in hostel
-
నిట్ విద్యార్థినుల ఆందోళన
తాడేపల్లిగూడెం రూరల్ : మండలంలోని పెదతాడేపల్లి వాసవి ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలోని తాత్కాలిక నిట్ బాలికల హాస్టల్ ద్వితీయ సంవత్సరం విద్యార్థినులు ఆందోళన బాట పట్టారు. శనివారం తరగతులను బహిష్కరించి నిరసన తెలిపారు. సరైన ఆహారం, మెడికల్, అంబులెన్స్ తదితర సౌకర్యాలు కల్పించాలని నినాదాలు చేశారు. అకడమిక్ ఇన్చార్జి ప్రొఫెసర్ పి.బంగారుబాబు, ప్రొఫెసర్ కె.లక్ష్మారెడ్డి హాస్టల్ వద్దకు చేరుకుని విద్యార్థినులతో మాట్లాడారు. ఇటీవల జరిగిన వీడియో కాన్ఫెరెన్స్‌లో నిట్ శాశ్వత డైరెక్టర్ జీఆర్సీ రెడ్డి దృష్టికి తమ సమస్యలు తీసుకువెళ్లామని విద్యార్థినులు అన్నారు. అయినా సమస్యలు పరిష్కరం కాలేదని వాపోయారు. హాస్టల్లో పురుగుల సమస్య ఎక్కువగా ఉందని, ఇవి కుట్టడంతో పలువురు విద్యార్థినులు చర్మసంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అవసరమైన సరంజామా కొనుగోలు చేసేందుకు ప్రత్యేక అనుమతులు ఇవ్వాలని విద్యార్థినులు డిమాండ్ చేశారు. ఇక్కడ విషయాలపై నిట్ ఉన్నతాధికారులతో మాట్లాడి పరిష్కారానికి కృషి చేస్తానని అకడమిక్ ఇన్చార్జి ప్రొఫెసర్ పి.బంగారుబాబు భరోసానివ్వడంతో విద్యార్థినులు ఆందోళన విరమించారు. -
హాస్టల్ విద్యార్థి మృతి
అనుమానాస్పద మృతిగా కేసు నమోదు రామచంద్రపురం : రాత్రి మంచంపై నిద్రపోయిన బాలుడు తెల్లారేసరికి విగత జీవిగా మారాడు. రామచంద్రపురం హాస్టల్లో విద్యార్థి మృతి అనుమానాస్పదంగా జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రౌతులపూడి మండలం ఎం. కొత్తూరుకు చెందిన వంతు చిట్టిబాబు(16) పట్టణంలోని లలితానగర్‌లో గల కృత్తివెంటి పేర్‌ారజు పంతులు పశు వైద్య పాలిటెక్నిక్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. సుమారు నెల్లాళ్ల క్రితం కాలేజీలో చేరిన చిట్టిబాబు పక్కనే గల హాస్టల్లో ఉంటున్నాడు. శుక్రవారం సాయంత్రం యథావిధిగా తన కార్యక్రమాలను ముగించుకుని భోజనం చేసి తోటి విద్యార్థులతో కలిసి హాస్టల్లో మంచంపై నిద్రపోయాడు. శనివారం ఉదయాన్నే విద్యార్థులందరూ లేచి తమ పనులు చేసుకుంటుండగా చిట్టిబాబు ఎంతకీ లేవలేదు. దాంతో సహవిద్యార్థులకు అనుమానం వచ్చి చూసే సరికి మరణించినట్టు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడకు వచ్చి పరిశీలించి చిట్టిబాబు తల్లిదండ్రులకు సమాచారాన్ని అందించారు. ప్రిన్సిపాల్ కె. అశ్వినీకుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. చిట్టిబాబు 10వతరగతిలో 9.8 పాయింట్లు సాధించి ముఖ్యమంత్రి చేతుల మీదుగా విజయవాడలో ప్రతిభా అవార్డును అందుకున్నాడు. చిట్టిబాబు మృతితో కళాశాల విద్యార్థుల్లో విచారం చోటు చేసుకుంది.