- అనుమానాస్పద మృతిగా కేసు నమోదు
హాస్టల్ విద్యార్థి మృతి
Published Sat, Oct 22 2016 9:51 PM | Last Updated on Fri, Nov 9 2018 4:36 PM
రామచంద్రపురం :
రాత్రి మంచంపై నిద్రపోయిన బాలుడు తెల్లారేసరికి విగత జీవిగా మారాడు. రామచంద్రపురం హాస్టల్‌లో విద్యార్థి మృతి అనుమానాస్పదంగా జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రౌతులపూడి మండలం ఎం. కొత్తూరుకు చెందిన వంతు చిట్టిబాబు(16) పట్టణంలోని లలితానగర్‌లో గల కృత్తివెంటి పేర్‌ారజు పంతులు పశు వైద్య పాలిటెక్నిక్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. సుమారు నెల్లాళ్ల క్రితం కాలేజీలో చేరిన చిట్టిబాబు పక్కనే గల హాస్టల్‌లో ఉంటున్నాడు. శుక్రవారం సాయంత్రం యథావిధిగా తన కార్యక్రమాలను ముగించుకుని భోజనం చేసి తోటి విద్యార్థులతో కలిసి హాస్టల్‌లో మంచంపై నిద్రపోయాడు. శనివారం ఉదయాన్నే విద్యార్థులందరూ లేచి తమ పనులు చేసుకుంటుండగా చిట్టిబాబు ఎంతకీ లేవలేదు. దాంతో సహవిద్యార్థులకు అనుమానం వచ్చి చూసే సరికి మరణించినట్టు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడకు వచ్చి పరిశీలించి చిట్టిబాబు తల్లిదండ్రులకు సమాచారాన్ని అందించారు. ప్రిన్సిపాల్ కె. అశ్వినీకుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. చిట్టిబాబు 10వతరగతిలో 9.8 పాయింట్లు సాధించి ముఖ్యమంత్రి చేతుల మీదుగా విజయవాడలో ప్రతిభా అవార్డును అందుకున్నాడు. చిట్టిబాబు మృతితో కళాశాల విద్యార్థుల్లో విచారం చోటు చేసుకుంది.
Advertisement
Advertisement