆ విమానం వెళ్తోంది.
హవాయికి చెందిన మైఖేల్ టనోయె తన తల్లితో కలిసి ఆ విమానంలో ప్రయాణిస్తున్నాడు. అతడి మానసిక ఆరోగ్యం సరిగా లేదని, అందుకే మందులు వాడుతున్నామని ఆమె చెప్పారు. ఈ సంఘటన తర్వాత బయటకు వచ్చిన అతడికి ఆమె ఏవో టాబ్లెట్లు ఇవ్వగా, కొద్దిసేపటికే నిద్రలోకి జారిపోయాడు. తర్వాత విమానాన్ని వెనక్కి తిప్పగా, హొనొలులులో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఇలా విమానంలో అత్యాచారయత్నం చేసినందుకు అతడికి భారీ శిక్షే పడే అవకాశం ఉంది.