అద్దెల బాదుడు
- రెండు గదుల పోర్షన్‌కే రోజుకు రూ.10 వేలు అద్దె!
- పుష్కరాల సాకుతో సొమ్ము చేసుకుంటున్న వైనం
- హోటళ్లు, లాడ్జిల్లో గదులు హౌస్‌ఫుల్
సాక్షి, రాజమండ్రి : ‘ఇల్లు అద్దెకు ఇస్తారా?’ అని ఇప్పుడు రాజమండ్రిలోని కొన్ని ప్రాంతాల్లో ఏ ఇంటి యజమానినైనా అడిగితే.. రోజువారీ ఇస్తామని చెబుతున్నారు! ఇదేమిటనుకుంటున్నారా? డబుల్, త్రిబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను రూమ్‌లు, హాల్‌ను వేరు చేసి మరీ అద్దెకు ఇస్తున్నారు. రోజువారీ అద్దె కూడా రూమ్‌కు వెయ్యి రూపాయల నుంచి రూ.2 వేల వరకూ వసూలు చేస్తున్నారు. అదే ఒక పోర్షన్ తీసుకోవాలనుకుంటే రోజుకు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకూ డిమాండు చేస్తున్నారు. మరికొంతమంది డార్మిటరీ మాదిరిగా మంచాలు వేసి అద్దెకు ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
దీంతో ఇల్లు మారదామని ఏర్పాట్లు చేసుకున్నవారు ఈ నెలకు వాయిదా వేసుకుంటున్నారు. ఈ అద్దెల దరువు భరించలేక భక్తులే కాదు.. బయటి ప్రాంతాల నుంచి రాజమండ్రికి బదిలీ అయినవారు, ఉపాధి కోసం వచ్చినవారు ఇంటికోసం నానా ఇబ్బందులూ పడుతున్నారు. గోదావరి తీరానికి ఒకటి రెండు కిలోమీటర్ల పరిధిలో ఇళ్ల అద్దె చుక్కలను తాకుతోంది. హోటళ్లు, లాడ్జీల్లో గదుల్లేవని తెలుసుకున్న భక్తులు తమకు తెలిసినవారి ద్వారా అద్దె ఇళ్ల కోసం గాలిస్తున్నారు. ఇదే అదనుగా ఇంటి యజమానులు అద్దె నెలకు కాకుండా రోజువారీగా చెబుతున్నారు. ఇక ఘాట్‌లకు సమీపంలోని ఇంటి యజమానులైతే ఒకప్పుడు నెలకు నాలుగైదు వేల అద్దెకు ఇచ్చిన పోర్షన్‌లకే ఇప్పుడు రోజుకు రూ.10 వేల అద్దె చెబుతున్నారంటే డిమాండ్ ఏవిధంగా ఉందే ఊహించవచ్చు.
క్యాష్ చేసుకునేందుకు పోటాపోటీ!
గోదావరి పుష్కరాలకు కోట్లాదిగా భక్తులు వస్తారు. దీనిని క్యాష్ చేసుకునేందుకు ఆర్టీసీ, రైల్వే వంటి ప్రభుత్వ శాఖలే కాదు ప్రైవేటు వ్యాపారులూ పోటీ పడుతున్నారు. మరోవైపు హోటళ్లు, లాడ్జిల నిర్వాహకులు కూడా ముందుగానే జాగ్రత్త పడ్డారు. పుష్కరాల సమయంలోనే నాలుగు రాళ్లు వెనకేసుకోగలమని, మిగతా రోజుల్లో అంత బిజినెస్ ఉండదని చెబుతున్నారు. ఇదేం దారుణమని ఎవరైనా ప్రశ్నిస్తే.. ‘ప్రభుత్వాధికారులు, పోలీసులకే చాలావరకూ ఇచ్చేయాల్సి వచ్చింది! గదుల్లేవ్.. ఒకటీ రెండు మాత్రమే ఉన్నాయి.
ఇంతకుముందు రూ.1200 ఉన్న డబుల్ బెడ్ రూమ్ టారిఫ్ ఇప్పుడు 12 గంటల చెక్ అవుట్‌తో రూ.2 వేలకు ఇస్తాం’ అని నగరంలో ఓ ‘సి’ గ్రేడ్ హోటల్ నిర్వాహకుడు చెప్పారు. వాస్తవానికి నగరంలో ‘ఎ’ గ్రేడ్ హోటళ్లు ఐదింటిలోని మొత్తం 334 గదుల్లో సగం, ‘బి’ గ్రేడ్ 24 హోటళ్లలోని 741 గదుల్లో 30 శాతం, ‘సి’ గ్రేడ్ 21 హోటళ్లలోని 299 గదుల్లో 25 శాతం మాత్రమే తీసుకున్నామని అధికారులు చెబుతున్నారు. ఇలా తీసుకున్న దాదాపు 1350 గదులను పుష్కరాలకొచ్చే వీవీఐపీలు, వీఐపీలు, ఉన్నతాధికారులకు కేటాయించనున్నారు. ఇవి కాకుండా పోలీసులు కూడా తమ ఉన్నతాధికారుల కోసం హోటళ్లలో మరికొన్ని గదులను అనధికారికంగా రిజర్వు చేయించినట్లు విమర్శలు వస్తున్నాయి.
భక్తులకు బాదుడే బాదుడు
మామూలుగా హోటళ్లు, లాడ్జీల్లో చెక్ అవుట్ సమయం 24 గంటలు ఉంటుంది. అధికారులకు కేటాయించిన రూములకు పుష్కరాలు 12 రోజులూ ఇదే సమయం వర్తిస్తుంది. టారిఫ్‌లో 25 శాతం తగ్గించేశారు. దీనివల్ల హోటళ్లు, లాడ్జిల యజమానులకు కలిగే నష్టాన్ని భర్తీ చేయడానికి భక్తులపై భారం వేస్తున్నారు. చెక్ అవుట్ టైం 12 గంటలకు కుదించేశారు కాబట్టి టారిఫ్ కూడా సగానికి తగ్గాలి. కానీ, అలాకాకుండా 20 శాతమే తగ్గించడానికి జిల్లా అధికారులు అనుమతి ఇచ్చారు. చెక్ అవుట్ టైం కుదించడం వల్ల రద్దీ తగ్గుతుందని, భక్తులు స్నానాలు ఇతరత్రా పూజలు ముగించుకొని వెనువెంటనే నగరం నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తారని ఓ హోటల్ మేనేజర్ అన్నారు.
టారిఫ్ తగ్గించినా సర్వీస్ టాక్స్, ఇతరత్రా చార్జీలను మామూలుగానే వసూలు చేస్తున్నారు. హోటళ్ల నిర్వాహకులు. పుష్కరాల్లో 18, 19, 20, 22 తేదీలకు ప్రాధాన్యం ఉందని చెబుతున్నారు. ఈ దృష్ట్యా భక్తులు ఆ రోజుల్లో రెట్టింపు సంఖ్యలో రావచ్చన్నది అంచనా. ఆయా తేదీల్లో నగరంలోని ఏ హోటల్, లాడ్జిలోనూ ఒక్క గది కూడా దొరకని పరిస్థితి. దీంతో గంటల చొప్పున అద్దెకు ఇచ్చేందుకు కొన్నిచోట్ల ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులపై భారం మోపే హోటళ్లు, లాడ్జిల నిర్వాహకులకే కాకుండా ఇంటి యజమానులకు కూడా అధికారులు తగు హెచ్చరికలు జారీ చేయాలని సగటు పౌరులు ఆశిస్తున్నారు. ఏం చర్యలు చేపడతారో వేచి చూడాల్సిందే!