House rental
-
బాపట్ల జిల్లా కేంద్రంలో అద్దెల దరవు..!
సాక్షి, బాపట్ల: రాష్ట్రంలో నూతన జిల్లాల ఏర్పాటులో భాగంగా ప్రభుత్వం పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా ఏర్పాటు చేసింది. ఫలితంగా బాపట్ల కేంద్రంగా నూతన జిల్లా ఏర్పాటు కావడంతో రాష్ట్ర చిత్రపటంలో ప్రత్యేకత స్థానం ఏర్పడింది. అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రం బాపట్ల జిల్లా కేంద్రం కావడం.. జిల్లా స్థాయి ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, అధికార యంత్రాంగం, ఉద్యోగులు రావడంతో నివాస గృహాలకు డిమాండ్ ఏర్పడింది. అద్దె ఇళ్ల కోసం అందరూ ఒకేసారి రావడంతో యజమానులు సైతం అద్దెలు ఆకాశానికి పెంచేశారు. బాపట్ల పురపాలక సంఘ పరిధిలో... బాపట్ల పురపాలక సంఘ పరిధిలో దాదాపు లక్షకు పైగా జనాభా, దాదాపు 30 వేల వరకు నివాస గృహాలు, 2 వేల వాణిజ్య సముదాయాలు ఉన్నాయి.. భౌగోళికంగా 7 కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. చిన్న పట్టణ స్థాయికే పరిమితమైన బాపట్లను జిల్లా కేంద్రం చేయడంతో అధికార యంత్రాంగం అంతా ఇక్కడే పరిపాలన సాగిస్తున్నారు. అటు ప్రభుత్వ, ప్రైవేటుకు చెందిన దాదాపు 2 వేల మందికి పైగా ఉద్యోగులు కొత్తగా వచ్చి విధులు నిర్వహిస్తున్నారు. పెరిగిన జనాభా అవసరాల మేర నివాస గృహాలు అందుబాటులో లేకపోవడంతో అద్దె ఇళ్లకు డిమాండ్ ఏర్పడింది. బదిలీలతోపాటు, ఇతరత్రా కారణాల వలన నివాస గృహలు ఖాళీ అయి ఇల్లు అద్దె బోర్డు కనిపిస్తే చాలు వాలిపోతున్నారు. వారి అవసరాలను గుర్తించిన ఇంటి యజమానులు మాత్రం అద్దెలను రెండింతలు చేసి డిమాండ్ సృష్టించారు. గతంతో పోలిస్తే... గతంలో బాపట్ల జిల్లా కేంద్రం కాకముందు సింగిల్ బెడ్రూం సదుపాయం ఉన్న నివాస గృహం అద్దె రూ.4 వేలకే దొరికేది.. అలాగే డబుల్ బెడ్రూం సదుపాయాలు ఉన్న నివాస గృహం అయితే నెల అద్దె రూ.7 వరకు ఉండేది.. అందులో పాత బడిన నివాసాలు, నిర్మించిన భవనాలకు అద్దెలు మార్పు ఉండేది.. ప్రస్తుతం గృహాలు అవే అయినా అద్దెల్లో మాత్రం మార్పు ఉంది. సింగిల్ బెడ్రూం గృహానికి రూ.7వేలు పైగా అద్దె చెబుతుండగా, డబుల్బెడ్రూం గృహానికి రూ.12 వేల వరకు అద్దె నిర్ణయించి యజమానులు చెబుతున్నారు. దీంతో అమాంతంగా పెరిగిన ఇంటి అద్దెలతో చిరుద్యోగులు హడలిపోతున్నారు. అధికారులు, ఉద్యోగులు వారి కొచ్చే నెలజీతం బట్టి నివాస గృహాలను ఎంపిక చేసుకుంటారు. నెలవారీ జీతం ఇంటి అద్దె నుంచి ఇతరత్రా కుటుంబ అవసరాలు, పిల్లల చదువులు, వ్యక్తగత అవసరాలు అన్నింటిని ఆ నెల జీతంతోనే సర్దుకుపోవాలి. దీంతో జీతాన్ని బట్టి నివాస గృహాన్ని ఎంపిక చేసుకుంటారు. కానీ చిరుద్యోగులు మాత్రం బాపట్లలో పెరిగిన అద్దెలు చూసి ఆందోళన చెందుతున్నారు. ఇంటి అద్దెకే వేలాది రూపాయలు వెచ్చిస్తే తమ కుటుంబ అవసరాలు ఏలా తీర్చుకోవాలని మదనపడుతున్నారు. దీంతో చాలా వరకు ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. నూతన జిల్లా కావడం పరిపాలన ప్రక్రియ వేగవంతం కాలేదు. మరికొన్ని రోజుల్లో పాలన పరమైన ప్రక్రియ వేగవంతమైతే ఉద్యోగులు స్థానికంగానే నివాసం ఉండాల్సి వస్తోంది. ఈ క్రమంలో ఆకాశానంటుతున్న అద్దెల భారంతో ఆందోళన చెందుతున్నారు. అద్దెలు చెల్లించడం భారంగా ఉంది బాపట్లలో జిల్లా ఏర్పాటుకు ముందు ఇంటి అద్దెలు సామాన్యులకు అందుబాటులో ఉండేవి. జిల్లా కేంద్రం ఏర్పడిన తర్వాత ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకున్న గృహాల యజమానులు ఒక్కసారిగా ఇంటి అద్దెలను అమాంతం పెంచేశారు. గతంలో రూ. 3500 నుంచి 4000 వరకు అద్దె చెల్లిస్తే బాపట్లలో డబల్‌బెడ్‌రూమ్ కలిగిన గృహం అద్దెకు లభించేది ప్రస్తుతం డబుల్ బెడ్రూం అద్దెకు కావాలంటే రూ. 7500 నుంచి 10 వేల వరకు చెల్లించాల్సి వస్తోంది. జిల్లా అధికారులు స్పందించి అద్దె నియంత్రణకు చర్యలు చేపట్టాలి. – సీహెచ్ జనార్ధన్‌రావు, బాపట్ల -
ఇల్లు అద్దెకు కావాలని నగల దోపిడీ
లంగర్‌హౌస్: ఇల్లు అద్దెకు కావాలని వచ్చిన దుండగుడు వృద్ధురాలిపై హత్యాయత్నం చేసి.. 8 తులాల బంగారు నగలు ఎత్తుకెళ్లాడు. లంగర్‌హౌస్ ఇన్స్పెక్టర్ ఎంఎ జావీద్ కథనం ప్రకారం.. మారుతీనగర్‌లో ఉన్న మూడంతస్తుల భవనంలో భాగ్యమేరీ (63) తన కొడుకు, కోడలితో కలిసి ఉంటోంది. కింది ఫ్లోర్లో కొడుకు, పై ఫ్లోర్లో వృద్ధురాలు ఉంటున్నారు. ఈమె ఉండే ఫ్లోర్లో ఒక ఫ్లాట్ ఖాళీ ఉంది. బుధవారం ఓ వ్యక్తి (40) వచ్చి తనకు ఆ ఫ్లాట్ కావాలని భాగ్యమేరీతో అన్నాడు. ఫ్లాట్ చూసిన తర్వాత మంచినీళ్లు కావాలన్నాడు. నీళ్లు తెచ్చేందుకు ఇంట్లోకి వెళ్తున్న వృద్ధురాలిపై ఒక్కసారిగా దాడి చేసి కిందపడేసి పిడి గుద్దులు గుద్దాడు. మెడకు వైర్ బిగిస్తూ.. బంగారు గొలుసు, చెవి కమ్మలు, చేతికి ఉన్న నాలుగు గాజులు లాక్కొని పారిపోయాడు. స్పృహ తప్పి పడిపోయిన భాగ్యమేరీకి కొద్దిసేపటికి స్పృహ రావడంతో కిందకు వచ్చి తన కోడలికి వి షయం చెప్పింది. సమాచారం అందుకున్న డీసీపీ వెంకటేశ్వర్రావు, ఆసిఫ్‌నగర్ ఏసీపీ గౌస్ మొహినుద్దీన్ ఘటనా స్థలాన్ని పరిశీలించి క్లూస్‌టీమ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. -
అద్దెల బాదుడు
- రెండు గదుల పోర్షన్‌కే రోజుకు రూ.10 వేలు అద్దె! - పుష్కరాల సాకుతో సొమ్ము చేసుకుంటున్న వైనం - హోటళ్లు, లాడ్జిల్లో గదులు హౌస్‌ఫుల్ సాక్షి, రాజమండ్రి : ‘ఇల్లు అద్దెకు ఇస్తారా?’ అని ఇప్పుడు రాజమండ్రిలోని కొన్ని ప్రాంతాల్లో ఏ ఇంటి యజమానినైనా అడిగితే.. రోజువారీ ఇస్తామని చెబుతున్నారు! ఇదేమిటనుకుంటున్నారా? డబుల్, త్రిబుల్ బెడ్రూమ్ ఇళ్లను రూమ్‌లు, హాల్‌ను వేరు చేసి మరీ అద్దెకు ఇస్తున్నారు. రోజువారీ అద్దె కూడా రూమ్‌కు వెయ్యి రూపాయల నుంచి రూ.2 వేల వరకూ వసూలు చేస్తున్నారు. అదే ఒక పోర్షన్ తీసుకోవాలనుకుంటే రోజుకు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకూ డిమాండు చేస్తున్నారు. మరికొంతమంది డార్మిటరీ మాదిరిగా మంచాలు వేసి అద్దెకు ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో ఇల్లు మారదామని ఏర్పాట్లు చేసుకున్నవారు ఈ నెలకు వాయిదా వేసుకుంటున్నారు. ఈ అద్దెల దరువు భరించలేక భక్తులే కాదు.. బయటి ప్రాంతాల నుంచి రాజమండ్రికి బదిలీ అయినవారు, ఉపాధి కోసం వచ్చినవారు ఇంటికోసం నానా ఇబ్బందులూ పడుతున్నారు. గోదావరి తీరానికి ఒకటి రెండు కిలోమీటర్ల పరిధిలో ఇళ్ల అద్దె చుక్కలను తాకుతోంది. హోటళ్లు, లాడ్జీల్లో గదుల్లేవని తెలుసుకున్న భక్తులు తమకు తెలిసినవారి ద్వారా అద్దె ఇళ్ల కోసం గాలిస్తున్నారు. ఇదే అదనుగా ఇంటి యజమానులు అద్దె నెలకు కాకుండా రోజువారీగా చెబుతున్నారు. ఇక ఘాట్లకు సమీపంలోని ఇంటి యజమానులైతే ఒకప్పుడు నెలకు నాలుగైదు వేల అద్దెకు ఇచ్చిన పోర్షన్లకే ఇప్పుడు రోజుకు రూ.10 వేల అద్దె చెబుతున్నారంటే డిమాండ్ ఏవిధంగా ఉందే ఊహించవచ్చు. క్యాష్ చేసుకునేందుకు పోటాపోటీ! గోదావరి పుష్కరాలకు కోట్లాదిగా భక్తులు వస్తారు. దీనిని క్యాష్ చేసుకునేందుకు ఆర్టీసీ, రైల్వే వంటి ప్రభుత్వ శాఖలే కాదు ప్రైవేటు వ్యాపారులూ పోటీ పడుతున్నారు. మరోవైపు హోటళ్లు, లాడ్జిల నిర్వాహకులు కూడా ముందుగానే జాగ్రత్త పడ్డారు. పుష్కరాల సమయంలోనే నాలుగు రాళ్లు వెనకేసుకోగలమని, మిగతా రోజుల్లో అంత బిజినెస్ ఉండదని చెబుతున్నారు. ఇదేం దారుణమని ఎవరైనా ప్రశ్నిస్తే.. ‘ప్రభుత్వాధికారులు, పోలీసులకే చాలావరకూ ఇచ్చేయాల్సి వచ్చింది! గదుల్లేవ్.. ఒకటీ రెండు మాత్రమే ఉన్నాయి. ఇంతకుముందు రూ.1200 ఉన్న డబుల్ బెడ్ రూమ్ టారిఫ్ ఇప్పుడు 12 గంటల చెక్ అవుట్‌తో రూ.2 వేలకు ఇస్తాం’ అని నగరంలో ఓ ‘సి’ గ్రేడ్ హోటల్ నిర్వాహకుడు చెప్పారు. వాస్తవానికి నగరంలో ‘ఎ’ గ్రేడ్ హోటళ్లు ఐదింటిలోని మొత్తం 334 గదుల్లో సగం, ‘బి’ గ్రేడ్ 24 హోటళ్లలోని 741 గదుల్లో 30 శాతం, ‘సి’ గ్రేడ్ 21 హోటళ్లలోని 299 గదుల్లో 25 శాతం మాత్రమే తీసుకున్నామని అధికారులు చెబుతున్నారు. ఇలా తీసుకున్న దాదాపు 1350 గదులను పుష్కరాలకొచ్చే వీవీఐపీలు, వీఐపీలు, ఉన్నతాధికారులకు కేటాయించనున్నారు. ఇవి కాకుండా పోలీసులు కూడా తమ ఉన్నతాధికారుల కోసం హోటళ్లలో మరికొన్ని గదులను అనధికారికంగా రిజర్వు చేయించినట్లు విమర్శలు వస్తున్నాయి. భక్తులకు బాదుడే బాదుడు మామూలుగా హోటళ్లు, లాడ్జీల్లో చెక్ అవుట్ సమయం 24 గంటలు ఉంటుంది. అధికారులకు కేటాయించిన రూములకు పుష్కరాలు 12 రోజులూ ఇదే సమయం వర్తిస్తుంది. టారిఫ్‌లో 25 శాతం తగ్గించేశారు. దీనివల్ల హోటళ్లు, లాడ్జిల యజమానులకు కలిగే నష్టాన్ని భర్తీ చేయడానికి భక్తులపై భారం వేస్తున్నారు. చెక్ అవుట్ టైం 12 గంటలకు కుదించేశారు కాబట్టి టారిఫ్ కూడా సగానికి తగ్గాలి. కానీ, అలాకాకుండా 20 శాతమే తగ్గించడానికి జిల్లా అధికారులు అనుమతి ఇచ్చారు. చెక్ అవుట్ టైం కుదించడం వల్ల రద్దీ తగ్గుతుందని, భక్తులు స్నానాలు ఇతరత్రా పూజలు ముగించుకొని వెనువెంటనే నగరం నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తారని ఓ హోటల్ మేనేజర్ అన్నారు. టారిఫ్ తగ్గించినా సర్వీస్ టాక్స్, ఇతరత్రా చార్జీలను మామూలుగానే వసూలు చేస్తున్నారు. హోటళ్ల నిర్వాహకులు. పుష్కరాల్లో 18, 19, 20, 22 తేదీలకు ప్రాధాన్యం ఉందని చెబుతున్నారు. ఈ దృష్ట్యా భక్తులు ఆ రోజుల్లో రెట్టింపు సంఖ్యలో రావచ్చన్నది అంచనా. ఆయా తేదీల్లో నగరంలోని ఏ హోటల్, లాడ్జిలోనూ ఒక్క గది కూడా దొరకని పరిస్థితి. దీంతో గంటల చొప్పున అద్దెకు ఇచ్చేందుకు కొన్నిచోట్ల ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులపై భారం మోపే హోటళ్లు, లాడ్జిల నిర్వాహకులకే కాకుండా ఇంటి యజమానులకు కూడా అధికారులు తగు హెచ్చరికలు జారీ చేయాలని సగటు పౌరులు ఆశిస్తున్నారు. ఏం చర్యలు చేపడతారో వేచి చూడాల్సిందే! -
అద్దె ఇంటి వేటలో కేజ్రీవాల్ కష్టాలు
సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తరువాత కూడా దాదాపు నాలుగు నెలలుగా అధికార నివాసంలోనే ఉం టోన్న ఆమ్ ఆద్మీ పార్టీ నేత అర్వింద్ కేజ్రీవాల్ అద్దె ఇంటి వేటలో పడ్డారు. అయితే ఢిల్లీలో తనకు నచ్చిన ఇల్లు అద్దెకు దొరకడం ఆయనకు పెద్ద కష్టంగా మారింది. ప్రస్తుతం ఆయన నివాసముం టున్న తిలక్లేన్లోని ప్రభుత్వ నివాసాన్ని జూన్ 30లోగా ఖాళీ చేయవలసి ఉంది. ఈలోగా అద్దె ఇంటికి మారాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. మయూర్ విహార్ ప్రాంతంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకోవాలని ఇంటి యజమానులతో మాట్లాడారు కూడా. అయితే మొదట ఇంటిని అద్దెకివ్వడానికి అంగీకరించిన యజమాని మంగళవారం మాటమార్చారు. కేజ్రీవాల్‌కు ఇంటిని అద్దెకు ఇవ్వడానికి నిరాకరించారు. ఇరుగుపొరుగున నివ సించే వారు అభ్యంతరాలు వ్యక్తం చేయడం వల్ల ఇంటి యజమాని కేజ్రీవాల్‌కు ఇల్లు ఇవ్వడానికి నిరాకరించినట్లు సమాచారం. కేజ్రీవాల్ నివాసముండడం వల్ల పరిసర ప్రాంతాలలో ప్రశాంతత లోపిస్తుందని, ఆయనను కలవడానికి వచ్చే జనా ల కారణంగా కాలనీవాసులకు ఇబ్బంది ఎదురవుతుందని వారు భావించారని అంటున్నారు. తన కుటుంబంతో నివసించడానికి అనువుగా ఉండడంతో పాటు పార్టీ కార్యాలయం నడపడానికి కూడా వీలుగా ఉండే ఇంటి కోసం కేజ్రీవాల్ అన్వేషిస్తున్నారు. గత కొంత కాలంగా ఆయన మయూర్ విహార్, జంగ్‌పురా, మహా రాణి బాగ్, రాజేంద్ర నగర్, మోడల్ టౌన్, పటేల్ నగర్, గ్రీన్‌పార్క్, హౌజ్ ఖాస్, గ్రేటర్ కైలాష్, న్యూఫ్రెండ్స్ కాలనీ వంటి పోష్ ఏరియాల్లో ఇంటి కోసం వెదికారు, మయూర్ విహార్ ఇల్లు ఆయనకు నచ్చింది. కానీ ఇంటి యజమాని నిరాకరణతో ప్రయత్నం మళ్లీ మొదటికొచ్చింది.